'కవిత లిక్కర్ వ్యాపారం గురించి కేసీఆర్ కి ముందే చెప్పారు'..
ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై మంగళవారం ఢిల్లీ హై కోర్టులో వాదనలు జరిగాయి. ఈడీ వాదనల్లో భాగంగా కీలక విషయాలను బయటపెట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై మంగళవారం ఢిల్లీ హై కోర్టులో వాదనలు జరిగాయి. ఈడీ వాదనల్లో భాగంగా కీలక విషయాలను బయటపెట్టింది. లిక్కర్ బిజినెస్ గురించిన వివరాలన్నీ కవిత ముందే తన తండ్రి, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కి ముందే చెప్పారని పేర్కొంది. ఆమె తన టీమ్ ని కూడా ఢిల్లీలో కేసీఆర్ కి పరిచయం చేసినట్లు తెలిపింది. ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసంలోనే ఈ పరిచయ కార్యక్రమాలు జరిగాయని ఈడీ చెప్పింది.
కవిత పరిచయం చేసిన వారిలో బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లై లు ఉన్నారని ఈడీ స్పష్టం చేసింది. కేసీఆర్ వారిని వివరాలడిగి తెలుసుకున్నారని విచారణలో వెల్లడైనట్లు తెలిపింది. బుచ్చిబాబు కేసీఆర్ కు సమీర్ మహేంద్రును పరిచయం చేశారన్నారు. ఆయన లిక్కర్ వ్యాపారం వివరాలను సమీర్‌ను అడిగి తెలుసుకున్నారన్నారు. కేసీఆర్ తో భేటీ వివరాలను గోపీ కుమారన్ వాంగ్మూలంలో రికార్డు చేసినట్లు ఈడీ పేర్కొంది. కవిత రెండేళ్లలో సుమారు 11 మొబైల్ ఫోన్లు వాడారని ఈడీ తెలిపింది.
నాలుగు ఫోన్లలో ఉన్న ఆధారాలను కవిత ధ్వంసం చేశారని, ఈ కేసులో నిందితురాలిగా ఉన్న కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈడీ తన వాదనల్లో కోర్టుకి తెలిపింది. ముఖ్యంగా సాక్ష్యాలు అన్నీ తారుమూరు చేస్తారని ఈడీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈడీ, సీబీఐ వాదనలు విన్న ఢిల్లీ హై కోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు.