‘సిగాచీ బాధితుల పరిహారం ఏది రేవంతు’’
సిగాచీ పరిశ్రమ బాధితులకు అందాల్సిన పరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు.;
తెలంగాణలో ఇటీవల జరిగిన సిగాచీ పరిశ్రమ ప్రమాదం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదంలో రాష్ట్రమంతా విషాద చాయలు అలుముకున్నాయి. కూలీ కోసం వెళ్లిన తమ వారు మరణించారన్న వార్త బాధితుల కుటుంబాలను కలచివేసింది. ఆ ఘటనలో తాము బాధితులకు అండగా నిలుస్తామని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం భరోసా కల్పించింది. సంస్థ నుంచి మరణించిన వారికి రూ.కోటి నష్టపరిహారం అందించే బాధ్యతను కూడా ప్రభుత్వం స్వీకిరంచింది. కానీ ఇప్పటి వరకు బాధితులకు పూర్తి నష్టపరిహారం అందలేదని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సిగాచీ ప్రమాద బాధిత కుటుంబాలను కలిసి వారితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం గురించి ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఇప్పటి వరకు ఎంత మంది బాధితులకు పరిహారం అందించారో చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు.
‘‘సిగాచి అగ్ని ప్రమాద ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నది. కానీ అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి. ప్రమాదంలో 54 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నది. ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని, ఇప్పటి వరకు పరిహారం దిక్కులేదు అని గోడు వెళ్లబోసుకున్న బాధితులు.. రేవంత్ ప్రకటించిన కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా నెల రోజులు అయినా ఇంకా ఒక్కరికి కూడా అందలేదు. చనిపోయిన వారి మృతదేహాలను నూనె డబ్బాల్లో ప్యాక్ చేసి ఇచ్చారు. వలస కార్మికుల డెడ్ బాడీలను ఇలా అగౌరవపరిచి, ఇంత అమానవీయం ఎందుకు రేవంత్ రెడ్డి?’’ అని ప్రశ్నించారు.
‘‘బాధిత కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. వారికి పరిహారం ఎప్పుడు ఇస్తారు? పరిహారం కోసం అధికారులను కలిస్తే వారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరిగా సమాధానాలు కూడా ఇవ్వడం లేదు. ప్రమాదం జరిగి నెలకావొస్తున్నా మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇప్పటి వరకు వెల్లడించారు. ఇప్పటికయినా ప్రభుత్వం ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారు, ఎంతమందికి పరిహారం అందించారు వంటి వివరాలను బహిర్గతం చేయాలి’’ అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
అసలు సిగాచీ ప్రమాదం ఏంటి..?
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఫేజ్ 1లోని ప్లాట్ నంబరు 20,21లలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో (Sigachi Pharma Blast ) జూన్ 30వతేదీన ఉదయం 9.20 గంటలకు జరిగిన ఘోర పేలుడు ఘటన తర్వాత మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఫ్యాక్టరీలో టాబ్లెట్లు, క్యాప్సూల్స్ తయారీలో వాడేందుకు మైక్రోక్రిస్టలీన్ సెల్యూలోజ్ పౌడరు (Microcrystalline Cellulose Powder) ను సిగాచి పరిశ్రమలో ఉత్పత్తి చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు జరిగినపుడు పరిశ్రమ లోపల 143 మంది కార్మికులున్నారు.