Mahesh Kumar Goud | ‘ఫార్ములా ఈ-కార్ రేసులో అవినీతి జరిగింది’

తెలంగాణ రాష్ట్రమంతా ప్రస్తుతం ఫార్ములా ఈ-కార్ రేసు గురించే చర్చ జరుగుతోంది.

Update: 2024-12-20 07:16 GMT

తెలంగాణ రాష్ట్రమంతా ప్రస్తుతం ఫార్ములా ఈ-కార్ రేసు గురించే చర్చ జరుగుతోంది. ఇందులో అవినీతి జరిగిందా? జరగలేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ఖ్యాతి కోసం కేటీఆర్ ఎంతో శ్రమించి రాష్ట్రంలో ఈ రేసు నిర్వహించారని, రాష్ట్ర బాగోగులు కోరుకోవడమే ఆయన చేసిన నేరమా అంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ-కార్ రేసులో ముమ్మాటికీ అవినీతి జరిగిందని, అవినీతే లేకపోతే భయమెందుకంటూ చురకలంటిస్తున్నారు. ఈ కర్మంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఫార్ములా ఈ-కార్ రేసులో అవినీతి జరిగిందన్న మాట వందకు వందశాతం వాస్తవమని, అతి త్వరలోనే ఈ విషయం తేటతెల్లం కానుందని వ్యాఖ్యానించారు. ఈ అవినీతిని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.

కేటీఆర్‌పై కేసు సక్రమమే

‘‘ఫార్ములా ఈ` కారు రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవం. అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలున్నా కడిగిన ముత్యమంటూ కేటీఆర్‌ తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చుకోవడం హాస్యాస్పదం. ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్‌ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించాక ఇది అక్రమ కేసు ఎలా అవుతుంది..? చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు, కోర్టులో తేల్చుకోవాలి. హెచ్‌ఎమ్‌డీఏ భాగస్వామ్యం కాకున్నా.. దాని ఖాతా నుండి ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే రూ.54.88 కోట్లు చెల్లించేలా కేటీఆర్‌ ఒత్తిడి తెచ్చారు. ఆధారాలు కనిపిస్తున్నా..అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్‌ బుకాయిస్తున్నారు’’ అని విమర్శించారు.

అధికారులు బలిపశువులవుతున్నారు

‘‘గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వలే.. కాంగ్రెస్ అక్రమంగా కేసులు బనాయించట్లేదు. రేసింగ్ స్కాంలో నిబంధనల ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకునే అధికారులు ముందుకెళ్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ఫండ్స్‌ మంజూరు ఎలా చేస్తారు? హద్దుల్లేని కేటీఆర్‌ అక్రమాలతో అధికారులు బలిపశువులుగా మారారు. నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు బదిలీ చేయడంతో ఆదాయ పన్ను శాఖకు హెచ్‌ఎండీఏ రూ.8 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి వచ్చింది. నిబంధనలను కాదని మూడేళ్లలో రూ.600 కోట్లు చెల్లించేలా ఒప్పందం కేటీఆర్‌ అనుమతితోనే జరిగింది’’ అని అన్నారు.

అధికారంలోనే ఉన్నామనుకుంటున్నారా కేటీఆర్

‘‘నిబంధనలకు విరుద్దంగా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఫార్ములా ఈ-కారు రేసు కోసం 2.8 కి.మీల ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. నిబంధనలను అతిక్రమించి ప్రజలను ఇబ్బంది పెట్టడం హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజిని పెంచడమా..? బీఆర్ఎస్ నేతల దోపిడీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. బీఆర్ఎస్ నేతలు ఏం చేసినా వారి స్వలాభం కోసమే? తెలంగాణ, హైదరాబాద్‌ కోసం కాదని ఈ అక్రమాలే నిరూపిస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసు పేరుతో నిధులు గోల్‌మాల్‌ చేసి ఇప్పుడు సుద్ధపూసగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఛీకొట్టి గద్దె దింపినా ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలతో కేటీఆర్ బెదిరింపుల వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసులో అధికారులకు సహకరించాల్సిన కేటీఆర్‌ అహంకారంతో విర్రవీగుతూ, ఉద్యమకారులం భయపడం అంటూ కేసుకు సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News