‘దమ్ముంటే బీసీని సీఎం చేయండి’
కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డికి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ ఓపెన్ ఛాలెంజ్;
బీసీలపై సీఎం రేవంత్ కానీ, కాంగ్రెస్‌గానీ చూపుతున్న ప్రేమ అంతా రాజకీయ బూటకమని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతోనే వీరికి బీసీలు గుర్తుకొచ్చారని, ప్రజల సమస్యలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సీఎం పీఠంలో ఒక బీసీ నేతను కూర్చోబెట్టాలని ఛాలెంజ్ చేశారు. సీఎం పదవికి రేవంత్ వెంటనే రాజీనామా చేసి.. బలహీన వర్గానికి చెందిన నాయకుడిని పట్టం కట్టాలని సవాల్ విసిరారు. బీసీలపై ప్రేమ చూపిస్తున్నట్టుగా నటిస్తున్న రేవంత్ రెడ్డి… బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. బీసీలకు ఏ పార్టీ ఏమి చేసిందనే అంశంపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని, సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
‘‘భారతదేశంలో 50 ఏళ్లకుపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ప్రధానిగా చేయలేదు. ఒక్కసారైనా బీసీలకు రాష్ట్రపతి అయ్యే అవకాశం కల్పించలేదు. ఎమర్జెన్సీ అనంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించినప్పటికీ, రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల ప్రజలు మెదక్ నుంచి ఇందిరాగాంధీ గారిని ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ ప్రసాదించారు. కానీ గెలిచాక కూడా బీసీలకు ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా అవమానించడమే కాంగ్రెస్ చరిత్రగా మిగిలింది. 1989లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌కు 39 లోక్‌సభ స్థానాలు ఇచ్చిన తెలుగు ప్రజలను కూడా 2004, 2009లో ఎంపీలను గెలిపించినా కాంగ్రెస్ వంచించింది. ఈ దేశంలో తొలిసారి బీసీ వ్యక్తిని ప్రధానిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదే. మూడుసార్లు బీసీ వ్యక్తిని ప్రధానిగా కొనసాగించి, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు స్థానం ఇచ్చిన ఘనత బిజెపిదే. అనేక రాష్ట్రాల్లో బీసీలను ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత కూడా బిజెపిదే. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని కల్పించిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అర్ధ శతాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్ ఒక్కసారి అయినా బీసీని ముఖ్యమంత్రిగా చేయలేదు. రాష్ట్ర జనాభాలో సగం మంది బీసీలు ఉన్నా... రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఆ మేరకు ప్రాతినిధ్యం కల్పించారా? నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు అన్యాయమే జరిగింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల గురించి మొసలికన్నీరు కారుస్తోంది. రానున్న రోజుల్లో తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్‌కు తప్పకుండా చరమగీతం పాడుతారు’’ అని వ్యాఖ్యానించారు.