కాకా కోటలో అడుగుపెట్టిన మనవడు..
కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థుల రెండో జాబితాలో వంశీ కృష్ణకు స్థానం దక్కింది. మరి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వంశీ కృష్ణ తన తాత లెగసీని కంటిన్యూ చేస్తారా..
కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థుల రెండవ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. మల్కాజిగిరికి పట్నం సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ కి దానం నాగేందర్, నాగర్ కర్నూల్ కి మల్లు రవి, చేవెళ్ల కి రంజిత్ రెడ్డి పెద్దపల్లికి వంశీ కృష్ణ పేర్లను ఫైనల్ చేసింది. పెద్దపల్లి స్థానానికి ముందు వేరువేరు పేర్లను పరిశీలించినప్పటికీ చివరికి ఆ టికెట్ ని గడ్డం వెంకటస్వామి (కాకా) మూడోతరమైన వంశీ కృష్ణకి కేటాయించింది. మొదట్లో ఆ స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వెంకటేష్ నేతకు కేటాయిస్తారని వినిపించింది. కానీ కొడుకు వంశీ కృష్ణని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. పెద్దపల్లి ఎంపీ టికెట్ కొడుకుకి ఇప్పించడంలో విజయం సాధించారు.
పెద్దపల్లి నియోజకవర్గం కాకా కోట..
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ తండ్రి దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామికి మంచి పేరు ఉంది. ఆయనకిది కంచుకోట అనే చెప్పాలి. అభిమానులు ఆయన్ని కాకా అని పిలుచుకుంటారు. వెంకటస్వామి 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో నాలుగు సార్లు ఎంపీ గా గెలిచారు. ఆయన వారసుడిగా వివేక్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. కానీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురై బీజేపీలో చేరారు. అయితే ఈసారి ఎన్నికల్లో తన కొడుకుని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని వివేక్ భావించారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో తిరిగి 2023 లో కాంగ్రెస్ గూటికి చేరారు.
కాంగ్రెస్ వివేక్ కి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా పోటీలో నిలబడి గెలిచారు. మరోవైపు తన అన్న బెల్లంపల్లి అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ రెండు నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. తన వారసుడిగా కొడుకు వంశీ కృష్ణని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి అనుకున్న వివేక్.. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. పెద్దపల్లి కాకా కంచుకోటగా ఉండటం, రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ వారి ఖాతాలోనే ఉండటం, ఆర్ధిక బలం కూడా తోడవడంతో వంశీ కృష్ణకే టికెట్ దక్కింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ కృష్ణ చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. యువ ఓటర్లను ఆకట్టుకునేలా ఆయన అమలు చేసిన వ్యూహాలు కూడా పార్టీని ఆకర్షించడంతో టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వంశీ 2010లో అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ డిగ్రీ కంప్లీట్ చేశారు. తర్వాత అమెరికాలోని పెన్సార్ ఇండస్ట్రీస్ లో పని చేశారు. 21 ఏళ్ళకి ఇండియాకి వచ్చి మేనేజ్మెంట్ ట్రైనీగా విశాఖ ఇండస్ట్రీస్ లో చేరి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వరకు ప్రమోట్ అయ్యారు. అమెరికాలో 'ఆటమ్' అనే సోలార్ రూఫ్ కి పేటెంట్ రైట్స్ సాధించారు. ప్రస్తుతం V6 టీవీ ఛానల్ ఎండీగానూ ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.