ప్రచారం ముగియటంతో చల్లబడిన ఎన్నికల వేడి

వాతావరణం కారణంగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతల నుండి మొన్న కురిసిన భారీ వర్షం జనాలకు ఉపశమనం కలిగింది. ప్రచారం ముగుస్తుండటంతో ఎన్నికల వేడి కూడా తగ్గుతోంది

Update: 2024-05-11 08:38 GMT
Revanth, KCR and Kishan

దాదాపు నెలరోజుల ప్రచారంతో హోరెత్తిపోయిన తెలంగాణాలో ఎన్నికల వేడి చల్లబడింది. వాతావరణం కారణంగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతల నుండి మొన్న కురిసిన భారీ వర్షం జనాలకు ఉపశమనం కలిగించింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుండటంతో ప్రచారం కారణంగా పెరిగిపోయిన ఎన్నికల వేడి కూడా చల్లబడుతోంది. దాదాపు నెలరోజుల నుండి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ ఎన్నికల ప్రచారంలో వేడిని రగిలించారు. రేవంత్ కు తోడు రాహూల్ గాంధి, ప్రియాంకలు కూడా ప్రచారంతో హోరెత్తించారు. అలాగే కేసీయార్ రోడ్డుషోలతో షో చేశారు. నరేంద్రమోడి, అమిత్ షా కూడా తెలంగాణాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. మోడి, రేవంత్, అమిత్ షా, కేసీయార్ ప్రచారం దెబ్బకు ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది.

ఎలాగైనా డబల్ డిజిట్ సీట్లు సాధించాలన్న పట్టుదలతో బీజేపీ 17 నియోజకవర్గాల్లోను ప్రచారాన్ని ప్లాన్డుగా చేసుకున్నది. గడచిన మూడునెలల్లో మోడి నాలుగు సార్లు తెలంగాణాలో పర్యటించారు. తన పర్యటనల్లో 15 బహిరంగసభలతో పాటు కొన్నిచోట్ల రోడ్డుషోల్లో కూడా పాల్గొన్నారు. అలాగే అమిత్ షా కూడా పది బహిరంగసభలు, నాలుగు రోడ్డుషోల్లో పార్టిసిపేట్ చేశారు. 17 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న అభ్యర్ధులు, వారికి మద్దతుగా ఎనిమిదిమంది ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు కూడా ప్రచారం చేశారు. అయితే కేంద్రమంత్రి, తెలంగాణా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన ప్రచారం తక్కువే.

ఇక రేవంత్ విషయం చూస్తే 27 రోజుల్లో 57 బహిరంగసభలతో పాటు రోడ్డుషోలు, కార్నర్ మీటింగులతో పార్టీ ప్రచారాన్ని హోరెత్తించారు. తన ప్రచారానికి హెలికాప్టర్ను ఉపయోగించారు. ఒక్కోరోజు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారంచేశారు. ఏప్రిల్ మొదటివారంలో తుక్కుగూడలో పార్టీ జాతీయ మ్యానిఫెస్టోను రాహుల్ గాంధి విడుదల చేయటంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అప్పటినుండి రేవంత్ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.

అభ్యర్ధుల ప్రచారంకోసం రాహుల్ మూడు విడతల్లో ఏడు నియోజకవర్గాల్లో ప్రచారంచేశారు. అలాగే ప్రియాంకగాంధీ కూడా రెండు విడతల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారంచేశారు. శనివారం సాయంత్రం తాండూరులో జరిగే జనజాతర సభతో పాటు కామారెడ్డిలో రోడ్డుషోలో పాల్గొంటారు. పార్టీ ప్రచార బాధ్యతలు మొత్తాన్ని రేవంత్ తన భుజానే మోశారనటంలో సందేహంలేదు. అలాగే కేసీయార్ కూడా ఏప్రిల్ 24వ తేదీన మొదలుపెట్టిన ప్రచారాన్ని శనివారంతో ముగించారు. గతానికి భిన్నంగా బహిరంగసభలకు బదులు రోడ్డుషోలు, కార్నర్ మీటింగులకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారు. మొత్తం 18 రోజుల్లో దాదాపు 38 రోడ్డుషోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. ఇక కిషన్ రెడ్డి ఎందుకనో రేవంత్, కేసీయార్ స్ధాయిలో 17 నియోజకవర్గాల్లో ప్రచారంచేయలేదు. ఎక్కువగా తన నియోజకవర్గం సికింద్రాబాద్ కే పరిమితమయ్యారు. మోడి, అమిత్ షా లేదా కేంద్రమంత్రులు వచ్చినపుడు మాత్రమే ఇతర నియోజకవర్గాల్లో కిషన్ కనిపించారు. ఏదేమైనా శనివారం మధ్యాహ్నానానికే ఎన్నికల వేడి కూడా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.

Tags:    

Similar News