తెలంగాణలో తగ్గిన ఆదాయం, ఆదాయ పెంపుపై సర్కారు దృష్టి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2024-25 వ ఆర్థిక సంవత్సరం అర్ద భాగంలో వచ్చిన ఆదాయం తగ్గింది.కాంగ్రెస్ సర్కారు అమలు చేస్లున్న పథకాల అమలుకు నిధుల అవసరం ఉంది.

Update: 2024-11-16 10:37 GMT

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు తొలి అర్దభాగంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.42,034 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా, ఇందులో రూ.4,719 కోట్ల మేర తగ్గిందని తెలంగాణ ఆర్థికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మద్యంపై రూ.8,079 కోట్ల ఆదాయ లక్ష్యం కాగా తొలి అర్దభాగంలో కేవలం రూ.31 కోట్లు మాత్రమే పెరిగింది.మద్యం అమ్మకాల వల్ల రాష్ట్రానికి రూ.8,110 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. జీఎస్టీ, పెట్రోలియంపై అమ్మకపు పన్ను, వృత్తి పన్నుల ఆదాయం లక్ష్యం కంటే తగ్గింది.


తగ్గిన పన్ను వసూళ్లు
జీఎస్టీపై ఆదాయ లక్ష్యం రూ.24,906 కోట్లు కాగా, కేవలం 20,820 కోట్లు మాత్రమే వచ్చింది. జీఎస్టీలో రూ.4,086కోట్లు తగ్గింది. పన్నుల వసూళ్లలో 16 శాతం తగ్గింది. పెట్రోలియం అమ్మకాలపై పన్ను లక్ష్యం రూ.8,606కోట్లు కాగా రూ.654కోట్లు తగ్గింది. వృత్తి పన్నులోనూ రూ.17కోట్లు తగ్గింది. దీనికితోడు భూముల రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా తగ్గింది.

ఆదాయం పెంపుపై సర్కారు దృష్టి
రాష్ట్ర ఆదాయం తగ్గడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూళ్లు వంద శాతం చేసేందుకు సమాయత్తం అయింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రభుత్వ శాఖలలతో సీఎంతోపాటు మంత్రులు సమీక్షించారు. ఆడిట్, ఎన్ ఫోర్స్ మెంటు విభాగాలను అప్రమత్తం చేసి పన్నుల రూపేణా వచ్చే ఆదాయం పెంచాలని అధికారులకు సీఎం లక్ష్యాలు నిర్దేశించారు.

11 నెలల్లో రూ.11,000కోట్లు తగ్గిన ఆదాయం...బీఆర్ఎస్ ఎక్స్ పోస్టు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆదాయం భారీగా పడిపోయిందని బీఆర్ఎస్ పార్టీ శనివారం ఎక్స్ పోస్టులో పేర్కొంది. పదకొండు నెలల్లో తెలంగాణకు పదకొండు వేల కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గిందని బీఆర్ఎస్ ఆరోపించింది. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతగాక, వ్యక్తిగత కక్షలతో తెలంగాణను అధోగతి పాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది.


Tags:    

Similar News