కర్నూలు వద్ద 'కావేరి' బస్సులో 20 మంది సజీవ దహనం

మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు, ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

Update: 2025-10-24 02:15 GMT
దగ్ధమైన బస్సు
కర్నూలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 20 మంది సజీవదహనం అయ్యారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉలిందకొండ సమీపంలో బైకును ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 12 మంది కిందకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి సుమారు 44 మంది ప్రయాణికులతో కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు బెంగళూరుకు బయలుదేరింది. బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే బైకును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలను పగలగొట్టి కిందకు దూకేశారు. మిగతా ప్రయాణికులు మంటల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు పరారీ అయ్యారు. అక్కడికి చేరుకున్న స్థానికులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. ఆ వెంటనే ఆయన సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు.
Tags:    

Similar News