Etala Rajender | ‘రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది’

రేవంత్.. ఢిల్లీకి పోయి మోదీని మా పెద్దన్న అంటాడు. కేంద్ర సాకారం కావాలి అంటారు. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు.;

Update: 2025-02-15 05:25 GMT

సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ ప్రధాని కులాన్ని ఉద్దేశించి రాష్ట్ర సీఎం చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని, లేకుంటే నవ్వుల పాలవుతారని హితవు పలుకుతున్నారు. కాగా ‘మోదీ ఒరిజినల్ బీసీ కాదు’ అన్న రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డికి పోయేకాలం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆసేతు హిమాచలం మోదీని విశ్వసించని, ప్రేమించని వారు ఎవరూ లేరని అన్నారు ఈటల.

‘‘పేదరికం నుండి వచ్చిన వాడిని.. పేదల బాధలు అన్నీ తెలుసు అందులో తాను పీహెచ్‌డీ చేసాను అని ఆయన అనేక సార్లు చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నవారు. అప్పుడు కేసీఆర్ కూడా కళ్ళు నెత్తికి ఎక్కి మోడీ గీడీ అని మాట్లాడారు. ఇప్పుడు రేవంత్.. ఢిల్లీకి పోయి మోదీని మా పెద్దన్న అంటాడు. కేంద్ర సాకారం కావాలి అంటారు. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. మోదీ బీసీ కాదని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి పోయేకాలమా?’’ అని అన్నారు.

‘‘మోదీ కులాలకు అతీతం. భారత జాతి ఆత్మగౌరవం ప్రపంచ పటం మీద నిలబెడుతున్న వ్యక్తి మోదీ. అమెరికన్ ప్రెసిడెంట్ కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు. రేవంత్ కూట్లో రాయి తీయలేనివాడు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు ఉంది. మోడీ మీద విమర్శలు సూర్యుని మీద ఉమ్మి వేసినట్టు ఉన్నాయి. మోడీకి స్వార్థం లేదు. దేశ ప్రజలే ఆయన కుటుంబం. ఆయన మీద విమర్శ చేస్తే ప్రజలు గతంలో వారికి చెప్పిన బుద్దే మీకూ చెప్తారు. మోడీతో గొక్కోవడం అంటే ధర్మంతో, ప్రజలతో గోక్కోవడమే. ఆ నిమిషానికి చప్పట్లు కొట్టొచ్చు కానీ తరువాత పర్యావసానాలు కేసీఆర్‌కి అర్ధం అయ్యాయి. మీకు కూడా త్వరలోనే అర్ధం అవుతాయి. పెద్దలను గౌరవించడం నేర్చుకోమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నా’’ అని సూచించారు.

Tags:    

Similar News