Fengal Cyclone | తెలంగాణలోనూ ఫెంజాల్ తుపాన్ ప్రభావం, ఎల్లో అలర్ట్
ఫెంజాల్ తుపాన్ ప్రభావం వల్ల తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ చెన్నైకి 110 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు.
By : The Federal
Update: 2024-11-30 11:25 GMT
ఫెంజాల్ తుపాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు శనివారం సాయంత్రం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ఫెంజాల్ నేపథ్యంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణ తీరప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
- నైరుతి బంగాళాఖాతం మీదుగా ఫెంజాల్ తుపాన్ గత 6 గంటల్లో 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, శనివారం అక్షాంశానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది.పుదుచ్చేరికి 120 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.
ఫెంజాల్ తుపాన్ ప్రభావం తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఉంటుందని హైదరాబాద్ ఐఎండీ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు చెప్పారు. ఈదురుగాలుల ప్రభావం వల్ల తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని అధికారులు చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 8.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో 8.2 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.