షీ టీమ్ డెకాయ్ ఆపరేషన్‌లో పోకిరీల గుట్టు రట్టు

నగరంలోని ఓ బహిరంగ ప్రదేశంలో బాలికలను కొందరు పోకిరీలు వేధిస్తున్నారు. అంతే మఫ్టీలో ఉన్న షీటీమ్స్ పోకిరీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి ఆట కట్టించింది.;

Update: 2025-07-08 10:33 GMT
షీ టీం

హైదరాబాద్ నగరంలోని బస్టాండులు, రైల్వేస్టేషన్లు, మెట్రోస్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, కూరగాయల మార్కెట్లు...ఇలా ఒకటేమిటీ అన్ని బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, బాలికలను ఈవ్ టీజర్స్ వేధించడం పరిపాటిగా మారింది. షీ టీమ్స్ మఫ్టీలో తిరుగుతూ చేపట్టిన డెకాయ్ ఆపరేషన్లలో పోకిరీల గుట్టు రట్టు అయింది.బాలికలు, మహిళలను వెంబడించడం, వారిని లైంగికంగా వేధిస్తుండటంతో షీ టీంలు మఫ్టీలో నిఘా వేసి పోకిరీలను సాక్ష్యాధారాలతో పట్టుకొని వారిపై కేసులు పెడుతున్నారు.


మహిళలపై ఎన్నెన్నో వేధింపులు
- ఇబ్రహీంపట్నం బస్టాండులో నిత్యం పోకిరీలు పాగా వేసి కళాశాలలకు వెళ్లే బాలికలను వేధిస్తుండటం నిత్యకృత్యంగా మారింది. ఓ పోకిరీ ఇబ్రహీంపట్నం బస్టాండులో వేధిస్తున్నాడని బాలికలు చేసిన ఫిర్యాదు మేరకు షీ టీం రంగంలోకి దిగి ఓ పోకిరీని అరెస్ట్ చేసింది. పోకిరీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- మెట్రోరైలులోని మహిళా కంపార్టుమెంట్లలో పురుషులు ప్రయాణం చేయకూడదు. కానీ ఐదుగురు పోకిరీలు మహిళా బోగీల్లో ప్రయాణం చేస్తూ మహిళలను వేధిస్తుండగా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన షీ టీమ్ నిందితులను పట్టుకొని జరిమానాలు విధించింది.



 ప్రేమ పెళ్లి పేరిట మోసం

ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న యువతిని అదే మాల్ లో పనిచేస్తున్న యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటాననని నమ్మంచి పలుమార్లు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే దాటవేస్తూ కలిసి ఉన్న ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిత యువతి ఫిర్యాదు మేర షీటీం నిందితుడిపై కేసు నమోదు అతన్ని అరెస్ట్ చేసింది.

ఇన్ స్టాగ్రాంలో వేధింపులు
ఇన్ స్టాగ్రాంలో బావను అంటూ పరిచయం చేసుకొని ఓ యువతిని నిందితుడు వేధించాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోకుంటే తాను మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. యువతి ఫోన్ నంబరు పెట్టి ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన నిందితుడిని షీటీం అరెస్ట్ చేసింది.

క్లాస్ మేట్ వేధింపులు
పాఠశాల పదో తరగతి చదివిన అలూమ్నీ గెట్ టు గెదర్ సమావేశంలో క్లాస్ మేట్ ఓ వివాహిత నంబరు తీసుకొని ఫోనులో వేధించాడు. నిందితుడు తరచూ ఫోన్ చేసి వేధిస్తుండటంతో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర నిందితుడిని రాచకొండ షీ టీం పట్టుకొని కేసు పెట్టి జైలుకు పంపించింది.

పెరుగుతున్న పోకిరీల ఆగడాలు
పోకిరీలపై కేసులు పెట్టి, వారి తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నా పోకిరీల చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కేవలం గత 15 రోజుల్లోనే 185 మంది పోకిరీలను షీటీమ్స్ పట్టుకున్నాయంటే పోకిరీల ఆగడాలు ఏమేరకు పెరిగాయో విదితమవుతుంది. ఫోన్ల ద్వారా 37, సోషల్ మీడియా యాప్ ద్వారా 37, నేరుగా వేధించారని 99 మంది బాదిత బాలికలు, మహిళలు షీ టీమ్ కు ఫిర్యాదు చేశారని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీసీ టి ఉషారాణి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పోకిరీలకు పోలీసుల కౌన్సెలింగ్
గత నెల 16వతేదీ నుంచి 30 వతేదీ వరకు కేవలం 15 రోజుల్లో షీ టీంలకు మహిళల నుంచి 215 ఫిర్యాదులు వచ్చాయి.పోకిరీల్లో 139 మంది మేజర్స్ కాగా, మరో 46 మంది మైనర్ బాలురు కూడా ఉన్నారు. మహిళలు, బాలికలను వేధిస్తున్న 185 మందికి మంగళవారం రాచకొండ పోలీసులు ఎల్ బి నగర్ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈవ్ టీజర్లలో మార్పు తీసుకువచ్చేందుకు వారి వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.


Tags:    

Similar News