పోలవరం 'విస్తరణ'పై రణం: బనకచర్లపై గురుశిష్యుల సవాళ్లు
మార్చి 27న జరిగే ఆంధ్ర,తెలంగాణ నీటిపారుదల అధికారుల సమావేశంలో ఏమి జరగబోతోంది? ఎవరి మాట ఎవరు వింటారు? ఎవరిది అక్రమం, ఎవరిది సక్రమ వాదనో తెలుతుందా?;
By : The Federal
Update: 2025-03-25 08:00 GMT
దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు చరిత్ర ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. గోదావరి నదిపై నిర్మితమవుతోన్న ఈ బహుళార్థసాధక జాతీయ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ప్రాజెక్టు కారణంగా గోదావరి నదికి ఎగువన ఉన్న తెలంగాణలో బ్యాక్‌వాటర్ ముంపు ప్రమాదం ఉందని ఆ రాష్ట్రం అభిప్రాయపడుతోంది. దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసిన తెలంగాణ, మార్చి 27న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రాల అధికారుల భేటీకి సిద్ధమవుతోంది.
దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం..
పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1940ల నుంచే ఉన్నా, వాస్తవ రూపం దాల్చింది 1980లలోనే. ఆనాడే ప్రాజెక్టుకు అప్రూవల్స్ లభించినా, 2005 తర్వాతే నిర్మాణం మొదలైంది. దశలవారీగా సాగిన పనులు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఒకడుగు ముందుకీ రెండడుగులు వెనక్కి అనేలా సాగుతున్నాయి.
2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, పోలవరం ప్రాజెక్టును కేంద్రం "జాతీయ ప్రాజెక్టు"గా ప్రకటించింది. ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) పర్యవేక్షిస్తోంది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అటు కృష్ణా నదికి ఇటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. పోలవరం ప్రాజెక్టుకు రెండు- కుడి, ఎడమ- కాలువల ద్వారా నీటిని తరలించాలన్నది ప్లాన్.
ఇప్పుడు వివాదంలోకి వచ్చిన అంశం ఏమిటి?
పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వివాదమైంది. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును ముందుగానే తయారు చేశామని ప్రకటించి మళ్లీ కొత్త రూపంలో ప్రవేశపెట్టడం ఆమోదయోగ్యనీయం కాదని ఆరోపిస్తోంది. సుమారు 80,112 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసింది. ఇందులో 2016లో ప్రారంభించిన పల్నాడు drought mitigation ప్రాజెక్టు పనులు కూడా అంతర్భాగం.
పోలవరం ప్రాజెక్టు కుడి మెయిన్ కెనాల్‌లో హెడ్ స్లూయిస్ ద్వారా 40,000 క్యుసెక్కుల నీటిని తరలించేందుకు విస్తరణ చేయాలన్న ప్రతిపాదన వల్ల గేట్ల ఆపరేషన్ షెడ్యూల్ మార్చాల్సి రావచ్చు. ఇది గోదావరి జలాలలో వాటా ఉన్న రాష్ట్రాల మధ్య చట్టబద్ధంగా కుదిరిన జలాల పంపిణీ ఒప్పందానికి వ్యతిరేకమని తెలంగాణ అభిప్రాయపడుతోంది.
తెలంగాణ వాదన ఏమిటంటే...
నదీతీర హక్కులు(Riparian rights) ఉల్లంఘనగా తెలంగాణ భావిస్తోంది. గోదావరి జలాలపై హక్కులున్న ఇతర రాష్ట్రాలకు సమాచారం ఇవ్వకుండా విస్తరణ పనులు చేపట్టడమంటే, సహజలవనరులపై సమాన హక్కులను నిర్లక్ష్యం చేయడమే అని వాదిస్తోంది. ఇది నదీజల చట్టాల ఉల్లంఘనగా చెబుతోంది.
బ్యాక్‌వాటర్ ప్రభావం: కొత్తగా ప్రతిపాదించిన నీటి తరలింపు మార్గాల వల్ల భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రమాదం మరింత తీవ్రమవుతుంది. గతంలోనూ ప్రత్యేకించి 2007లో బ్యాక్‌వాటర్ ప్రభావంపై జరిగిన అధ్యయనాలు ఇదే హెచ్చరిక చేశాయని రుజువులు చూపుతుంది.
అనధికారిక లిఫ్ట్ స్కీమ్: 2021లో ఏపీ ప్రభుత్వం డెడ్ స్టోరేజ్ నుండి నీరు ఎత్తిపోసేందుకు (లిఫ్ట్ ఇరిగేషన్) ₹910 కోట్ల లిఫ్ట్ స్కీమ్ ప్రకటించి, ప్రాజెక్ట్ డిటైల్డ్ రిపోర్టు (పీడీయార్) లేకుండానే పనులు మొదలుపెట్టిందని తెలంగాణ ఆరోపిస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ (MoJS) కూడా ఇది ఆమోదించలేదని గుర్తుచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ వాదన ఇలా ఉంది...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన ప్రకారం.. బనకచర్ల లింక్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఆయకట్టు పెంపు ఉండదు. కెనాల్స్ పరిమాణం, నీటి వినియోగం మారదు. Rayalaseema ప్రాజెక్టు పేరుతో కేవలం అమలు దశలను సవ్యంగా రూపొందించడమే జరుగుతోంది. జూన్ 2015 నుంచి కృష్ణా జలాల పంపకాలు KRMB పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
అయితే, తెలంగాణ ఈ వాదనను కొట్టిపారవేస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై మరింత స్పష్టత కావాలని, అప్పటి వరకు ముందుకు సాగడానికి వీలులేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.
27న ఏపీ, తెలంగాణ అధికారులతో భేటీ..
పోలవరం ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)ని కోరింది. ప్రాజెక్టుకు సంబంధించిన అంతర్రాష్ట్ర సమస్యలను చర్చించడానికి పీపీఏ మార్చి 27న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఏర్పడుతున్న ముంపు ప్రభావం అంశాలపై చర్చించేందుకు పీపీఏ ఈ నెల 27న ఏపీ, తెలంగాణలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణ తాజాగా ఎజెండాను పీపీఏకు పంపింది. అందులో ప్రధానంగా ఏపీ కొత్తగా చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ప్రతిపాదించింది.
ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా, పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వరద జలాల పేరిట 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్లకు, అటు నుంచి పెన్నా బేసిన్‌కు తరలించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. పోలవరం విస్తరణ పనులపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని కూడా సమావేశ ఎజెండాలో పొందుపరచాలని తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇఎన్‌సి) జి అనిల్ కుమార్ పీపీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు రాసిన లేఖలో కోరారు.
కుడి ప్రధాన కాలువ (ఆర్‌ఎంసి) హెడ్ స్లూయిస్ నుంచి సుమారు 40,000 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా పోలవరం ప్రాజెక్టు విస్తరణను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆరోపించారు.
2016లో ఆంధ్రప్రదేశ్ రూ.6,020.15 కోట్ల వ్యయంతో పల్నాడు కరువు ఉపశమన ప్రాజెక్టు (PDMP)ను ప్రారంభించిందని తెలంగాణ ENC పేర్కొంది. 2018, 2019లో రెండు ఏజెన్సీలతో వరుసగా రూ.2,281 కోట్లు, రూ.2,256 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత రాష్ట్రం రెండు ప్యాకేజీల కింద పనులను చేపట్టినట్టు తెలంగాణ ఫిర్యాదు చేసింది.
గోదావరి, పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా గుంటూరు జిల్లాలోని హరిశ్చంద్రపురం నుంచి నకరికల్లు వరకు ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లో పల్నాడు కరవు ఉపశమన ప్రాజెక్టును ప్రతిపాదించిందని, తెలంగాణ, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో దాన్ని అప్పుడు నిలిపివేశారని కూడా తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను కేంద్రజలశక్తి శాఖ దృష్టికి కూడా వెళ్లింది.
2024 డిసెంబర్ లో ఆంధ్రప్రదేశ్ రూ. 80,112 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించింది. ఇందులో పల్నాడు ప్రాజెక్ట్ తో పాటు ఇతర అంశాల ఉన్నాయి. కాకపోతే ఈసారి పేరు మార్చారని తెలంగాణ ఆరోపించింది.
పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దాని యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా విస్తరణను అనుమతించబోమని తెలంగాణ తేల్చి చెప్పింది.
ఏప్రిల్ 2021లో, పోలవరం జలాశయంలోని డెడ్ స్టోరేజీ నుండి ఆంధ్రప్రదేశ్ రూ. 910 కోట్ల అంచనా వ్యయంతో అనధికార లిఫ్ట్ పథకాన్ని చేపట్టిందని తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇఎన్‌సి) జి అనిల్ కుమార్ ఆరోపించారు. అవసరమైన అనుమతులు పొందకుండా ఈ లిఫ్ట్ పథకాన్ని కొనసాగించవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. అయితే, నేటికీ ఈ ప్రాజెక్ట్ పై డెటైల్డ్ రిపోర్టు ఇవ్వలేదని అనిల్ పేర్కొన్నారు.
ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వరద వచ్చే రోజుల్లో మాత్రమే నీటని తరలిస్తామని, గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని చెబుతోంది.
రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.
మూడు దశల్లో గోదావరి–బనకచర్ల అనుసంధానం చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణా నదికి, రెండో దశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి నీళ్లు నిల్వ చేయడం, మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు నీళ్లు మళ్లించడమే ఈ ప్రాజెక్ట్. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర సొరంగాన్ని తొవ్వతారు. దీని ద్వారా నీటిని బనకచర్లకు మళ్లిస్తారు.
మొత్తంగా తొలి దశ పనులకు రూ.13,511 కోట్లు, రెండో దశ పనులకు రూ.28,560 కోట్లు, మూడో దశ పనులకు రూ.38.041 కోట్లు మొత్తంగా రూ.80,112 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. గోదావరి –బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తైతే దేశంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
సరిగ్గా ఈ సందర్భంలోనే వరద జలాలపై ఎవరికి హక్కు ఉంటుందనే ప్రశ్న తలెత్తింది. దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే తామేమైనా అభ్యంతరం చెప్పామా అని చంద్రబాబు అంటుంటే భద్రాచలం ప్రాంతం మునిగితే దిక్కెవరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
పరిష్కార మార్గాలు..
ఈ నేపథ్యంలో జరగబోయే మార్చి 27నాటి సమావేశానికి జలరంగ నిపుణులు సూచించిన కొన్ని పరిష్కారాలు ఇలా ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ఒప్పందాలను మళ్లీ సమీక్షించాలి. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDTA) పరిధిలో ఇరు రాష్ట్రాలు కొత్త ఒప్పందానికి సిద్ధంగా ఉండాలి. దీని కోసం కేంద్రం మధ్యవర్తిగా వ్యవహరించాలి.
సాంకేతిక కమిటీ అవసరం: బ్యాక్‌వాటర్ ప్రభావం, గేట్ల షెడ్యూల్ మార్పులపై స్వతంత్ర టెక్నికల్ టీమ్ అధ్యయనం చేయాలి. నివేదికల ఆధారంగా మాత్రమే విస్తరణ నిర్ణయించాలి.
పునరావాస అంశాలపై స్పష్టత: ముంపు ప్రభావిత గ్రామాలకు పరిహారం, పునరావాసం వంటి అంశాలు కేంద్రం ఆధ్వర్యంలో సమీక్షించాలి.
శాశ్వత జల నిర్వహణ యంత్రాంగం: పోలవరం వంటి అతి కీలక జాతీయ ప్రాజెక్టులకు ప్రత్యేక పాలనా బోర్డులు ఏర్పాటుకావాలి. రాజకీయ ప్రభావానికి లోనుకాకుండా నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరగాలి.
నిబద్ధతకు నిదర్శనం..
పోలవరం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల కలల ప్రాజెక్టు. కానీ ఇప్పుడది జలవివాదాలకు వేదికగా మారినట్టుగా కనిపిస్తోంది. సహకారంతో పాటు పారదర్శకత, న్యాయం, చట్టపరమైన ప్రాతిపదికలు ఉండేలా కేంద్రం తక్షణ జోక్యం అవసరం. ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆశించడమే కాక, అలా జరగాలని వత్తిడి తలెత్తుతోంది.
ఈవేళ ఉన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, ఏ.రేవంత్ రెడ్డి ఒకప్పటి గురుశిష్యులే. ఇద్దరూ ఒకే కుదురు నుంచి ఎదిగిన వారే. నిజంగా వారి నిబద్ధతకు పోలవరం ప్రాజెక్టు ఓ నిదర్శనం కావాలి.
బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ పై సుమారు 10 జిల్లాల ప్రజలు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇది పూర్తి చేయకపోతే పోలవరాన్ని కూడా అమరావతికి అనుకూలంగా మార్చి బనకచర్ల ప్రాజెక్ట్ ను వెనక్కి నెట్టారనే అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందువల్ల, పొరుగు రాష్ట్రంతో సానుకూలంగా చర్చించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేలా మార్చి 27 నాటి సమావేశానికి తన అధికారులను సిద్ధం చేయాల్సి ఉంది.