Telangana Bhu Bharathi| ధరణి పోయి భూభారతి వచ్చింది, తేడా ఏముందంటే...

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో భూ రికార్డుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ‘ధరణి’ పోయి, దీని స్థానంలో భూభారతి వచ్చింది.

Update: 2024-12-20 13:05 GMT

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో భూ రికార్డుల వ్యవహారంలో ధరణి పోయి, దీని స్థానంలో భూభారతి వచ్చింది. భూభారతి పేరిట ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు.

- ధరణిలో అనుభవదారు కాలమ్ లేదని, కాని ప్రస్థుతం అమలులోకి వచ్చిన భూభారతిలో అనుభవదారు కాలమ్ కు చోటు కల్పించామని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
- ధరణిలో వివాదాస్పద భూముల జాబితాకు పరిష్కారం లేదని, కానీ భూభారతి చట్టంలో వివాదాస్పద భూములకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.
- ధరణిలో భూవివాదాలపై తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు అధికారాలు లేవని, కానీ భూభారతిలో తహసీల్దార్ ఆర్డీఓ, కలెక్టర్లకు అధికారాలు కల్పించామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
- రిజిస్ట్రేషన్ జరిగితే ధరణి పోర్టల్ లో అప్పీల్ చేయలేమని,సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందేనని,భూభారతిలో రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసుకు పరిష్కారం లభిస్తుందంటున్నారు.
- ధరణి రికార్డులే శాశ్వతమని, భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యుటేషన్ చేస్తారని, కానీ భూభారతిలో భూసర్వే తర్వాత సమగ్ర రికార్డులు రూపొందించి రైతు చేతికి మ్యాప్ ఇస్తారు.
- ధరణిలో వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీలు చేయలేమని, కానీ ప్రస్థుతం అమలు కానున్న విధానంలో వారసత్వ భూములపై అభ్యంతరాల తర్వాతే మ్యుటేషన్ చేస్తారు.
- గత విధానంలో అసైన్డ్ భూములకు,13 బి,38ఈలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేవని, కానీ కొత్త భూభారతిలో అసైన్డ్ , 13బి, 38ఈ భూములకు పాస్ పుస్తకాలు ఇస్తారు.
- గతంలో భూధార్ నంబర్ల జారీకి అవకాశం లేదు,రికార్డుల్లో తప్పులకు సివిల్ కోర్టుకు వెళ్లడం వెళ్లడం ఒక్కటే పరిష్కారం కాగా, కొత్త విధానంలో ఆధార్ లాగే భూయజమానులకు భూధార్ జారీ చేస్తారు. జిల్లా స్థాయిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ప్రత్యేక భూ ట్రిబ్యునల్ ఉంటుంది.
- ధరణిలో ఉచిత న్యాయ సహాయం లేదని, గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయగా, భూభారతిలో నిరుపేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు గ్రామానికో రెవెన్యూ అధికారితో రెవెన్యూ సేవలు అందిస్తారు.
-ధరణిలో భూ విచారణ లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యుటేషన్ చేయడంతోపాటు దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. కానీ ప్రస్థుత కొత్త విధానం లో భూమిని సర్వే చేసి సరిహద్దులు కొలిచిన తర్వాతే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ ఉంటుంది, దీంతోపాటు అధికారులపై పై అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
- గత విధానంలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసే తహసీల్దార్లపై చర్యలు లేకపోగా, కొత్త విధానంలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్లపై కఠిన చర్యలు తీసుకుంటారు.
- రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసమే ధరణి కాగా, భూరికార్డుల నిర్వహణ కోసం భూభారతిని ప్రవేశపెట్టారు.ధరణిలో డిజిటల్ రికార్డులే తప్ప మ్యానువల్ రికార్డులు ఉండవు. కానీ భూభారతితో రెవెన్యూ కార్యాలయాల్లో మ్యానువల్ రికార్డులు కూడా ఉంటాయి.



భూ యజమానులు హక్కులు కాపాడేందుకే కొత్త చట్టం : సీఎం రేవంత్ రెడ్డి

అర్హులైన ప్రతీ భూ యజమానులు హక్కులు కాపాడేందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.‘‘ రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీం రెడ్డి నర్సింహారెడ్డి,చాకలి ఐలమ్మ లాంటి వారు పోరాటాలు చేసింది భూమి కోసమే.ఈ భూమిని ఆత్మగౌరవంగా, హక్కుగా భావించారు.భూమినే తమ హక్కుగా భావించి సాయుధ రైతాంగ పోరాటం చేశారు’’అని సీఎం పేర్కొన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుకు కూడా కొంతమంది భూమిపై ఆధిపత్యం చాలాయించడమే కారణమని సీఎం చెప్పారు. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఇందిరాగాంధీ గారు పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని ఆయన గుర్తు చేశారు.అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు ఈ-ధరణి పోర్టల్ ఇవ్వడాన్ని 2014లో కాగ్ తప్పుపట్టిందని అలాంటి లోపభూయిష్టమైన ధరణిని కేసీఆర్ ఎందుకు తెలంగాణ ప్రజలపై రుద్దారో చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని రేవంత్ చెప్పారు.

పేదల భూ హక్కులను కాపాడేందుకే భూ భారతి-2024
కాపలా కుక్కలు వేట కుక్కలుగా మారి భూ దోపిడి చేశాయి, భూ దోపిడీ పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.తప్పు చేసింది ఆ దొరవారు, శిక్ష అనుభవించింది అమాయక ప్రజలు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాప‌లా కుక్క‌లా ఉంటాన‌న్న గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌లు వేట‌కుక్క‌లుగా మారి అందిన‌కాడికి దోచుకున్నారని ఆయన ఆరోపించారు.. కాప‌లా కుక్క‌లు వేట కుక్క‌లుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయని ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.


Tags:    

Similar News