Skills University | తెలంగాణ యువతకు ఉపాధి బాట,స్కిల్ వర్శిటీ కోర్సులు
తెలంగాణ యువతకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ శుభవార్త వెల్లడించింది. యువతకు ఉపాధి కల్పించేందుకు కొత్తగా మూడు కోర్సులకు నోటిఫికేషన్ జారీ చేసింది.;
By : The Federal
Update: 2025-01-09 13:21 GMT
ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ర్ట ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రారంభించింది.
- తెలంగాణ రాష్ర్టంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది.
యువతకు స్కిల్ పెంచే కోర్సులు
ప్రాధాన్య రంగాలైన ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ తదితర రంగాల్లో ఉపాధి కల్పించే కోర్సులను ప్రారంభించనున్నారు. సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులను రూపొందించి యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఉపాధికి చర్యలు
విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు అదే కంపెనీలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. తాజాగా ‘యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ’ కిమ్స్, ఏఐజీ ఆసుపత్రులు, టీ – వర్క్స్ భాగస్వామ్యంతో మూడు కోర్సులకు నోటిఫికేషన్లను జారీ చేసింది. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోర్సులకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు నిరుద్యోగులు తరచూ ‘www.yisu.in’ వెబ్ సైట్ లో చూడాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.
ఎండోస్కోపీ టెక్నీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాం
ఏఐజీ హాస్పిటల్స్ ఎండోస్కోపీ టెక్నీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆరు నెలలపాటు చేపట్టనున్నారు. ఇంటర్(బైపీసీ)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.ఎంపికైన వారికి ఎండోస్కోపీ ఆపరేషన్స్ పై క్లాస్ రూం, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి, ఏఐజీ, ఇతర ఆసుపత్రుల్లో ప్లేస్ మెంట్ సౌకర్యం కల్పిస్తారు.
టీ వర్క్స్ ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం
టీ వర్క్స్ ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం కింద రెండునెలలపాటు శిక్షణ ఇస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిజైన్ థింకింగ్, క్యాడ్/క్యామ్ పై అవగాహన కల్పించడం, 3డీ ప్రింటింగ్, వెల్డింగ్, సీఎన్సీ మెషినింగ్, అడ్వాన్స్ డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ప్యాకేజింగ్, వుడ్ , లేజర్ కటింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి జూనియర్ ప్రోటో టైపింగ్ టెక్నీషిన్ గా అవకాశం కల్పిస్తారు.
మెడికల్ కోడింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రాం
మెడికల్ కోడింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రాం వ్యవధి 55 రోజులు ఉంటుంది. మెడికల్ కోడింగ్,సాఫ్ట్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తారు.ఈ కోర్సులో చేరేందుకు బీఎస్సీ(లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.మాస్టర్ మెడికల్ టెర్మినాలజీ, కోడింగ్ సిస్టమ్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు. మెడికల్ కోడింగ్ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ మెడికల్ కోడర్ గా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.