లొంగిపోయిన మావోయిస్ట్ నేతలను పార్టీ టార్గెట్ చేసిందా ?
లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్రకమిటి(Maoist Central Committee) సీరియస్ గా స్పందించి ఒక లేఖను విడుదలచేసింది.
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్రకమిటి(Maoist Central Committee) సీరియస్ గా స్పందించి ఒక లేఖను విడుదలచేసింది. ఆలేఖలో లొంగిపోయిన మావోయిస్టులను ముఖ్యంగా మల్లోజుల(Mallojula Venugopal) వేణుగోపాల్, ఆశన్న(Aasanna)లను టార్గెట్ చేసుకున్నట్లుగా వార్నింగులు ఇవ్వటం ఇపుడు సంచలనంగా మారింది. లేఖలోని అంశాలను గమనించిన తర్వాత ప్రజల పేరుతో మావోయిస్టుపార్టీయే లొంగిపోయిన నేతలను టార్గెట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అభయ్ పేరుతో జారీ అయిన లేఖలో మల్లోజుల, ఆశన్నలను పార్టీ విప్లవద్రోహులుగా చిత్రీకరించింది.
విప్లవ ద్రోహులుగా మారి శత్రువుల ఎదుట లొంగిపోయిన ఇద్దరికీ ప్రజలే తగిన శిక్షలు విధిస్తారని హెచ్చరించింది. మూడురోజుల్లో సుమారు 270 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతే లేఖలో పార్టీ కేవలం మల్లోజుల, ఆశన్నలను మాత్రమే హెచ్చరించటం ఏమిటో అర్ధంకావటంలేదు. 2018లో పార్టీ ఒకసారి వెనుకంజ వేసినట్లుగా పార్టీ అంగీకరించింది. అప్పటినుండి మల్లోజుల బలహీనతలు బయటపడినట్లు చెప్పింది.
2020 నుండి కేంద్రకమిటి సమావేశాల్లో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తుతునట్లుగా మండిపడింది. ఆయుధాలను విడిచిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని వినిపించినట్లుగా గుర్తుచేసింది. మల్లోజుల, ఆశన్నల లొంగుబాటుతో పార్టీకి జరిగే నష్టం తాత్కాలికమే అని సమర్ధించుకున్నది. ప్రాణభీతితో ఎవరైనా లొంగిపోవచ్చని అయితే పార్టీకి నష్టంచేసేట్లయితే మాత్రం ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించింది. కేంద్రకమిటితో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయినట్లు పార్టీ మండిపడింది. తాజాగా రిలీజయిన లేఖను గమనించిన తర్వాత మల్లోజుల, ఆశన్నను మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసుకున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఎందుకు టార్గెట్ చేసుకున్నట్లు ?
మల్లోజుల, ఆశన్నలను మావోయిస్టుపార్టీ ఎందుకు టార్గెట్ చేసుకున్నది ? ఎందుకంటే లొంగిపోవటం ఎవరిష్టం వాళ్ళదే అని చాలాకాలంగా పార్టీ చెబుతోంది. అయితే లొంగిపోవాలని అనుకున్న వాళ్ళు తమ ఆయుధాలను పార్టీకి అప్పగించాలని షరతుపెట్టింది. అయితే పార్టీ షరతును ఇద్దరు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్నలు లెక్కచేయలేదు. ఆయుధాలతో సహా మద్దతుదారులతో ఇద్దరు టాప్ లీడర్లు లొంగిపోయారు. అప్పటినుండి పార్టీ కేంద్రకమిటి వీళ్ళిద్దరిపై బాగా సీరియస్ గా ఉన్నట్లుంది. వీళ్ళు మద్దతుదారులతో లొంగిపోయేటపుడు ఏకే 47 తుపాకులు, ఇన్సాస్ రైఫిల్స్ తో పాటు ఇతర ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగుబాట్ల తర్వాత జరుగుతున్న పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.