తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ స్కాండల్, స్టెప్ బై స్టెప్

పార్లమెంట్ ఎన్నికల వేళ వెలుగుచూసిన గత బీఆర్ఎస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ బాగోతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ట్యాపింగ్‌పై తవ్వేకొద్దీ ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి.

Update: 2024-03-28 07:13 GMT
phone tapping

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ బాగోతం ఎలా బయటపడిందో తెలిస్తే షాకవుతారు... అది హైదరాబాద్ నగరంలోని స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయం... స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఉన్న లాగిన్ రూమ్‌లో ఫోన్ పరికరాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేశారు...ఈ ఘటనతో తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేత ఎ రేవంత్ రెడ్డితోపాటు పలువురు ప్రతిపక్ష నేతలు,రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సంభాషణలను ప్రణీత్ రావు అండ్ టీం రికార్డు చేసిందని దర్యాప్తులో బయటపడింది. సంభాషణలను రికార్డు చేసి ఉంచిన కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేసి వాటిని వికారాబాద్ అడవుల్లో పడేశారని పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో వెలుగుచూసింది.


రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే నిఘా కార్యాలయం...రేవంత్ సహా ఎందరో నేతల సంభాషణల రికార్డ్ చేశారని దర్యాప్తులో ఆధారాలు లభించాయి.పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే నిఘా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది. రేవంత్ ఫోన్ సంభాషణలను ప్రణీత్ రావు రవిపాల్ విన్నారని తేలడంతో వారిద్దరిని పోలీసులు ప్రశ్నించాలని నిర్ణయించారు. ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఓఎస్డీ టి ప్రభాకర్ రావు నేతృత్వంలోని పోలీసుల బృందం పాల్గొందని ఆధారాలు లభించాయి. ట్యాపింగ్ సమాచారంతో రియల్టర్లు, జ్యువెలర్స్ , పారిశ్రామికవేత్తల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు.

ట్యాపింగ్ వెనుక కీలక నేతల హస్తం : ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు కీలక నేతలే సూత్రధారులుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రణీత్ రావు అండ్ బృందం సిరిసిల్ల, వరంగల్, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ టీవీ ఛానల్ యజమాని కార్యాలయంలో సర్వర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారని వెలుగుచూసింది. ప్రణీత్ రావు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో వందలాది ఫోన్ నంబర్లు ఉన్నాయని, ఆ నంబర్లను ట్యాపింగ్ చేశారని తేల్చారు. ట్యాపింగ్ చేసిన ఫోన్ నంబర్లలో ప్రతిపక్ష నేతలే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వెల్లడైంది.

ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి?
అనుమతి లేకుండా మరొకరి ఫోన్ సంభాషణను వినడాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. మీరు ఎవరితోనైనా ఫోనులో మాట్లాడుతుంటే మూడో వ్యక్తి మీ సంభాషణను రికార్డ్ చేస్తే దాన్ని ట్యాపింగ్ చేయడం అంటారు. ఎవరికైనా తమ ఫోన్ ట్యాపింగ్ అవుతుందనే అనుమానం వస్తే వారు తమ ప్రైవసీ హక్కు ఉల్లంఘనపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయవచ్చు. ఒక్క మిలిటెంట్ల విషయంలో అనుమతి లేకుండానే 72 గంటల పాటు నిఘా సంస్థలు ఒక ఫోన్ ను ట్యాపింగ్ చేయవచ్చు.

ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారంటే...
ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే నాలుగు వర్క్ స్టేషన్లు, డెస్క్ టాప్ మానిటర్లు, హెడ్ ఫోన్లు అవసరం. సర్వర్లు, రికార్డింగ్ పరికరాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించే కేబుల్స్ తో కావాలనుకున్న వారి ఫోన్ సంభాషణలను రికార్డు చేస్తుంటారు. స్టింగ్ రే పరికరాల సాయంతోనూ ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు.

ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమేనా ?
ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్ట విరుద్ధం. అయితే దేశ సార్వభౌమ్వం, శాంతి భద్రతల పరిరక్షణ విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంఘవిద్రోహ శక్తులు, ఉగ్రవాదుల ఫోన్ సంభాషణలను రికార్డు చేస్తుంటాయి. పోలీసు ఉన్నతాధికారుల వినతిపై చట్టానికి లోబడి సర్వీస్ ప్రొవైడర్ అవకాశం కల్పిస్తారు. రాష్ట్రాల పరిధిలో ఫోన్ ట్యాపింగ్ ను పోలీసులు చేస్తుంటారు. కేంద్ర పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), రీసెర్చ్ అండ్ అనాల‌సిస్ వింగ్ (ఆర్ఏడ‌బ్ల్యూ), డైరెక్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్‌, ఢిల్లీ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటాయి.,

టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ఏం చెబుతుందంటే...
దేశ భద్రత సవాలుగా మారినపుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ -1885 ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. ఈ చట్టంలోని సెక్షన్ - 5(2) ప్రకారం దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ, ప్రజాశ్రేయస్సు వంటి అంశాల్లో రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేసే వీలు ఉంది. దీని కోసం ప్రభుత్వం పలు అనుమతులు పొందాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర హోంశాక కార్యదర్శి అనుమతి పొందాలి.

ఫోన్ ట్యాపింగ్ కు మూడేళ్ల జైలు శిక్ష
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 26 బి ప్రకారం పోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. పౌరుల గోప్యత హక్కును ఉల్లంఘించడం కింద ఫోన్ ట్యాపింగ్ వస్తుంది. పెగాసిస్ అనే ఇజ్రాయెల్ స్పైవేర్ సాయంతో భారతదేశంలో జర్నలిస్టులపై నిఘా పెట్టారని వార్తలు వెలువడ్డాయి. ఏపీలో గతంలో పెగాసస్ తో నిఘా వేశారని ఆరోపణలు వచ్చాయి.

ఫోన్ ట్యాపింగ్ బాగోతంలో రవిపాల్ కీలక పాత్ర

ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ బాగోతంలో ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్ గా పనిచేసిన రవిపాల్ కీలక పాత్ర పోషించారని వెల్లడైంది. ట్యాపింగ్ డివైజ్ లను రవిపాల్ కొన్నాడని పోలీసుల దర్యాప్తులోనే తేలింది. కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ కంపెనీ నుంచి ట్యాపింగ్ డివైజ్ లను దిగుమతి చేసుకున్నారని, దీని కోసం ఎస్ఐబీ కోట్లరూపాయల డబ్బు కూడా చెల్లించిందని వెల్లడైంది. ఈ ట్యాపింగ్ పరికరాలను ఇజ్రాయెల్ నుంచి రప్పించడంలో ఓ ఎమ్మెల్సీ కూడా కీలకపాత్ర పోషించాడని తేలింది. గతంలో తన ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో గవర్నరుగా పనిచేసిన తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసు విషయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు.

రోజుకో కొత్త విషయం వెలుగులోకి...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు ప్రేమేయం ఉందని తేలింది. నగర శివారు పోలీసు కమిషనరేట్ లో పనిచేసిన ఓ డీసీపీతోపాటు మరో 15 మంది ఎస్ఐబీ అధికారుల పాత్ర ట్యాపింగ్ లో ఉందని తాజాగా వెలుగుచూసింది. ట్యాపింగ్ బాగోతంలో కొందరు పోలీసు అధికారులు కొంతమంది బడా వ్యాపారులు, హవాలా రాకెట్ నిర్వాహకుల వద్ద నుంచి కోట్లాదిరూపాయలను దండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్యాపింగ్ కు పాల్పడిన పోలీసు అధికారుల ఆస్తులపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

ఇతర రాష్ట్రాల్లోనూ ట్యాపింగ్
తెలంగాణ ఎస్ఐబీ అధికారులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని తేలింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొందరి ఫోన్లపై తెలంగాణ పోలీసు అధికారులు నిఘావేశారు. దీనికోసం తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని పాలమూరు జిల్లాలో పాగా వేసి ఏపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని వెల్లడైంది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెర్వు కేంద్రంగా కూడా ఫోన్ ట్యాపింగ్ సాగిందని వెలుగుచూసింది.

కామారెడ్డిలో ఫోన్ ట్యాపింగ్ కేంద్రం
కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డిలో ఫోన్ ట్యాపింగ్ కోసం కామారెడ్డిలో ఓ వార్ రూమ్ ను ఏర్పాటు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. కాంగ్రెస్ నేతలకు చెందిన ఫోన్లను ట్యాప్ చేసి వారి సంస్థలపై పోలీసులు దాడులు చేశారని సమాచారం. కామారెడ్డిలో ఫోన్ ట్యాపింగ్ పై కొందరు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు మహబూబ్ నగర్ జిల్లాలో జరిపిన ట్యాపింగ్ గురించి అక్కడి నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

ట్యాపింగ్ బాగోతంపై డీజీపీకి రోజుకొకరు ఫిర్యాదు
తెలంగాణలో ట్యాపింగ్ బాగోతంపై డీజీపీ రవి గుప్తాకు రోజుకొకరు ఫిర్యాదు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన భర్త కొండా మురళితోపాటు తన ఫోన్లను ట్యాప్ చేశారని సాక్షాత్తూ రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్ర ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
ట్యాపింగ్ కేసులో నిందితులంతా జైలుకు వెళ్లాల్సిందేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చెప్పారు. తాను కూడా ట్యాపింగ్ బాధితుడినేనని యెన్నం పేర్కొన్నారు. ట్యాపింగ్ బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రతి జిల్లాలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని రాంనగర్ కౌన్సిలర్ బురుజు సుధాకర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు.
దుబ్బాక, హుజురాబాద్, మునుగోడ ఉప ఎన్నికల సందర్భంగా తన ఫోన్ ను ట్యాపింగ్ చేసినట్లు డీఎస్పీ ప్రణీత్ రావు అంగీకరించారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చెప్పారు. తన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ జిల్లా మాజీ కలెక్టరు వెంకట్రామిరెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లపై కేసులు నమోదు చేయాలని రఘునందన్ రావు డీజీపీ రవిగుప్తాను కోరారు. ఈ మేర వినతిపత్రాన్ని రఘునందన్ రావు డీజీపీకి ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులు, బడా వ్యాపారులు, హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు.

వెంట్రుక కూడా పీకలేరు : కేటీఆర్
రేవంత్‌కు భయపడే వారెవరూలేరని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, స్కాములంటూ వార్తలు రాయించుకొని ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు, పనిచేతకాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ చేయాలి. నీకు అధికారం ఉంది కదా. ఏం చేస్తావో చేసుకో. ఎక్కడెక్కడ తప్పులు జరిగినవో, ఎవరెవరు తప్పులు చేశారో వాళ్లపై చర్యలు తీసుకో’’ అని కేటీఆర్ వివరించారు.


Tags:    

Similar News