హైదరాబాద్ మురికివాడల వాసులకు శుభవార్త

హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి,మేడ్చ‌ల్‌మల్కాజ్‌గిరి ,సంగారెడ్డి జిల్లాల పరిధిలోని మురికివాడల నివాసులకు మహర్దశ కలగనుంది.;

Update: 2025-07-25 00:24 GMT
మురికివాడల వాసులకు ఇక ఇందిరమ్మ ఇళ్లు

హైద‌రాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి మేడ్చ‌ల్‌, సంగారెడ్డి జిల్లాల్లోని ప‌ట్ట‌ణాల్లో మురికివాడల వాసులకు జీవనోపాధి ఉన్న ప్రాంతాల్లోనే ఇందిర‌మ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నిర్ణయించింది.హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప‌రిధిలో మొద‌టి ద‌శ‌లో భాగంగా జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా పేద‌లు ఉన్న‌చోటే జీ ప్లస్ 3 ప‌ద్ద‌తిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం స్ధ‌లాల గుర్తింపునకు నాలుగు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఇటీవల సమావేశమై సమీక్షించారు.


జీ ప్లస్ 3 తరహాలో ఇళ్ల నిర్మాణం
గ్రామీణ ప్రాంతాల్లో మొద‌టి ద‌శ ఇందిర‌మ్మ ఇళ్ల ప్ర‌క్రియ కొలిక్కి వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పేద ప్ర‌జ‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సిస్తున్న చోట‌నే జీ ప్లస్ 3 ప‌ద్ద‌తిలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్దం చేస్తున్న‌ట్లు మంత్రి పొంగులేటి తాజాగా ప్ర‌క‌టించారు.ప‌ట్ట‌ణాల్లోని మురికివాడ‌ల్లో జీవ‌నం సాగిస్తున్న పేద‌లు అక్క‌డే ఉండ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌ నగరానికి దూరంగా ఇళ్లు నిర్మించి ఇస్తే త‌మ జీవ‌నోపాధికి ఇబ్బంది క‌లుగుతుంద‌న్న ఉద్ధేశంతో ఇళ్లు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు.గ‌త ప్ర‌భుత్వంలో కేటాయించిన ఇళ్ల‌లోకి పేద‌లు వెళ్ల‌డం లేద‌ని తేలింది. దీంతో ఈ అంశాల‌న్నింటినీ దృష్టిలో పెట్టుకొని త్వ‌ర‌లో మొద‌టిద‌శ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాల‌ను ప్రారంభించాలని గృహనిర్మాణ శాఖ నిర్ణయించింది.

ఖాళీ స్థలాల గుర్తింపునకు ఆదేశాలు
ప‌ట్ట‌ణ ప‌రిధిలోని మురికివాడ‌ల్లో నివ‌సిస్తున్న వారికి అక్కడే జీ ప్లస్ 3 ప‌ద్ద‌తిలో ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డానికి వీలుగా స్ధ‌లాల‌ను గుర్తించనున్నారు. ప్ర‌భుత్వ స్ధ‌లాలు, ప్రైవేటు వ్య‌క్తులకు చెందిన పేద‌ల అధీనంలో ఉన్న స్ద‌లాల‌తో పాటు క‌బ్జాకు గురైన ప్రాంతాల‌ను కూడా గుర్తించనున్నారు.భూదాన్ భూముల‌ను పేద‌ల ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించే వెసులుబాటు ఉన్నందున అలాంటి భూముల‌ను గుర్తించి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా నివేదిక ఇవ్వాల‌ని మంత్రి అధికారులకు సూచించారు.

166 మురికివాడల్లో 42,432 మంది నివాసం
జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 166 మురికివాడ‌ల్లో 42,432 మంది నివ‌సిస్తున్నార‌ని , ఇంత‌వ‌ర‌కు హైద‌రాబాద్ జిల్లాలో 106, సంగారెడ్డిలో 5, మేడ్చ‌ల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 12, రంగారెడ్డిలో 26 మురికివాడ‌ల్లో స‌ర్వే నిర్వ‌హించి 25,501 క‌చ్చా ఇళ్లలో పేద‌లు ఉంటున్న‌ట్లు అధికారులు గుర్తించారు. దీనిపై మ‌రింత లోతైన ప‌రిశీల‌న జ‌రిపి ఎన్ని మురికివాడ‌ల్లో ఎంత భూమి అందుబాటులో ఉంది? జి+3 ప‌ద్ద‌తిలో ఎన్నిఇందిర‌మ్మ ఇళ్లు నిర్మించ‌వ‌చ్చు అనే అంశాల‌పై ఈనెలాఖ‌రులోగా పూర్తిస్దాయి నివేదిక రూపొందించనున్నారు.

డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయండి
అసంపూర్తిగా ఉన్న 2 బీహెచ్ కే ఇళ్లను పూర్తిచేయాల‌ని,వాట‌ర్‌, క‌రెంట్, డ్రైనేజ్ వంటి క‌నీస వ‌స‌తుల‌ను క‌ల్పించి మిగిలిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఆగ‌స్టు నెలాఖ‌రులోగా కేటాయింపులు పూర్తిచేయాల‌న్నారు.

హౌసింగ్ కాలనీస్ ఇన్ స్పెక్షన్ యాప్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఇళ్లు ఉన్నవారికే డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయడంతో దీనిపై రాష్ట్రప్రభుత్వం హౌసింగ్ కాలనీస్ ఇన్ స్పెక్షన్ యాప్ పేరిట సర్వేను ప్రారంభించింది. ఇప్పటికే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్లలో అసలు లబ్ధిదారులు ఉంటున్నారా లేదా అనేది సర్వే చేశారు. గత సర్కారు 1.36 లక్షల మందికి ఇళ్లను కేటాయించగా, చాలామంది ఆయా ఇళ్లలో ఉండటం లేదని తేలింది. ఆయా ఇళ్లను అద్దెకు ఇచ్చారని వెల్లడైంది.


Tags:    

Similar News