PET CAT | పెంపుడు పిల్లి లొల్లి,పోలీసు స్టేషనుకు చేరిన వివాదం

ఓ పెంపుడు పిల్లి రెండు కుటుంబాల మధ్య వివాదం రేపింది. నల్గొండలో తప్పిపోయిన పిల్లిని పక్కింటి వారు కలర్ వేసి పెంచుకుంటున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.;

Update: 2025-02-08 15:23 GMT
పోలీసుస్టేషనులో పెంపుడు పిల్లి

నల్గొండ పట్టణంలోని మీర్ బాగ్ కాలనీకి చెందిన ప్రైవేటు స్కూల్ టీచర్ పుష్పలత ఏడాది కాలంగా మిల్క్ వైట్ పిల్లిని పెంచుకునేది.ఆ పెంపుడు పిల్లి కాస్తా ఆరు నెలల క్రితం తప్పిపోయింది. పిల్లి అంటే ఎంతో ఇష్టపడే పుష్పలత కలత చెందింది. తప్పిపోయిన తన మిల్క్ వైట్ పిల్లిని పొరుగింట్లో ఉన్న అఫ్రోజ్ అక్రమంగా తీసుకువెళ్లి దాని జుట్టుకు బ్రౌన్ రంగు వేసి పెంచుకుంటున్నాడని పుష్పలత ఆరోపించింది.


రెండు కుటుంబాల మధ్య రాజుకున్న వివాదం
పెంపుడు పిల్లి తమదంటే తమదని పుష్పలత, అఫ్రోజ్ లు వాగ్వాదానికి దిగారు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో పుష్పలత తన పిల్లిని పొరుగింటి అఫ్రోజ్ ఎత్తుకెళ్లాడని, దీనిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నల్గొండ టూ టౌన్ పోలీసు సబ్ ఇన్ స్పెక్టరు నాగరాజుకు ఫిర్యాదు చేసింది. ఎలాగైనా తన పిల్లిని తనకు ఇప్పించాలని పుష్పలత పోలీసులను వేడుకుంది.

పోలీసుల విచారణ
పుష్పలత ఫిర్యాదు మేర నల్గొండ పోలీసులు పిల్లితోపాటు అఫ్రోజ్ ను పోలీసుస్టేషనుకు పిలిపించి విచారణ జరిపారు.తన వద్ద అరడజను పెంపుడు పిల్లులున్నాయని అఫ్రోజ్ పోలీసులకు చెప్పాడు. అసలు పిల్లి ఏ రంగుదని గుర్తించేందుకు దాన్ని ప్రభుత్వ పశువైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షకు పిల్లి వెంట్రుకలు
పశువైద్యుడు పరీక్షించి పిల్లి అసలు రంగు గోధుమరంగు అని తేల్చారు. అయినా పెంపుడు పిల్లి యజమానురాలైన పుష్పలత ససేమిరా అంది. అంతే పోలీసులు ఈ వివాద కేసును ఎలా పరిష్కరించాలని పశువైద్యుడిని సంప్రదించారు. పిల్లి జుట్టు నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించాలని పశువైద్యుడు సూచించారు. అంతే పిల్లి వెంట్రుకలను పశువైద్యాధికారి ద్వారా సేకరించి ఫొరెన్సిక్ ల్యాబ్ కి పరీక్షకు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా పిల్లి వివాదానికి తెర వేస్తామని నల్గొండ ఎస్ఐ నాగరాజు చెప్పారు.
మొత్తంమీద నల్గొండ పట్టణంలో పెంపుడు పిల్లి గురించి రెండు కుటుంబాల మధ్య రాజుకున్న వివాదం కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోలీసులు మాత్రం ఇదేమి వింత కేసు అంటూ ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.



Tags:    

Similar News