'ఫిమేల్ ట్రాన్స్ జండర్స్ ని స్త్రీలుగా గుర్తించరా?
స్త్రీ వాదులు కూడా ఈ విషయం లో వెనకబడి ఉన్నారు.
స్త్రీ వాదులు కూడా ఫిమేల్ ట్రాన్స్ జెండర్స్ ను స్త్రీలుగా అంగీకరించడం లేదని ట్రాన్స్ జెండర్ తాషి ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ విమెన్ రైటర్స్ ఫోరం ట్రాన్స్ జెండర్ సమస్యలను చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆమె ప్రధాన వ్యక్తగా ప్రసంగిస్తూ ట్రాన్స్ జండర్ అనే మాట గురించి అనేక ఆసక్తికరమయిన విషయాలు చెప్పారు. హిజ్రా అనే పదం సాంస్కృతిక అస్తిత్వాన్ని సూచిస్తుందని ప్రాంతాన్ని బట్టి అది మారుతుందని అన్నారు. సమకాలీన సమాజ చట్రంలోనుంచి ట్రాన్స జెండర్ సమస్యల గురించి మాట్లాడడం సాధ్యం కాదని, దాని నుంచి బయట పడి రాయాలని తాషి సూచించారు.
క్వీ ర్ - ట్రాన్స్ వెల్ నెస్ అండ్ సపోర్ట్ సెంటర్, యుగాంతర్ సంస్థతో ట్రాన్స్ జెండర్ తాషి కలసి పనిచేస్తున్నారు. ఆంగ్లం, కొన్ని ప్రాంతీయ భాషలలో ట్రాన్స్ జెండర్ సాహిత్యం వచ్చింది కానీ తెలుగులో ఆశించినంతగా రాలేదని తాషి అన్నారు.
"LGBTQIA అనే సంక్షిప్త పదంలో Q అంటే క్వీర్ అని, ఈ పదానికి ఇంగ్లీషులో భిన్నమైన, విచిత్రమైన అనే అర్థాలున్నాయని, వాడుక భాషలో తేడా అని చెప్పవచ్చు.' వాడు తేడాగాడు రా! ' అని సమాజంలో హిజ్రాల పట్ల ఉన్న ఒక అభిప్రాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజం ఏర్పరచిన కుటుంబ చట్రంలో ఇమడ లేక ప్రశ్నించే అందరినీ కుటుంబం వెలివేస్తుంది. అలాంటి వారందరూ కూడా నా దృష్టిలో క్వీర్ గ్రూపు లోకే వస్తారు. ఉదాహరణకు పెళ్ళిని వ్యతిరేకించిన ఒంటరి స్త్రీలు, పిల్లలు వద్దనకునే జంటలు క్వీర్ గ్రూప్ వారే. భిన్న లైంగిక అవయవాలతో జన్మించే వాళ్ళను ఇంటర్ సెక్స్ వ్యక్తులు అంటారు. ఇంటర్ సెక్స్ వ్యక్తులు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు కావచ్చు కానీ ట్రా న్స్ జెండర్ వ్యక్తులు ఇంటర్ సెక్స్ వ్యక్తులు కారు," అని తాషి చెప్పారు.
ట్రాన్స్ జెండర్ అనే పదాన్ని తెలుగులో లింగమార్పిడి అని రాస్తున్నారు కానీ అది సరైన అనువాదం కాదని అంటూ ట్రాన్స్ జండర్ అనే పదం నామవాచకం కాదనీ అది విశేషణమని, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు అని రాయాలని తాషి నొక్కి చెప్పారు. దాదాపు రెండుగంటలపాటు అనర్గళంగా సాగిన తాషి ఉపన్యాసంలో.... వాళ్ళ కమ్యూనిటీలో ఉండే సంస్కృతి,హైరార్కీ, సాధకబాధకాలు, వేదనలు, ఆర్థిక, సామాజిక సమస్యలు, డిమాండ్స్ చర్చకు వచ్చాయి.
సమావేశంలో ముగ్గురు ట్రాన్స్ జెండర్స్ పాల్గొ న్నారు. సమావేశం ఉదయం పదకొండుగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా సీరియస్ గా జరిగింది.
సమావేశంలో ముందుగా ఫోరం కన్వీనర్ బండారు విజయ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితులలో ఫోరం ఏర్పాటు చేయాల్సి వచ్చిందో చెప్పి, లక్ష్యాలు, కార్యాచరణ వివరించారు. సీనియర్ కవయిత్రి మోర్తాల విమల మాట్లాడుతూ అస్తిత్వ బృందాలలో భిన్నత్వం ఉన్నప్పటికీ అంతర్మథనం, వేదన ఒక్కటే అనీ భిన్నమైన సమాజాలను కూడా కలుపుకొని ముందుకు సాగవలసిన అవసరముందని, అంతర్జాతీయంగా వచ్చిన ట్రాన్స్ జెండర్ సాహిత్యాన్ని అధ్యయనం చేసి రాయాలని సూచించారు.
టెస్ (TES :Trans Eqality Society) లో అడ్వకసీ ఆఫీసర్ గా పని చేస్తున్న రాజనాల ఉదయశ్రీ తన జీవితంలోని ఎన్నో విషాదకరమైన సంఘటనలను వివరించారు. సమాజం చేత వెలివేయబడిన వాళ్ళను తన స్వప్రయోజనాల కొరకు సమాజం ఎలా వాడుకుంటుందో ఉదయశ్రీ మాటలలో విన్నప్పుడు హృదయం నీర్లైంది.
ప్రత్యేకంగా ట్రాన్ జెండర్ వ్యక్తుల కొరకు పనిచేసే గౌరవ్ ఫౌండేషన్ & సిడ్బి (Gaurav Foundation & SiDBi )సంస్థలో,సాక్ష్యం ( Saksham 2.౦) ప్రాజెక్టులో కంప్యూటర్ ట్రైనర్ గా పని చేస్తున్న ఆయేషా మీరా మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహనరాయ్ లాంటి మహానుభావుల కృషి వల్ల ఈనాడు స్త్రీలు చదువుకుంటున్నారని చెపుతూ సామాజిక మార్పులో సాహిత్యం అత్యంత ప్రభావం చూపిస్తుందన్నారు. ఏ తల్లిదండ్రులూ పిల్లలను ద్వేషించరని, సమాజానికి భయపడే తమ తల్లి దండ్రులు తమపట్ల న్యూనతతో వ్యవహరిస్తారని చెప్పారు. కుటుంబంలో పిల్లలను స్వేచ్ఛగా పెరగనివ్వాలని సూచించారు. ట్రాన్స్ జెండర్ సమస్యల పట్ల అందరూ స్పందించినప్పుడు మాత్రమే కొంత పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
సమాజంలో తమను సాటి మనుషులుగా గుర్తించాలని ట్రాన్స్ జెండర్స్ డిమాండ్ చేసారు. పాఠశాలలో చిన్నప్పటినుంచే జెండర్, లైంగికత ఆధారిత అస్తిత్వాలపై అవగాహన కలిగించాలన్నారు. ఓట్ల కోసం ఓటరు కార్డులైతే ఇచ్చారు కానీ ఆధార్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. క్వి యర్ ట్రాన్స్ ట్రాన్ వ్యక్తులతో పనిచేసేవిధంగా రాష్ట్రంలోని పోలీస్, న్యాయ వ్యవస్థ సిబ్బందికి అవగాహనా శిక్షణ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ట్రాన్స్ జెండర్ షీలా రేప్ హత్య కేసులో తాను ట్రాన్స్ జెండర్స్ కు సపోర్టుగా పోలీసు స్టేషనుకు వెళ్ళినప్పుడు పోలీసులు వారి పట్ల ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికంగా ఉన్నదని ‘భూమిక’ సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన రచయిత్రులుదరూ చర్చలో ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకొన్నారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సమస్యల పై తెలుగులో ఎంత సాహిత్యం వస్తుందో కాలమే నిర్ణయించాలి.