బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలకు డోర్స్ క్లోజ్
ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS defection MLAs) మీద సుప్రింకోర్టు(Supreme court) ఆదేశాల ద్వారా తొందరలోనే అనర్హత వేటుపడుతుందని అర్ధమొచ్చేట్లుగా కేసీఆర్(KCR) కామెంట్ చేశారు;
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలపై పార్టీ అధినేత కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలను తిరిగి పార్టీలోకి చేర్చుకునేదిలేదన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో మాట్లాడుతు తొందరలోనే ఉపఎన్నికలు రావటం ఖాయమన్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS defection MLAs) మీద సుప్రింకోర్టు(Supreme court) ఆదేశాల ద్వారా తొందరలోనే అనర్హత వేటుపడుతుందని అర్ధమొచ్చేట్లుగా కేసీఆర్(KCR) కామెంట్ చేశారు. ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని, ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న ధీమాను వ్యక్తంచేశారు. అనర్హత వేటునుండి తప్పించుకునేందుకు ఫిరాయింపు ఎంఎల్ఏలు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా తప్పించుకోలేరని కేసీఆర్ అన్నారు.
పార్టీలోకి ఫిరాయింపుల ఎంఎల్ఏలను తిరిగి చేర్చుకునేది లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటుపడుతుందో లేదో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. ఈ అంశాన్ని సుప్రింకోర్టు విచారిస్తున్నది. విచారణలో ఫిరాయింపులపైన, స్పీకర విచాక్షణాధికారాలపైన ఎన్ని వ్యాఖ్యలు చేసినా తనంతట తానుగా పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలపైన సుప్రింకోర్టే అనర్హత వేటు వేసేందుకు లేదు. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటువేసే అధికారం అసెంబ్లీ స్పీకర్ కు మాత్రమే ఉంది. అనర్హత వేటు విషయాన్ని తొందరగా తేల్చాలని స్పీకర్ కు సుప్రింకోర్టు సూచించగలదు లేకపోతే నిర్దిష్ట గడువు విధించగలదంతే. పై రెండింటిలో ఏది జరిగినా ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటుపడినట్లూ కాదు ఉపఎన్నికలు వచ్చేస్తున్నట్లూ కాదు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే తమపై అనర్హత వేటుపడుతుందేమో అన్న భయంతోనో లేకపోతే ముందుజాగ్రత్తతోనో కొందరు ఎంఎల్ఏలు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ప్రకటనలు చేశారు. గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజీవ్ కుమార్, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధి(Arekapudi Gandhi), పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ తొల్కంటి ప్రకాష్ గౌడ్ తామసలు బీఆర్ఎస్ ను ఎప్పుడు విడిచిపెట్టామని ఎదురుప్రశ్నిస్తున్నారు. తాము కాంగ్రెస్ లో చేరనేలేదంటు ఒట్లు కూడా పెడుతున్నారు. వీళ్ళంతా రేవంత్ రెడ్డి(Revanth)ని కలిసింది కాంగ్రెస్ కండువాను కప్పుకున్నది బహిరంగ రహస్యం.
వీళ్ళ వ్యవహారం ఇలాగుంటే చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య, ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivas Reddy), భద్రాచలం ఎంఎల్ఏ డాక్టర్ తెల్లం వెంకటరావు మాత్రం సుప్రింకోర్టులో కేసును పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. వీరిలో కడియం శ్రీహరి అయితే ఉపఎన్నికలు ఎట్టి పరిస్ధితుల్లోను రావన్న ధీమాను వ్యక్తంచేశారు.
ఉపఎన్నికలొస్తే పరిస్ధితి ఏమిటి ?
ఒకవేళ, పర్ సపోజ్ ఫిరాయింపు ఎంఎల్ఏల మీద స్పీకర్ అనర్హత వేటు వేశారనే అనుకుందాం. అప్పుడు ఉపఎన్నికలు వస్తే ఫిరాయింపు ఎంఎల్ఏల పరిస్ధితి ఏమిటి ? అనే చర్చ కాంగ్రెస్ నేతల మధ్య నడుస్తోంది. కేసీఆర్ చెప్పినట్లుగా ఫిరాయింపు ఎంఎల్ఏలను బీఆర్ఎస్ లోకి చేర్చుకునే ప్రశ్నే తలెత్తదు. కాబట్టి పది నియోజకవర్గాల్లో కొత్తనేతలకు టికెట్లు ప్రకటిస్తారు. ఇదేసమయంలో కాంగ్రెస్ ఏమిచేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించటం ద్వారానే కదా అనర్హత వేటుపడి పదవులు పోగొట్టుకున్నది. మరపుడు ఈ పదిమందికి టికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్(Congress) మీదే ఉంది. అయితే పదిమందికి కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందా ? ఇచ్చినా ఎంతమంది గెలుస్తారు ? అన్నది కీలకంగా మారుతోంది. సుప్రింకోర్టు ఆదేశాల ద్వారా ఎంఎల్ఏ పదవులు పోగొట్టుకున్న వారికే మళ్ళీ టికెట్లు ఇచ్చేందుకు పార్టీ అధిష్ఠానం అంగీకరిస్తుందా ? పార్టీసీనియర్ నేతలు, క్యాడర్ ఫిరాయింపులకే టికెట్లు ఇచ్చేవిషయంలో ఎలా రియాక్టవుతారు ? అన్నప్రశ్నలు చాలానే ఉన్నాయి. మరి వీటన్నింటికీ జవాబు సుప్రింకోర్టు రిజర్వుచేసిన తీర్పులోనే దాగుంది.