మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఐదు అక్రమనిర్మాణాలపై కొరడా
మణికొండలో అక్రమ నిర్మాణాలపై గండిపేట రెవిన్యూ అధికారులు బుధవారం చర్యలు తీసుకున్నారు. మొత్తం ఐదు ఇళ్లను జెసిబి సాయంతో కూల్చివేశారు. నార్సింగ్ పోలీసుల సమక్షంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. నెమలినగర్ కాలనీలో ఐదు అక్రమ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. ఒక్కో ఇల్లు 60 గజాల విస్తీర్ణంలో కట్టుకున్నారు.
నిబంధనలకు విరుద్దంగా ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది.పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కూల్చివేతలతో బాటు అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవిన్యూ అధికారులు హెచ్చరించారు.
టౌన్ ప్లానింగ్ అధికారులు గత కొన్ని రోజులుగా మణికొండలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మణికొండ చిత్ర పురి కాలనీలో ఏడు అనధికార విల్లాలను కూల్చివేశారు. మొత్తం 220 విల్లాలకు అన్ని అనుమతులున్నాయి. అదనంగా ఏడు అక్రమ విల్లాలు ఉన్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ప్లోర్ కు అనుమతులు తీసుకుని మూడు ప్లోర్ల బిల్డింగ్ నిర్మించడంతో టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగానే కూల్చివేశారు.
నెక్నంపూర్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను..
నెక్నంపూర్ చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలపై గత జనవరి మాసంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలను గతంలో అనేక పర్యాయాలు కూల్చివేసినప్పటికీ కొత్తగా విల్లాలు కట్టడంతో హైడ్రా అధికారులు కూల్చివేశారు.
ఈ కూల్చివేతలకు అప్పట్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మద్దతుపలికారు. చెరువుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రజలు చెరువుల పరిరక్షణకు దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు.