నామినేషన్ వేసిన నవీన్.. కీలక సూచన చేసిన అసదుద్దీన్ ఒవైసీ

మాగంటి గోపీకి టికెట్ ఇవ్వడం వల్లే ఇప్పుడు ఉపఎన్నిక వచ్చిందన్న ఒవైసీ.

Update: 2025-10-17 14:17 GMT

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ ప్రక్రియకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా నవీన్‌కు కీలక సూచనలు కూడా చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ వెంటరాగా నవీన్ యాదవ్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. నామినేషన్ వేయడం కోసం యూసఫ్ గుడా నుంచి నవీన్ భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఇందులోనే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా నవీన్‌ను కలిశారు. పదేళ్లుగా బీఆర్ఎస్ ఏం చేయలేదని, ఈసారి గెలిచి జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని నవీన్‌కు సూచించారు.

‘‘గత పదేళ్లలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. సీఎం, ఎమ్మెల్యే అంతా ఒకే పార్టీ వాళ్లయినా జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరగలేదు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఏఐఎంఐఎం పోటీ చేయదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 37శాతం ఓట్లను షేర్ చేసుకుందని ఓటర్లు గుర్తించాలి. ఐదు నెలల గ్యాప్‌తో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ షేర్ 15శాతానికి పడిపోయింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయి. మనం బీజేపీ వృద్ధిని అడ్డుకోవాలి. మాగంటి గోపీనాథ్‌కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఉపఎన్నిక జరిగేదే కాదు. గోపీనాథ్‌కు ఆరోగ్యం బాగోలేదని 2023లోనే బీఆర్ఎస్‌కు తెలుసు’’ అని ఓవైసీ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా సాగనుంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తరుపు నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ తరుపున లంకల దీపక్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Tags:    

Similar News