బిసీ బంద్ కు సర్వం సిద్దం
అన్నిపార్టీల మద్దత్తు కూడగట్టిన బిసిజెఎసి
బిసీ బంద్ కు సర్వం సిద్దమైంది. బిసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల 18వ తేదీ(శనివారం) బంద్ ను విజయవంతం చేయాలని తెలంగాణ బిసి జెఏసి పిలుపునిచ్చింది. విద్యా, వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ లోపాల్గొనాలని జెఏసీ కోరింది.ఆర్టీసీ బస్సులు నడపకుండా బిసీ బంద్ కు సహకారించాలని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు బిసీ సెగ తాకాలని బిసీ జెఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బిజెపి నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ఆర్ కృష్ణయ్య బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ బిజెపితో సహా అన్ని పార్టీలు మద్దత్తు తెలుపుతున్నాయి. బిసీ రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్నవారు ఆయన వెంట నడుస్తున్నారు. పార్టీలకతీతంగా అందరూ బిసీ బాటపట్టారు.
బిసీ సంఘాలు నిర్వహించతల పెట్టిన బిసీ బంద్ కు తమ పార్టీ సంపూర్ణ మద్దత్తు ప్రకటించిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిసీ బంద్ కు తమ పార్టీ పూర్తి మద్దత్తు ప్రకటిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు.
బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. బిసీలకు రిజర్వేషన్ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం తదితర పరిణామాలతో.. 42 శాతం రిజర్వేషన్ల విషయం లో ఇక క్షేత్రస్థాయి నుంచి, ప్రజల మమేకంతో పోరాటానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 'ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదు' అనే పరిస్థితులు ఏర్పడ్డాయి అని ఆయన అన్నారు.
ఈ నెల 18న బిసి బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటామని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. బిసీలకు రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ ఉద్యమం తరహా పోరాటం చేయాలని సిపిఎం పిలుపునిచ్చింది. బిసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటూ బిసి బంద్ కు బిజెపి మద్దతు తెలపడం ద్వంద వైఖరికి నిదర్శనమని ఆ పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. తుపాకీ గొట్టం ద్వారానే సమాజాన్ని మార్చగలమని చెప్పే మావోయిస్టు పార్టీ కూడా బిసి బంద్ కు మద్దత్తు తెలిపింది.
వాస్తవానికి ఈ నెల 14వతేదీన బిసి బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ అనివార్యకారణాలవల్ల 18వ తేదీకి వాయిదాపడింది. చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావాలని బిసీ జెఎసి డిమాండ్ చేస్తుంది.