వాళ్లకి పార్టీలోకి నో ఎంట్రీ: హరీష్ రావు

280 మంది రైతులు,38 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణమని హరీష్ రావు ఆరోపించారు. పార్టీలు మారిన వారిని మళ్లీ బీఆర్ఎస్‌లోకి అనుమతించమని చెప్పారు.

Update: 2024-03-31 13:39 GMT
కామారెడ్డి నియోజకవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న హరీష్ రావు

రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల కోసం చేసిందేమీ లేదని, ఆఖరికి వారి మాటల్లో కూడా రైతుల సంక్షేమం వినబడలేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు వరకు మక్కలకు, వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మొఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే రైతులకు భరోసా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.


ఎన్నికల్లో సత్తా చాటుదాం

‘‘రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలి. గులాబీ పార్టీని గుండెలకు హత్తుకున్న చరిత్ర కామారెడ్డి నియోజకవర్గంది. బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన రెండు నెలలకే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జడ్పీల్లో విజయం సాధించాం. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో కూడా గెలిచాం. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఉద్యమకారుడు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు. అలాంటి నేతను గెలుపించుకుందాం’’అని పిలుపునిచ్చారు హరీష్ రావు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలనే ప్రజలు కూడా భావిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
నిజం నిలకడమీద తెలుస్తుంది
ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే వందరోజుల్లోనే తాము చెప్తున్న ఆరు గ్యాంరెటీలను అమలు చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటికీ వాటిలో కొన్ని అమలు కావల్సి ఉందని గుర్తు చేశారు. ‘‘ప్రజలకు నిజమేంటో నిలకడగా తెలుస్తుంది. అప్పట్లో మక్కలకు, వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొంటామన్నారు. అప్పట్లో వర్షాకాలం కావడంతో ఆ పంటను కూడా అమ్ముకోవద్దని, తాము అధికారంలోకి రాగానే బోనస్‌లో కొంటామని కబుర్లు చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది. యాసంగి పంట కూడా వచ్చేస్తోంది. ఇప్పుడు మనం అడగాలి ‘మక్కలకు, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తానన్న కుక్కల కొడకా యాడున్నవ్ రా’అని. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఇంటింటికి వెళ్లి వివరించాలి. పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరాండం అని రేవంత్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా వాళ్లనే గెలిపిస్తే ఇక వాళ్ల ఆగడాలకు హద్దులు ఉండవు. వాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా రాష్ట్రంలో పరిస్థితులు మారతాయి. నెరవేర్చాల్సిన హామీలకు ఎగనామం పెడతారు. రైతులకు రుణమాఫీ ఇస్తానని డిసెంబర్ 9న చెప్పారు. కొత్త సంవత్సరం వచ్చి మూడు నెలలు ముగిశాయి. అయినా ఇప్పటివరకు వాటి ఊసే లేదు. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తమ ఎంపీ అభ్యర్థులకు ఓటేయమని అడుగుతారు’’అని విమర్శలు గుప్పించారు.

రైతులంటేనే చిన్న చూపు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా రైతులను మోసం చేసిందని, ప్రతి అంశంలో రైతులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చులకనైపోయారని, రైతుల గొప్పతనం కాంగ్రెస్‌కు అర్థం కావట్లేదని హరీశ్ రావు అన్నారు. ‘‘280 మంది రైతులు,38 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీనే కారణం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఉబుసుపోని, గాలి కబుర్లే చెప్పింది. అంతకుమించి చేసిందేమీ లేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రైతులు, ప్రజలకు కరెంటు కష్టాలు మొదలవుతాయి. ఇలాంటి కాంగ్రెస్ మెడలు వంచాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ను గెలిపించాలి’’అని పిలుపునిచ్చారు.
రైతుబంధును రాబందుల్లా లాక్కున్నారు
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. తాము అధికారంలో ఉన్నన్నాళ్లు రైతులకు రైతుబంధు ఏనాడూ ఆగలేదని, ఆఖరికి కరోనా సమయంలో కూడా రైతుబంధు అందించామని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్.. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఎకరాకు రూ. 15000 ఇస్తానని రైతులను మోసం చేశారని ఆరోపించారు. ‘‘ఇస్తానన్న రూ.15000 దేవుడెరుగు ఇస్తున్న రూ.10,000లను కూడా కాంగ్రెస్ ఆపేసింది. ఇప్పటివరకు రైతులకు రైతు బంధు రాలేదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్ర కాల్చి వాతబెట్టాలి. అప్పుడే మోసం చేస్తే చూస్తూ కూర్చునే చేతకాని వాళ్లు కాదు తెలంగాణ ప్రజలు అని అవగతమై రానున్న రోజుల్లో సరిగ్గా ప్రవర్తిస్తారు’’ అని ప్రజలకు సూచించారు.
వారికి నో ఛాన్స్
ఈ సందర్భంగానే పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీల పంచకు చేరిన నేతలకు కూడా హరీష్ రావు హెచ్చరిక జారీ చేశారు. వాళ్లకు ఇక ఛాన్స్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ‘‘ప్రలోభాలకు గురై, అవకాశమే పరమావధిగా భావించి పార్టీలు మారిన నేతలకు ఘర్ వాపసీ ఛాన్స్ ఇచ్చే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల పార్టీ కానీ అధికారం, డబ్బు పార్టీ కాదు. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పడానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ప్రశ్నించే గళమైన బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలి’’అని వెల్లడించారు.
Tags:    

Similar News