మల్కాజ్ గిరిలో అంతా కొత్త వాళ్ల సంబరమే...

పోటీచేస్తున్న ముగ్గురికీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటం ఇదే మొదటిసారి. పైగా ముగ్గురు అభ్యర్ధులు కూడా పార్టీలు మారినవారే. అందుకనే గెలుపుపై ఆసక్తి పెరిగిపోతోంది

Update: 2024-04-17 06:53 GMT
Malkajgiri parliament candidates (source Twitter)

పోటీచేస్తున్న ముగ్గురికీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటం ఇదే మొదటిసారి. పైగా ముగ్గురు అభ్యర్ధులు కూడా పార్టీలు మారినవారే. అందుకనే తొందరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే విషయమై బాగా ఆసక్తి పెరిగిపోతోంది. పైగా నియోజకవర్గం బాగా పెద్దదవటం, ఓటర్లలో తెలంగాణా, సీమాంధ్ర జనాలు కలిసిపోవటంతో గెలుపోటములపై చర్చలు బాగా పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ లోని కీలకమైన నియోజకవర్గాల్లో మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం కూడా ఒకటి. దేశంలోనే అత్యధిక ఓటర్లు 30 లక్షలున్న నియోజకవర్గమిది. ఇక్కడినుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పట్నం సునీతా మహేందరరెడ్డి, బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీచేస్తున్నారు.

పట్నం సునీతా రెడ్డి బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు. పార్టీచేరేముందే ఎంపీ టికెట్ హామీతో చేరారు కాబట్టి హస్తంపార్టీ అభ్యర్ధి అయిపోయారు. మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్యే కాకుండా వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కూడా. బీఆర్ఎస్ ఓటమితర్వాత కాంగ్రెస్ లో చేరి అభ్యర్ధిగా పోటీచేస్తున్న సునీతపై పార్టీ నేతల్లో వ్యతిరేకత కనబడుతోంది. పట్నం ముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీ ఆ తర్వాత బీఆర్ఎస్ ఇపుడు మళ్ళీ కాంగ్రెస్ లో ఉన్నారు. ఇన్నిపార్టీలు మారారు కాబట్టే కాంగ్రెస్ స్ధానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయితే నియోజకరవర్గం వ్యాప్తంగా పట్నంకు మంచి మద్దతుదారులున్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలవరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఉప్పల్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవటంతో బీఆర్ఎస్ లోకి మారారు. అప్పట్లో లభించిన హామీ ప్రకారం ఇపుడు కారుపార్టీ తరపున పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. ఇక ఈటల గురించి కొత్తగా చెప్పాల్సిందిలేదు.

దాదాపు 20 ఏళ్ళు కారుపార్టీలో ఉండి ఎంఎల్ఏగా మంత్రిగా చేసిన తర్వాత అధినేత కేసీయార్ తో పడని కారణంగా మంత్రిగా బహిష్కృతుడైన తర్వాత బీజేపీలో చేరారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలిచారు. ఈమధ్యనే జరిగిన సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేలులో పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్ధి సునీతకేమో పార్టీలో సహాయనిరాకరణ ఎదురవుతోంది. ఇదేసమయంలో ప్రభుత్వంపై సానుకూలత, ఆరుగ్యారెంటీ హామీల్లో నాలుగు అమల్లోకిరావటం ప్లస్ గా మారే అవకాశముంది. రాగిడికేమో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తాలూకు నైరాశ్యం వెంటాడుతోంది. చాలామంది సీనియర్ నేతలు పార్టీని వదిలేసి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. పార్టీలో ఉన్న నేతలు పెద్దగా యాక్టివ్ గా లేకపోవటం అభ్యర్ధికి సమస్యగా మారుతోంది. ఫైనల్ గా ఈటల విషయం చూస్తే నేతలు, క్యాడర్ కరువుతో పార్టీ ఇబ్బందులు పడుతోంది. పార్టీ గెలుపు కేవలం నరేంద్రమోడి ఇమేజి, అయోధ్యలో రామాలయం నిర్మాణం మీద మాత్రమే ఆధారపడుంది.

మూడుపార్టీల అభ్యర్ధులకూ ప్లస్సులు, మైనస్సలున్నట్లు అర్ధమవుతోంది. ఈ నియోజకవర్గంలో అభ్యర్ధుల తరపున రేవంత్ రెడ్డి, కేసీయార్, జీ. కిషన్ రెడ్డి ప్రచారానికి రాలేదు. ఇప్పటికి అభ్యర్ధులు మాత్రం స్ధానికనేతల సాయంతో ప్రచారం చేస్తు రోడ్డుషోలు, ర్యాలీలు చేస్తున్నారు. 30 లక్షల మంది ఓటర్లను కలిసి ప్రసన్నంచేసుకుని ఓట్లు వేయించుకోవటం అంటే మామూలు విషయంకాదు. పైగా ముగ్గురికీ పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనటం మొదటిసారి. ఈటల, సునీతతో పొల్చితే రాగిడి ఒక్కళ్ళే లోకల్ అని చెప్పుకోవాలి. పార్లమెంటు పరిథిలోని ఏడుఅసెంబ్లీలు మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఎంఎల్ఏలే ఉన్నారు. ఇక్కడి నుండి 2019లో రేవంత్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినతర్వాత ఎంపీగా రాజీనామా చేశారు కాబట్టి ఇక్కడనుండి కాంగ్రెస్ ను గెలిపించుకోవటం రేవంత్ కు ప్రిస్టేజిగా మారింది. చివరకు ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి.

Tags:    

Similar News