Narendra Modi|మోడీకి తెలంగాణా బీజేపీ గ్రౌండ్ రియాలిటీ తెలుసా ?
మోడీకి గ్రౌండ్ రియాలిటి తెలీకుండా అన్నా ఉండాలి. రెండోది తమ నేతలపై మోడీకి అతి విశ్వాసం అన్నా ఉండాలి.
నరేంద్రమోడీ తెలంగాణా బేజేపీ నేతలపైన చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు కనబడుతోంది. బుధవారం ఢిల్లీ పార్లమెంటు భవన్లో మోడీ(Modi)తో తెలంగాణా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(KishanReddy), బండి సంజయ్(Bandi Sanjay), ఆరుగురు లోక్ సభ ఎంపీలతో పాటు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎనిమిది మంది ఎంఎల్ఏలు పాల్గొన్నారు. దాదాపు అర్ధగంటపాటు జరిగిన భేటీలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీయే అధికారంలోకి రాబోయేది అన్నంతగా మోడీ మాట్లాడారు. మహారాష్ట్ర(Maharashtra)లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చినట్లే తెలంగాణా(Telangana)లో కూడా వచ్చేయాలని చెప్పారు. పార్టీ నేతలంతా ఐకమత్యంగా ఉండి, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసి జనాల మనసులను గెలుచుకోవాలని చెప్పారు. నిత్యం జనాల్లోనే ఉండే నేతలను ప్రజలు ఎప్పుడూ వదులుకోరని మోడీ చెప్పారు.
ఈమాటలతో అధికారంలోకి వచ్చే విషయంలో మోడీ తెలంగాణాపై చాలా ఆశలే పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజపక్షం వహించి పోరాటాలు చేస్తే చాలు బీజేపీ అధికారంలోకి వచ్చేసినట్లే అని మోడీ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. మోడీ చెప్పిన మాటలు విన్నతర్వాత రెండు విషయాలు బోధపడుతున్నాయి. మొదటిది మోడీకి గ్రౌండ్ రియాలిటి తెలీకుండా అన్నా ఉండాలి. రెండోది తమ నేతలపై మోడీకి అతి విశ్వాసం అన్నా ఉండాలి. మొదటి పాయింట్ చూస్తే బీజేపీకి తెలంగాణాలో అసలు క్షేత్రస్ధాయిలో ఏమాత్రం బలంలేదు. తెలంగాణాలోని 119 నియోజకవర్గాల్లో సుమారు 100 నియోజకవర్గాల్లో పార్టీకి క్షేత్రస్ధాయిలో పెద్దగా బలంలేదు. ఏదైనా బలమైన గాలి ఉన్నపుడు మాత్రమే పార్టీ సీట్లు గెలుస్తోంది లేకపోతే అసలు అడ్రస్ కూడా ఉండదు.
2018 ఎన్నికల్లో అన్నీనియోజకవర్గాల్లో పోటీచేసిన బీజేపీ గెలిచింది గోషామహల్(GoshaMahal) నియోజకవర్గంలో మాత్రమే. మిగిలిన 118 నియోజకవర్గాల్లో చాలాచోట్ల అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా రాలేదు. ఇక 2023 ఎన్నికల్లో కేసీఆర్(KCR) మీద జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకత+కాంగ్రెస్(Congress) లో అంతర్గత విభేదాల ఫలితంగానే పార్టీ 8 నియోజకవర్గాల్లో గెలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ లో అంతర్గత గొడవలకు బీఆర్ఎస్ బాగా బలహీనమైపోవటంతో బీజేపీ(BJP) 8 సీట్లలో గెలిచింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కారణంగానే కారుపార్టీ ఓట్లను కమలంపార్టీకి కేసీఆర్ వేయించారని రేవంత్(Revanth), మంత్రులు ఇప్పటికే చాలాసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్ధులు చాలాచోట్ల మూడోప్లేసుకు పరిమితమవ్వటం, కొన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోవటంతో రేవంత్ ఆరోపణలు నిజమేనా అన్న అనుమానాలు పెరిగిపోయాయి.
ఇక అసలు విషయానికి వస్తే పార్టీలోని చాలామంది సీనియర్ నేతల మధ్య ఏమాత్రం పొసగటంలేదు. ఇపుడు మోడీతో భేటీ అయినట్లే పార్టీ ప్రజాప్రతినిధులందరు హైదరాబాదులో ఒక్కటంటే ఒక్కసారి కూడా సమవేశం అవ్వలేదని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేయాలని కిషన్, బండి మీడియాలో ప్రకటనలు మాత్రమే ఇస్తారు. ఆచరణలో ఒక్కసారి కూడా జరగలేదు. ఇద్దరు కేంద్రమంత్రుల ఆధ్వర్యంలో ఆరుగురు ఎంపీలు, ఎనిమిదిమంది ఎంఎల్ఏలు, రాజ్యసభ ఎంపీ ఒక్కసారి కూడా భేటీ అయిన దాఖలాలేదు. చాలామంది నేతలకు చాలామంది నేతలతో ఏమాత్రం పడదు. అందుకనే చాలామంది నేతలు ఒకళ్ళతో మరొకళ్ళు కలవరు.
పార్టీవర్గాల సమాచారం, బయట జరుగుతున్న ప్రచారం ఏమిటంటే కిషన్ రెడ్డికి బండి సంజయ్ తో పడదు. కిషన్ తో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ఏమాత్రం పడదు. కిషన్ తో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంబంధాలు అంతంతమాత్రమే. బండితో కూడా కొండా సంబంధాలు ఏమంత బాగోలేదు. కిషన్ రెడ్డికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు పెద్ద సఖ్యత లేదు. అలాగే డీకే-బండి మధ్య సంబంధాలు కూడా అంతంతమాత్రమే. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో బండి, కిషన్ కు పెద్దగా సంబంధాలు లేవు. మెదక్ ఎంపీ రఘునందనరావుకు కిషన్, బండితో మంచి సంబంధాలు లేవు. ఆదిలాబాద్ ఎంపీ గోడంనగేష్ ఎవరితోను కలవకుండా తనపనేదో తాను చేసుకుపోతుంటారు.
ఎంపీల వ్యవహారం ఇలాగుంటే ఎంఎల్ఏల వ్యవహారం కూడా భిన్నంగా ఏమీలేదు. చాలామందికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డితో పడదు. ముఖ్యంగా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ఎంఎల్ఏలు, ఎంపీల ఎవ్వరితోను కలవరు. పార్టీ మీటింగులకు రారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు. ఇపుడు కూడా మోడీతో భేటీ అంటే వచ్చారు కాని ఏ కేంద్రమంత్రితోనో భేటీ అనుంటే వచ్చేవారు కాదేమో. రాజాసింగ్ కు కిషన్, బండి అంటే ఏమాత్రం పడదు. కారణాలు ఏవైనా సరే ఈమధ్యనే తన రిటైర్మెంట్ కూడా ప్రకటించేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. హిందు ధర్మ ప్రచారం, వ్యాప్తి, రక్షణకు పాటుపడతానని రాజాసింగ్ చెప్పారు. నేతల మధ్య సఖ్యత పెంచేందుకు గతంలో తెలంగాణా ఇన్చార్జీలు తరుణ్ చుగ్, బన్సాల్ తదితరులు ప్రయత్నించి సాద్యంకాక వదిలేసినట్లు పార్టీలోనే టాక్ నడుస్తోంది. తెలంగాణా అధ్యక్ష పదవి కోసం కావచ్చు, ఆధిపత్యపోరాటం కూడా కావచ్చు సీనియర్ నేతల్లో చాలామంది మధ్య ఏమాత్రం సఖ్యత లేదన్న విషయం బహిరంగరహస్యం. మరీ విషయం మోడీకి తెలుసో లేదో ?