చివరినిముషంలో రేవంత్ వ్యూహం మార్చాడా ?

. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది

Update: 2025-08-31 10:14 GMT
Revanth and KCR

రాజకీయాలన్నాక ఎత్తుకు పై ఎత్తులు తప్పవు. కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టాలన్నది ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) వ్యూహం. దాన్ని ఎలాగైనా సరే అడ్డుకోవాలన్నది బీఆర్ఎస్(BRS) క్యాంపు ప్రతివ్యూహం. అందుకనే కోర్టుకు వెళ్ళారు. అయితే కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao) ఆశించినట్లుగా హైకోర్టు స్పందించలేదు. రిపోర్టుపై చర్చకు సంబంధించి ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు, కేసు విచారణను నాలుగువారాలకు వాయిదావేసింది. కోర్టులో కేసువేసి రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుడా అడ్డుకోవాలన్న కేసీఆర్, హరీష్ కు భంగపాటు తప్పలేదు. అయితే అక్కడితో ఊరుకోకుండా శనివారం అసెంబ్లీ ప్రారంభమైన రోజే హైకోర్టులో అత్యవసరం అంటు మరోసారి కోర్టులో కేసు వేశారు.

ఈసారి ఏమడిగారంటే అసెంబ్లీలో రిపోర్టును ప్రవేశపెట్టకూడదని, ఒకవేళ ప్రవేశపెట్టినా చర్చించకూడదని, చర్చించినా చర్చల ఆధారంగా తమపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని రిక్వెస్టు చేశారు. బీఆర్ఎస్ శనివారం కోర్టులో రెండోసారి కేసు దాఖలుచేస్తుందని రేవంత్ క్యాంపు ఊహించలేదు. కేసీఆర్, హరీష్ వేసిన కేసు అడ్మిట్ అయి విచారణ మొదలుపెట్టగానే ఏమి జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీలో. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది.

ఈవిషయం తెలియగానే రేవంత్ బుర్ర స్పీడుగా పనిచేసినట్లుంది. అందుకనే అప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తుగా ఆదివారమే అసెంబ్లీ నిర్వహించాలని డిసైడ్ చేశారు. శనివారం కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ, నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేయాలన్నది ఒరిజినల్ రేవంత్ ప్లాన్. ఎందుకంటే మధ్యలో ఆదివారం సెలవు కాబట్టి అసెంబ్లీ సమావేశం జరగదు. నిజానికి శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవులు. అయితే అవసరార్ధం ఒక్కోసారి శనివారం కూడా అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. ఆదివారం మాత్రం సెలవే. అయితే తాజా పరిస్ధితుల్లో సోమవారం జరగాల్సిన సమవేశాన్ని రేవంత్ ముందుకు తీసుకొచ్చి ఆదివారమే నిర్వహించేయాలని అనుకున్నారు.

అనుకున్నదే ఆలస్యం వెంటనే ఇదే విషయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చెప్పారు. స్పీకర్ వెంటనే ఓకే చెప్పి సభ్యులందరికీ సమాచారం అందించారు. అందుకనే ఈరోజు ఉదయం కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టేశారు. చర్చను సాయంత్రానికి వాయిదావేశారు. లంచ్ బ్రేక్ తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ మొదలవుతుంది. సభ్యులు మాట్లాడి, అభిప్రాయాలు చెప్పిన తర్వాత కాళేశ్వరం డిజాస్టర్ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ఏ పద్దతిలో తీసుకోవాలన్నది సభ నిర్ణయిస్తుంది. అసెంబ్లీలో ఎలాగూ కాంగ్రెస్ టీముదే మెజారిటి కాబట్టి రేవంత్ అనుకున్నట్లే తీర్మానం జరుగుతుందని అనుకోవచ్చు.

ఈ విషయం బాగా తెలుసు కాబట్టే కేసీఆర్ క్యాంపు అసెంబ్లీ తీర్మానం విషయంలో భయపడుతోంది. అందుకనే కోర్టులో మరోసారి కేసు వేసింది. అయితే వీళ్ళు ఆశించినట్లు కోర్టు సానుకూలంగా స్పందించలేదు. దీన్ని గ్రహించే రేవంత్ అప్పటికప్పుడు బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తువేసి చివరి నిముషంలో వ్యూహం మార్చి సోమవారం జరగాల్సిన సమావేశాన్ని ఆదివారమే కానిచ్చేస్తున్నాడు. సోమవారం కేసీఆర్, హరీష్ కేసుపై కోర్టు విచారించినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం డిజాస్టర్ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అసెంబ్లీ తేల్చేస్తుంది. అసెంబ్లీలో జరిగిన చర్చలు, తీర్మానాలపై కోర్టులు సాధారణంగా జోక్యంచేసుకోవు. కాబట్టి సోమవారం కోర్టు విచారణలో కేసీఆర్, హరీష్ కు పెద్దగా సానుకూలం ఉండకపోవచ్చు. అయితే సోమవారం కోర్టు ఏమిచెబుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News