ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
ఫార్ములా రేసులో ఒక్క రూపాయి అవినీతి లేదు. ఈ-కార్ రేసు తాను తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయమన్న కేటీఆర్.;
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గురువారం విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ ఆ రోజు తాను విచారణకు రాలేనని చెప్పడంతో ఈడీ అతని అభ్యర్థనను స్వీకరించింది. అనంతరం జనవరి 16న అంటే ఈరోజు విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ రూ.55కోట్ల చెల్లింపులు చేశారన్న అంశంపై ఏసీబీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువరు ఉన్నతాధికారులతో పాటు కేటీఆర్‌ను కూడా దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఈరోజు కేటీఆర్‌ను ఈడీ విచారించనుంది.
ఈడీ విచారణకు హాజరుకావడానికి ముందు కేటీఆర్ తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ కీలక పోస్ట్ పెట్టారు. అందులో ఒక్కరూపాయి కూడా దుర్వినియోగం కాలేదని అన్నారు. ‘‘భారతదేశం/తెలంగాణ/హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించడం మంత్రిగా నేను తీసుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఇ-మొబిలిటీ పరిశ్రమ నాయకులు మా నగరాన్ని ప్రశంసించడం గర్వంచదగ్గ విషయం, పనికిమాలిన కేసులు, చౌకగా బురదజల్లడం, రాజకీయాలు చేయడం వల్ల ఆ మంచి పనిని తొలగించలేవు. నాకు బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనద. నిన్న, రేపు, ఎప్పుడూ ఫార్ములా ఈ-రేస్ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టింది. బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీ ద్వారా ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ లిమిటెడ్‌కి రూ.46కోట్లు చెల్లించబడింది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఇందులో అవినీతి, దుర్వినియోగం, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది? ఏదైతేనేం సీఎం రేవంత్ రెడ్డి చిన్న చూపు, ఆయన ఆలోచనారహిత, ఏకపక్ష నిర్ణక్ష్ంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిన కార్యక్రమం రెండో ఏడాది రద్దు. గౌరవనీయమైన కోర్టులతో సహా అందరికీ కనిపించేలా త్వరలో నిజం బయటకు వస్తుందని నమ్ముతున్నా. అప్పటివరకు న్యాయం కోసం పోరాడతాం’’ అని రాసుకొచ్చారు.