హైదరాబాద్‌లో 50వేలమంది సభ్యులతో సైక్లింగ్ మహోద్యమం

సైకిల్ సవారీకి హైదరాబాదీలు జై కొడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతున్న సైక్లింగ్ హైదరాబాద్ లో మహోద్యమంలా సాగుతోంది.ప్రపంచ సైకిల్ దినోత్సవాన స్పెషల్ స్టోరీ.

Update: 2024-06-02 01:00 GMT
చార్మినార్ చెంత సైక్లింగ్ చేస్తున్న హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ సభ్యులు

సైకిల్...ఒకప్పుడు పేదల రవాణాకు ఉపయోగపడే వాహనం...నేడది కార్లలో షికారు చేసే బడా బాబులకు కూడా సైకిల్ సవారీ నిత్యకృత్యంగా మారింది. హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యం కోసం కార్లను వదిలి సైకిళ్లపై సవారీకి క్రేజ్ పెరిగింది. సైకిల్ సవారీని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ స్వచ్ఛంద సంస్థలో 50వేల మంది సభ్యులున్నారంటే సైక్లింగ్ పట్ల హైదరాబాదీలు మక్కువ చూపిస్తున్నారని విదితమవుతోంది.

- జూన్ 2వతేదీ...ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో కేఎంవీ ప్రాజెక్టు ఆఫీసు నుంచి ఉదయం 6 గంటల నుంచి సైక్లింగ్ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనున్నారు.
- ఈ ఈవెంటులో సైక్లింగ్ పట్ల తమకున్న ప్రేమను ప్రదర్శించడానికి ఈవెంటులో డ్రాయింగ్‌, పెయింటింగ్‌, స్కెచ్‌, గ్రాఫిక్ డిజైన్ పోస్టర్లు, ఛాయాచిత్రాల ప్రదర్శనను హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ సభ్యులు చేపట్టనున్నారు.
ఆరోగ్య పరిరక్షణ కోసం సైక్లింగ్ చేద్దాం రండి
ప్రపంచ సైకిల్ దినోత్సవం 2024 కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన స్థిరమైన పట్టణ వాతావరణాన్ని సృష్టించడమే మా లక్ష్యం అంటారు హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ మేయర్ సంతాన సెల్వన్. హైదరాబాద్‌లో యాక్టివ్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని వయసుల సైక్లింగ్ ఔత్సాహికులు ఈవెంట్‌లో చేరాలని ఆయన కోరారు. ఆరోగ్య పరిరక్షణ కోసం సైక్లింగ్ చేద్దాం రండి అంటూ సెల్వన్ పిలుపునిచ్చారు.
కరోనా సమయంలో హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ ఆవిర్భావం
కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య పరిరక్షణ పరమావధిగా హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ ఆవిర్భవించింది. గచ్చిబౌలిలో సైక్లింగ్ ఉద్యమం ముందు కొంతమంది సభ్యులతో ప్రారంభమైంది. అలా ఔత్సాహిక సభ్యులు చేరుతూ హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ లో 50వేల మంది సభ్యులకు పెరిగారు. కొవిడ్ సమయంలో 300మంది సైక్లింగ్ వాలంటీర్లు రోగులకు ఆహారం, మందులు అందించారు.

కిలోమీటరు దూరం అయితే నడకే బెస్ట్
హైదరాబాద్ సైక్లింగ్ విప్లవ సంస్థ కేవలం సైక్లింగ్ పైనే కాకుండా పాదచారుల కమ్యూనిటీకి, ప్రజా రవాణాకు మద్ధతు ఇస్తుంది. ఏదైనా పనిమీద ఒక కిలోమీటరు దూరం వెళ్లాలంటే నడచి వెళ్లాలని, 5 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే సైకిలుపై వెళ్లాలని సైక్లింగ్ ఔత్సాహికులు ప్రచారం చేస్తున్నారు. 6 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే ప్రజా రవాణ అయిన మెట్రో, బస్సులను వినియోగించుకోవాలని కోరుతున్నారు. దీనిపై హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ సభ్యులు హైదరాబాదీల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ , హైదరాబాద్ మెట్రోతో కలిసి మొబిలిటీ ప్రచారం చేస్తున్నారు.

ఎన్నెన్నో సైక్లింగ్ ఈవెంట్లు
హైదరాబాద్ నగరంలో యాక్టివ్ మొబిలిటీని ప్రోత్సహించడానికి సైక్లింగ్ విప్లవం పలు పెద్ద ఈవెంట్లను నిర్వహించింది. హైదరాబాద్ సైక్లింగ్ విప్లవ సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్సులో 5వేల మంది సభ్యులు సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ చేస్తూ వచ్చి ఈవెంటులో పాల్గొని సైక్లింగ్ ఉద్యమానికి చేయూత ఇచ్చారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించారు. కరీంనగర్ నుంచి రామగుండం మీదుగా కవ్వాల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వరకు 40 గంటల సైక్లింగ్ రైడ్ నిర్వహించామని ఔత్సాహిక సైక్లిస్టు రవి చెప్పారు. ట్యాంక్ బండ్ నుంచి చార్మినార్ దాకా సైక్లింగ్ టూర్ నిర్వహించారు. నిజాంపేటలో ఎస్‌ఎల్‌జి హాస్పిటల్స్ 5కె రన్నింగ్,సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించింది.

మహిళా సైక్లిస్టులు కూడా...
హైదరాబాద్ నగరంలో మహిళా సైక్లిస్టులు కూడా ముందుకు వచ్చారు. ఆరోగ్యంతో పాటు కమ్యూనిటీ సోషల్ లైఫ్ అందించే సైక్లింగ్ ఉద్యమంలో తాను భాగస్వామురాలినయ్యానని హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న రాథ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘నేను మొదట మా పిల్లలను పాలపిట్ట సైక్లింగ్ సెంటరుకు తీసుకువెళ్లే దానిని, సైక్లింగ్ వల్ల కలిగే లాభాలు తెలుసుకొని నేనూ సైక్లింగ్ ఉద్యమంలో సభ్యురాలిగా చేరాను’ అని రాధ వివరించారు. ప్రతీ వీకెండులో తాను సైక్లింగ్ చేస్తూ ఉత్సాహం పొందుతున్నానన్నారు.

డెడికేటెడ్ కాంప్రహెన్సివ్ సైక్లింగ్ నెట్ వర్క్ కావాలి
హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ ఉద్యమం జోరుగా సాగుతున్నందున డెడికేటెడ్ కాంప్రహెన్సివ్ సైక్లింగ్ నెట్ వర్క్ కావాలని సైక్లింగ్ ఈవెంట్ నిర్వాహకుడు రవి సాంబ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నగరంలో వాక్ వే లాగా సైక్లిస్టుల కోసం ప్రత్యేకంగా సైక్లింగ్ వే కావాలని ఆయన కోరారు. ఉద్యోగులు ఇళ్ల నుంచి మెట్రో రైల్వే స్టేషన్లకు సైకిళ్లపై వచ్చి అక్కడ వాటిని పార్కింగ్ చేసి, రైలెక్కి దిగి...మళ్లీ కార్యాలయానికి వెళ్లేందుకు సైకిళ్లను అందుబాటులో ఉంచాలని రవి సూచించారు.

ఈ రోడ్డు మాది కూడా...
సైక్లింగ్ హైదరాబాద్ నగరంలో మహోద్యమంలా సాగుతోంది. సైక్లిస్టుల కోసం ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డు నానక్ రాంగూడ నుంచి అప్పా జంక్షన్ మీదుగా కొల్లూరు దాకా సోలార్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించారు. ఈ సోలార్ ట్రాక్ వల్ల వీధి దీపాలకు కావాల్సిన విద్యుత్ లభిసుందని సాఫ్ట్ వేర్ ఇంజినీరు అయిన సైక్లిస్ట్ కృష్ణ చైతన్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు నలువైపులా సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు కూడా మాదేనంటూ సైక్లిస్టులకు కూడా దారి ఇవ్వండని కృష్ణ చైతన్య కోరారు. తాను వెన్నునొప్పితో బాధపడుతుండేవాడినని, సైక్లింగ్ చేయడం వల్ల ఆ నొప్పి దూరమై తాను ఫిట్ నెస్ తో ఉన్నానని కృష్ణ చైతన్య వివరించారు.

సైక్లింగ్ పై హైదరాబాదీల్లో చైతన్యం
హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ సంస్థ సైక్లింగ్ పై హైదరాబాదీల్లో చైతన్యం తీసుకువచ్చింది. ‘‘మేం నగర పౌరులను వారి కార్లను విక్రయించమని అడగడం లేదు. పర్యావరణ పరిరక్షణ, వారి ఆరోగ్యం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించాలని మేం కోరుతున్నాం’’అని హైదరాబాద్ సైకిల్ మేయర్ సంతాన సెల్వన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.నగరంలోని శామీర్‌పేట్, మేడ్చల్, ఈసీఐఎల్, ఎల్‌బి నగర్, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, ఆరామ్‌ఘర్, బీహెచ్‌ఇఎల్, గచ్చిబౌలి, గండి మైసమ్మ ప్రాంతాల ప్రజలను సైక్లింగ్ ఈవెంట్లలో భాగస్వాములను చేశారు.

సైక్లింగ్ రైడ్ లకు హైదరాబాదీల స్వాగతం
నడక, సైక్లింగ్ వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. గుండె జబ్బులు, స్ట్రోక్, కొన్ని కేన్సర్లు, మధుమేహం మరణాల ప్రమాదాన్ని తగ్గించడానికి నడక, సైక్లింగ్ ఉపయోగపడుతోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. తక్కువ ధరతో శుభ్రమైన, పర్యావరణానికి సరిపోయే స్థిరమైన రవాణా సాధనం సైకిల్. ఈ సైకిల్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతోంది. సమాజంలో సైక్లింగ్ సంస్కృతిని అభివృద్ధి చేయడానికి సైకిల్ రైడ్‌లను నిర్వహించే కార్యక్రమాలను హైదరాబాదీలు స్వాగతిస్తున్నారు.








Tags:    

Similar News