నారాయణ్ ఖేడ్ గర్ల్స్ హాస్టల్లో ‘కీచకుడు’

మద్యం మత్తులో వచ్చి బాలికలపై లైంగికవేధింపులు...;

Update: 2025-07-23 04:38 GMT
నారాయణఖేడ్ బాలికల హాస్టల్ లో బాలికలపై లైంగిక వేధింపులు...విద్యార్థులు, బాలికల తల్లిదండ్రుల ఆగ్రహం, ధర్నా

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో గత కొంత కాలంగా సాగుతున్న లైంగిక వేధింపుల పర్వం తాజాగా వెలుగుచూసింది. బాలికలను కాపాడాల్సిన హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు, మాజీ కౌన్సిలర్ రాజేష్ చౌహాన్ (30) కీచకుడిగా మారి తన తల్లి వార్డెన్ గా పనిచేస్తున్న హాస్టల్ బాలికలను లైంగికంగా వేధించాడని తేలింది. వార్డెన్ అయిన తన తల్లి అండదండలతో బాలికల హాస్టల్ లోకి వచ్చి వారిని లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. పాలిటెక్నిక్, డిగ్రీ చదువుతున్న 8 మంది బాలికలను రాజేష్ చౌహాన్ లైంగికంగా వేధించాడని వెల్లడైంది.


లైంగిక వేధింపులకు తల్లి, మహిళా ఉద్యోగినుల మద్ధతు
హాస్టల్ లో బాలికలపై వార్డెన్ కుమారుడు రాజేష్ చౌహాన్ లైంగికంగా వేధిస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సిన వార్డెన్ అయిన నిందితుడి తల్లి శారద, ఇద్దరు హాస్టల్ మహిళా ఉద్యోగినులు రేణుక, లక్ష్మీలు నిందితుడికే మద్ధతు ఇచ్చారని నారాయణ ఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోగా, బాధిత బాలికలను ముగ్గురు మహిళలు దుర్భాషలాడారని ఎస్ఐ చెప్పారు. ప్రధాన నిందితుడైన రాజేష్ చౌహాన్, వార్డెన్ శారద, ఉద్యోగినులు రేణుక, లక్ష్మీలను అదుపులోకి తీసుకున్నామని, వారిని అరెస్టు చేస్తామని ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి పేర్కొన్నారు.బాలికలు మైనర్లు కావడంతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు.

మద్యం మత్తులో వచ్చి బాలికలపై లైంగికవేధింపులు
వార్డెన్ కుమారుడు రాజేష్ చౌహాన్ పీకలదాకా మద్యం తాగి వచ్చి బాలికలను లైంగికంగా వేధించాడు. దీనిపై బాలికలు హాస్టల్ వార్డెన్ అయిన నిందితుడి తల్లి శారదకు ఫిర్యాదు చేసినా ఆమె అతనిపై చర్యలు తీసుకోకపోగా , తమను దుర్భాషలాడిందని బాధిత బాలికలు ఆవేదనగా చెప్పారు. బాధిత బాలికలు అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్యలక్ష్మీకి ఫిర్యాదు చేయడంతో నారాయణ ఖేడ్ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాలికల తల్లిదండ్రులు, విద్యార్ధుల ఆందోళన
నారాయణ ఖేడ్ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో బాలికలపై సాగిన లైంగిక వేధింపులపై విద్యార్థి సంఘాల నేతలు, బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతిగృహంలో బాలికలపై సాగిన లైంగిక వేధింపుల సమాచారం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు, ఏబీవీసీ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు బీసీ హాస్టల్ కు వచ్చి ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్ శారదను డిస్మిస్ చేయాలని, లైంగికంగా బాలికలను వేధించిన వార్డెన్ కుమారుడు రాజేష్ చౌహాన్, వారికి మద్ధతు ఇచ్చి బాధితులను తిట్టిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

హాస్టల్ వార్డెన్ శారదపై బదిలీ వేటు
నారాయణఖేడ్ బీసీ హాస్టల్ వార్డెన్ శారదపై బదిలీ వేటు వేశామని సంగారెడ్డి బీసీ వెల్పేర్ అధికారి జగదీష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హాస్టల్ లో బాలికలపై సాగిన లైంగిక వేధింపుల వ్యవహారంపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. బాలికలను లైంగికంగా వేధించిన మరో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని ఆయన పేర్కొన్నారు.



 నలుగురు నిందితులపై పోలీసు కేసు

నారాయణఖేడ్ బీసీ కళాశాల బాలికల వసతిగృహంలో వార్డెన్ శారద కుమారుడు, మాజీ కౌన్సిలర్ రాశేష్ చౌహాన్ అమ్మాయిలను లైంగికంగా వేధించిన ఘటనపై నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులపై బీసీ వెల్ఫేర్ సంక్షేమశాఖ సహాయ అధికారిణి భాగ్యలక్ష్మీ, బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేర తాము పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హాస్టల్ వార్డెన్ శారదతోపాటు ఆయన కుమారుడు రాజేష్ చౌహాన్, మరో ఇద్దరు హాస్టల్ ఉద్యోగులు రేణుక, లక్ష్మీలపై కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


Tags:    

Similar News