'నయీమ్ కేసు ఫైల్స్ రీ ఓపెన్ చెయ్యండి'
తెలంగాణలో మరోసారి నయీమ్ కేసు తెరపైకి వచ్చింది. నయీమ్ కేసు రీ ఓపెన్ చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి.;
తెలంగాణలో మరోసారి నయీమ్ కేసు తెరపైకి వచ్చింది. నయీమ్ కేసు రీ ఓపెన్ చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఆయన వెనకున్న రాజకీయ పార్టీలు, అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నయీం కేసుపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. నయీం ఆస్తులు చాలా వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతల చేతుల్లో ఉన్నాయని, అవి రికవరీ చేస్తే ఒక జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి సరిపోతాయని అన్నారు.
నయీం ఆస్తులను కొందరు నేతలు నొక్కేసారని గతంలో కాంగ్రెస్ ఆరోపించింది, ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే... మరి నయీం కేసును ఎందుకు రీ ఓపెన్ చేయడం లేదని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల అధికార పార్టీ సీనియర్ నేత వీహెచ్ కూడా ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వం నయీం కేసును నీరుగార్చింది. అందులో అధికారుల పాత్ర ఏంటో తేల్చాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కూడా నయీం ఫైల్స్ రీ ఓపెన్ చేయాలంటూ డిమాండ్ లేవనెత్తారు. "పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు, డబ్బులు దొరికాయన్నారు. అవన్నీ ఏమయ్యాయి? ఆ పైసలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. నయీం కేసులో చాలామంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. నయీం కేసును రీ ఓపెన్ చేసి, అతని ఆస్తులను కేసీఆర్ కుటుంబం నుండి జప్తు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతో పాటు మరో గ్యారంటీని కూడా అమలు చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సలహా ఇస్తున్నా. మీ పార్టీ నాయకుల హస్తం ఉందని కేసును పక్కదోవ పట్టించొద్దు. నయీం ఆస్తులు రికవరీ చేస్తే నల్గొండ జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయొచ్చు" అని బండి సంజయ్ కాంగ్రెస్ కి సూచించారు.