Musi Pollution |మూసీ కాలుష్యంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదిక

మూసీ నదీ కాలుష్యంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కళాశాల విద్యార్థులతో సమగ్రసర్వే జరిపింది.మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టాల్సిన చర్యలపై సీఎంకు నివేదిక సమర్పించనుంది.;

Update: 2025-01-16 12:31 GMT

లంగర్ హౌస్ లోని బాపుఘాట్ నుంచి గౌరెల్లి వరకు 58 కిలోమీటర్ల దూరం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమగ్ర సర్వే జరిపింది. ఈ సర్వేలో మూసీ కాలుష్యానికి కారణాలు, సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్ల పేరిట సాగిన నిధుల దుర్వినియోగం, నదీ తీరప్రాంతాల ఆక్రమణలపై సమగ్ర నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించాలని నిర్ణయించారు.

వికారాబాద్ ప్రాంతంలోని అనంతగిరి పర్వతాల్లో పుట్టి హైదరాబాద్ నగరంలో గుండా ప్రవహిస్తూ మిర్యాలగూడ వద్ద కృష్ణా నదిలో కలుస్తున్న మూసీ నదీ కాలుష్య కాసారంగా మారింది. 240 కిలోమీటర్ల పొడవున్న ఈ నదిలో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్తా చెదారం కలుస్తుండటంతో ఈ నీరు విషతుల్యంగా మారింది.

విషతుల్యంగా మారిన పాలు, కూరగాయలు
మూసీ నదిలోని కలుషిత జలాలతో కూరగాయలు, వరి, ఇతర పంటలు పండిస్తున్నారు. రసాయనాలతో కూడిన నీటితో పండిన పంటలు విషతుల్యంగా మారాయి. మూసీ కలుషిత నీటితో పెరిగిన గడ్డిని ఆవులు, గేదెలు మేయడం వల్ల పాలు కూడా కలుషితమయ్యాయని ఉస్మానియా యూనివర్శిటీ జరిపిన అధ్యయంలో తేలింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని భూగర్భజలాలు కూడా రంగు మారి కలుషితమయ్యాయని ఎన్ జీ ఆర్ఐ శాస్త్రవేత్తల పరీక్షల్లో తేటతెల్లమైంది.

మూసీ కాలుష్యంపై హైకోర్టులో పిల్
మూసీ కాలుష్యంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరపున న్యాయవాది రచనా రెడ్డి 2016లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. సబర్మతీ నది లాగా మూసీని శుధ్ధి చేయాలని పిటిషన్ లో కోరారు. దీనిపై అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ జస్టిస్ రమేశ్ రంగనాథన్ లతో కూడిన ధర్మాసనం మూసీ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కోట్లాది రూపాయలు నిధులు వ్యర్థం
మూసీ ప్రక్షాళన కోసం కోట్లాది రూపాయలను వెచ్చించినా మూసీ కాలుష్యానికి తెర పడటం లేదు. కోట్లాది రూపాయల నిధులు మూసీ పాలయ్యాయి. నిధులు వ్యర్థం కాగా కాలుష్యం మాత్రం ఏ రోజు కారోజు పెరుగుతోంది. రోజుకు 1950 మిలియన్ లీటర్ల కలుషిత జలాలు మూసీలోకి చేరుతున్నాయని అధ్యయనంలో తేలింది.
మూసీ నదిలో కలుషిత నీరు కలవకుండా శుద్ధి చేసేందుకు 1931వ సంవత్సరంలోనే అంబర్ పేటలో 12 మిలియన్ గ్యాలన్ల సామర్ధ్యం గల సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంటును నిర్మించారు.
- 1997వ సంవత్సరంలో కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ నందనవనం పేరిట మూసీ సుందరీకరణ పథకాన్ని చేపట్టారు.
- మూసీలోకి కలుషిత జలాలు వదలకుండా మురుగునీటిని శుద్ధి చేసేందుకు 36 సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్లను నిర్మించినా అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీనికి తోడు మరో 9 ఎస్టీపీలను కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించారు.
- కాటేదాన్ నుంచి జీడిమెట్ల దాకా పలు పారిశ్రామిక వాడల నుంచి కలుషిత జలాలను మూసీలోకి వదలకుండా ఎఫ్లూయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను పరిశ్రమల్లో నిర్మించాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. పీసీబీ ఆదేశించినా కొన్ని పరిశ్రమలు పారిశ్రామిక వ్యర్థ జలాలను మూసీలోకి యథేచ్ఛగా వదులుతూనే ఉన్నారు. దీంతో కూడా మూసీ కలుషితమవుతోంది.
- మూసీ నదిని ప్రక్షాళన కోసం రూ.405 కోట్ల కేంద్ర నిధులతో పనులు చేపట్టారు.
- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.50 కోట్లతో రబ్బరు డ్యామ్ నిర్మించారు.
- మూసీ ప్రక్షాళన కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ, హైదరాబాద్ వాటర్ బోర్డులు పనులు చేపట్టినా వాటి మధ్య సమన్వయం లేక కోట్లాది రూపాయల నిధులు వ్యర్థం అయ్యాయి.
- 2017వ సంవత్సరంలో మూసీ ప్రక్షాళన, సుందరీకరణ కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసినా, మూసీ కాలుష్యానికి తెర పడలేదు.

మూసీ అభివృద్ధికి రూ.1000కోట్లు
గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతీ నది, లండన్ లోని థేమ్స్ నదిలాగా మూసీని పునరుజ్జీవంపచేసి, సుందరీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిలో భాగంగా మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. మూసీ అభివృద్ధి కోసం రూ.58వేల కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా వేశారు. 2024-25 సంవత్సర రాష్ట్ర బడ్జెట్ లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసం రూ.1000కోట్లను కూడా కేటాయించారు.

గోదావరి నీరు మూసీలోకి వచ్చేనా?
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి 5 టీఎంసీల గోదావరి జలాలను మూసీలోకి తీసుకువచ్చి మూసీని ప్రక్షాళన చేయాలని ప్రతిపాదించారు. మూసీ అభివృద్ధిలో భాగంగా గోదావరి జలాల తరలింపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మూసీ పునరుజ్జీవ పనులు చిత్తశుద్ధితో చేయాలి : సోమ శ్రీనివాసరెడ్డి
మూసీ పునరుజ్జీవ, సుందరీకరణ పనులను చిత్తశుద్ధిగా చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి సూచించారు. గతంలోలాగా సర్కారు నిధులను వ్యర్థం చేయకుండా పకడ్బందీ ప్రణాళికతో పనలు చేయాలని ఆయన కోరారు. మూసీ తీర ప్రాంతంలోని ఆక్రమణదారులకు పునరావాసం కల్పించి పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లాగా కాకుండా సర్కారు నిధులను సద్వినియోగం చేసిన మూసీని సుందరీకరించాలని, నల్గొండ జిల్లా రైతులకు కలుషిత నీటి స్థానంలో గోదావరి జలాలను సాగుకు అందించాలని ఆయన కోరారు.


Tags:    

Similar News