ఇద్దరు మంత్రులను ‘బ్రేక్ ఫాస్ట్’ కలిపిందా ?

ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య వివాదం ముగిసేట్లు చేయటం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అత్యవసరం

Update: 2025-10-08 08:47 GMT
TPCC President Bomma with ministers Ponnam Prabhakar and Adluri Laxman kumar

ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య వివాదం ముగిసేట్లు చేయటం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అత్యవసరం. లేకపోతే ఈ వివాద ప్రభావం తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికమీద పడే ప్రమాదముంది.(Ponnam Prabhakar) పొన్నం బీసీ, అడ్లూరి(Adluri Laxman kumar) ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు కావటంతో పై రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారే ప్రమాదముందని రేవంత్(Revanth) గ్రహించారు. అందుకనే ఇద్దరు మంత్రుల మధ్య పంచాయితి చేసే బాధ్యతను రేవంత్ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Bomma) కు అప్పగించారు. బుధవారం ఉదయం ఇద్దరు మంత్రులను బొమ్మ తనింటికి బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించారు. ఆహ్వానం అందటంతో ఇద్దరు మంత్రులు బొమ్మ ఇంటికి చేరుకున్నారు.

బ్రేక్ ఫాస్ట్ మీటింగులోనే బొమ్మ ఇద్దరు మంత్రులకు విషయాన్ని వివరించారు. వివాదానికి ముగింపు పలకకపోతే జరగబోయే నష్టాన్ని బొమ్మ ఇద్దరికీ అర్ధమయ్యేట్లు చెప్పారు. బొమ్మ ఇంటికి వెళ్ళగానే తాను ఏమిచేయాలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలుసు. అందుకనే బ్రేక్ ఫాస్ట్ మీటింగుకు ముందుగానే సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సారీ చెప్పేశారు. తాను అడ్లూరిని దూషించలేదని, సహచరుడు తనకు సోదరుడి లాంటి వాడని పొన్నం చెప్పారు. తన మాటలకు అడ్లూరి బాధపడుంటే సారీ అని పొన్నం చెప్పారు. తర్వాత బొమ్మ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు చేరుకున్నారు.

కొందరు సీనియర్ నేతలతో కలిసి బొమ్మ, పొన్నం, అడ్లూరి బ్రేక్ ఫాస్ట్ చేశారు. తనమాటలకు లక్ష్మణ్ బాధపడినందుకు తను క్షమాపణలు చెబుతున్నట్లు మరోసారి పొన్నం ప్రకటించారు. సామాజికన్యాయానికి కాంగ్రెస్ పార్టీయే ఛాంపియన్ అని అన్నారు. పార్టీ సంక్షేమం, బలపేతం తప్ప తనకు, అడ్లూరికి మరో ఉద్దేశ్యంలేదన్నారు. తాను అడ్లూరిని ఏమీ అనకపోయినా మీడియాలో వచ్చిన దానిప్రకారం అడ్లూరి బాధపడ్డారు కాబట్టి తాను క్షమాపణలు చెప్పినట్లు పొన్నం తెలిపారు.

ఇదేసమయంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతు తాను పొన్నం ప్రభాకర్ ను గౌరవిస్తానని చెప్పారు. అట్టడుగు సామాజికవర్గాలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. జెండా మోసిన తనకు మంత్రిపదవి వచ్చిందంటే అందుకు కాంగ్రెస్ లోని సామాజికన్యాయమే కారణమన్నారు. పొన్నం వ్యాఖ్యలతో మాదిగ జాతి అంతా బాధపడినట్లు అడ్లూరి చెప్పారు. పొన్నం క్షమాపణ కోరటంతో సమస్య ఇంతటితో సమసిపోయినట్లు మంత్రి అడ్లూరి ప్రకటించారు.

బాధ్యతగా వ్యవహరించాలి : బొమ్మ

పొన్నం చేశారన్న వ్యాఖ్యలతో లక్ష్మణ్ నొచ్చుకోవటంతో యావత్ సమాజం బాధపడినట్లు బొమ్మ తెలిపారు. మంత్రుల మధ్య జరిగిన ఘటన కుటుంబసమస్యగా అధ్యక్షుడు అభివర్ణించారు. జరిగిన ఘటనకు చింతిస్తు పొన్నం అడ్లూరికి క్షమాపణలు చెప్పారని బొమ్మ తెలిపారు. సమస్యను ఇంతటితో వదిలేయాలని మదిగ సామాజికవర్గానికి, సహచర మంత్రులకు బొమ్మ విజ్ఞప్తిచేశారు. మంత్రులు ఎక్కడమాట్లాడినా బాధ్యతగా వ్యవహరించాలని బొమ్మ హెచ్చరించారు.

Similar News