కేటీఆర్ కు ‘ఆ’ అదృష్టం ఉందా ?

తెలంగాణా వ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర(KTR Padayatra) చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే(BRS Working President) ప్రకటించారు.

Update: 2024-11-01 10:59 GMT
BRS Working President KTR

ఇపుడిదే అంశంపై తెలంగాణా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణా వ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర(KTR Padayatra) చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే(BRS Working President) ప్రకటించారు. ప్రజల కోసం తాను తొందరలోనే పాదయాత్ర చేయబోతున్నట్లు చెప్పారు. సినిమా రిలీజ్ ముందు ట్రయలర్ లాగుంది కేటీఆర్ చేసిన ప్రకటన. పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది ? ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది ? పాదయాత్ర ఎన్నికిలోమీటర్లు ఉంటుంది ? అనేవిషయాలను ప్రకటించకుండా కేటీఆర్ అందరినీ సస్పెన్సులో ఉంచారు. అందుకనే కేటీఆర్ చేసిన పాదయాత్ర ప్రకటనతో పాటు మిగిలిన అంశాలపైన కూడా పార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి.

తెలుగురాజకీయాల్లో పాదయాత్ర అన్నది ఒక మైలుస్టోనుగా మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పాదయాత్ర చేస్తే కచ్చితంగా అధికారం ప్రాప్తిస్తుంది అనే సెంటిమెంటు బలంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR), తర్వాత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu), ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తాజాగా నారా లోకేష్(Nara Lokesh) పాదయాత్రల తర్వాత ఈ సెంటిమెంటు మరింతగా బలపడింది.


వైఎస్సార్ పాదయాత్ర

ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ను అధికారంలోకి తేవటంతో పాటు పార్టీలో తన ఉనికిని చాటుకోవటం కోసం వైఎస్సార్ 2003, సెప్టెంబర్ 9వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళలో మొదలైన పాదయాత్ర 60 రోజులపాటు 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగిసింది. వైఎస్సార్ పాదయాత్ర తెలంగాణా, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోని 11 జిల్లాల్లో సాగింది. పాదయాత్ర ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి వైఎస్సార్ ముఖ్యమంత్రయ్యారు.

చంద్రబాబు వస్తున్నా మీకోసం

ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు 2012, అక్టోబర్ 3వ తేదీన వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 208 రోజుల యాత్రలో చంద్రబాబు 13 జిల్లాల్లో 2 వేల కిలోమీటర్లు కవర్ చేశారు. మధ్య మధ్యలో జన్మభూమి వాహనంలో ప్రయాణించినా హోలు మొత్తంమీద పాదయాత్ర చేస్తు పార్టీ నేతలు, క్యాడర్లో కొత్త జోష్ నింపారనే చెప్పాలి. అనంతపురం జిల్లాలోని హిందుపురంలో మొదలైన పాదయాత్ర విశాఖపట్నం బహిరంగసభతో ముగిసింది. పాదయాత్రలో తెలంగాణా, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలను చంద్రబాబు టచ్ చేశారు. 2013, ఏప్రిల్ 27వ తేదీన చంద్రబాబు పాదయాత్ర ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు జరిగాయి. సమైక్య రాష్ట్రం 2014లో రెండుగా విడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రయ్యారు.

జగన్ : ప్రజాసంకల్పయాత్ర

ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017, నవంబర్ 6వ తేదీ పాదయాత్రను మొదలుపెట్టారు. పాదయాత్రకు జగన్ ప్రజాసంకల్పయాత్ర అని పేరు పెట్టుకున్నారు. ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర 341 రోజులపాటు సాగి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం బహిరిగసభతో ముగిసింది. 2019, జనవరి 9వ తేదీన 13 జిల్లాలగుండా సాగిన పాదయాత్రలో జగన్ 3648 కిలోమీటర్లు కవర్ చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అఖండ విజయంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.

మరో ముగ్గురి పాదయాత్ర

పై ముగ్గురే కాకుండా తెలుగురాజకీయాల్లో మరో ముగ్గురు కూడా పాదయాత్రలు చేశారు. వాళ్ళు ఎవరంటే పట్టోళ్ళ ఇంద్రారెడ్డి, వైఎస్ షర్మిల(YS Sharmila), నారా లోకేష్. ఇంద్రారెడ్డి పాదయాత్ర చేవెళ్ళ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైంది. దీనికి సంబంధించిన వివరాలు పెద్దగా లేవు. ఇక జగన్ జైలులో ఉన్నపుడు వైఎస్ షర్మిల రెండు రాష్ట్రాల్లోను పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర ఉద్దేశ్యం అప్పట్లో పార్టీని కాపాడుకోవటం, జగన్ కు మద్దతుగా జనాలను కూడగట్టడమే. షర్మిల కూడా సుమారు 3 వేల కిలోమీటర్ల నడిచారు. చివరగా నారా లోకేష్ పాదయాత్ర చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా లోకేష్ 2023, జనవరి 27వ తేదీన కుప్పం(Kuppam)లో పాదయాత్ర మొదలుపెట్టారు. 100 నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల పాదయాత్రను టార్గెట్ గా పెట్టుకున్నా సాధ్యంకాలేదు. 150 రోజుల యాత్ర 2023, జూలై 9వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని భీమిలీలో ముగింపు సభ జరిగింది. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రయ్యారు.

కేటీఆర్ పరిస్ధితి ఏమిటో

సీన్ కట్ చేస్తే తొందరలోనే కేటీఆర్ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. పాదయాత్రకు సంబందించిన వివరాలు ఎప్పుడో రిలీజ్ చేస్తారు. అయితే పైన చెప్పుకున్న వైఎస్సార్, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు చేసింది అధికారంలోకి రావటమే. అధికారంలోకి రావటం అంటే ముఖ్యమంత్రులు అవ్వటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుకున్నట్లే పై ముగ్గురు టార్గెట్ రీచయ్యారు. పట్టోళ్ళ ఇంద్రారెడ్డి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. షర్మిల, లోకేష్ కూడా తమ టార్గెట్ ను రీచయ్యారు. అన్నకోసం షర్మిల పాదయాత్ర చేశారు. తర్వాత ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యారు. అలాగే లోకేష్ కూడా చంద్రబాబు సీఎం అవ్వాలనే పాదయాత్ర చేశారు సక్సెస్ సాధించారు. మరి కేటీఆర్ అజెండా ఏమిటి ?

కేసీఆర్(KCR) ఉండగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవటం సాధ్యంకాదు. ఇప్పటికిప్పుడు కేటీఆర్ ను సీఎంను చేసి తాను జాతీయరాజకీయాల్లోకి వెళ్ళేంత సీను కేసీఆర్ కు లేదు. అందుకనే షర్మిల, లోకేష్ లాగ కేసీయార్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయటం కోసమే కేటీఆర్ పాదయాత్ర చేయాలి. లేకపోతే కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల నుండి తప్పుకుంటే కేటీఆర్ కు సీఎం యోగం పట్టచ్చు. మరి కేటీఆర్ కు ముఖ్యమంత్రి యోగం పడుతుందా ?

మోకాళ్ళయాత్ర చేయాలని బండి ఎద్దేవా

కేటీఆర్ పాదయాత్ర ప్రకటనను కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఎద్దేవా చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇద్దరు కలిసి పాదయాత్ర కాదు మోకాళ్ళయాత్ర చేయాలన్నారు. 6 గ్యారెంటీలని చెప్పి జనాలను మోసం చేసినందుకు రేవంత్ మోకాళ్ళయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునేంత ధైర్యం కేటీఆర్ కు ఉందా అని బండి సూటిగా ప్రశ్నించారు. తమ పాలనలో జరిగిన తప్పులను అంగీకరించిన తర్వాతే కేటీఆర్ యాత్ర మొదలుపెట్టాలని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తాను పాదయాత్ర చేస్తే గుండాలతో దాడిచేయించిన విషయాన్ని కేటీఆర్ మరచిపోయారా అని బండి నిలదీశారు. 6 గ్యారెంటీల అమలుపై రేవంత్, పదేళ్ళ పాలనలో తప్పులను ఒప్పుకుని కేటీఆర్ ఇద్దరూ మోకాళ్ళయాత్ర చేయాలని బండి ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News