‘గ్రూప్-1 పరీక్ష మళ్ళీ నిర్వహించండి’

విద్యార్థుల జీవితాలతో ఆటలాడతామంటే చూస్తూ ఊరుకునేది లేదన్న కవిత.

Update: 2025-10-08 08:32 GMT

గ్రూప్-1 పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుగా నిర్వహించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపణలు గుప్పించారు. గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర గ్రూప్-1 అభ్యర్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. అందులో కవిత కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. గ్రూప్-1 పరీక్షల అవకతవకలపై పోరాటానికి అభ్యర్థులు జాగృతి ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రిలిమ్స్ నుంచే గ్రూప్-1 పరీక్షల్లో తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ మాత్రం అదే విధంగా పరీక్షలు నిర్వహించిందని, మూల్యాంకనంలో కూడా అవకతవకలు జరిగాయని ఆమె పునరుద్ఘాటించారు.

‘‘గ్రూప్ 1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని మేము గన్ పార్క్ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి TGPSC ముట్టడి చేసిన ప్రభుత్వంలో చలనంలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ , బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్ చెయ్యలేదు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చాము అని గొప్పలు చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. గ్రూప్ 1 పరీక్షను తప్పుడుగా నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతాం’’ అని వ్యాఖ్యానించారు.

‘‘తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు మౌనం వీడాలి. గ్రూప్ 1 పరీక్ష పై హరగోపాల్ సార్ మాట్లాడాలి. అవసరం అయితే నేను హరగోపాల్ సార్ ను కలుస్తాను. రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కులగొడుతారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాము. తక్షణమే గ్రూప్ నియామకాలు రద్దు చేసి, తిరిగి మళ్లీ గ్రూప్ 1 పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తాం’’ అని తెలిపారు.

Tags:    

Similar News