బోనస్ ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతారు: హరీశ్ రావు

బీజేపీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. వరి బోనస్ ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

Update: 2024-03-06 13:03 GMT
Source: Twitter


తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల మంట రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఈసారి ఎంపీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతోంది. అన్ని పార్టీల చూపు విజయంపైనే ఉంది. ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలను తమ బ్యాగులో వేసేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ కసరత్తులు ప్రారంభించేశాయి. బీఆర్ఎస్ కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారం దూకుడు కనబరుస్తోంది. వీటిలో భాగంగానే సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయని ప్రశ్నించారు.
బీజేపీకి ఎప్పుడు చూసిన ఎన్నికల్లో గెలవాలి, గద్దెపై కూర్చోవాలన్న యావే తప్ప ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిద్దామని కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిద్దామన్న ఆలోచన కానీ రానే రాదని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలన అంతా తుస్సేనని, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏవేవో పథకాల పేర్లు చెప్తూ అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుందని మళ్లీ కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ నేతలను లాక్కుంటున్న బీజేపీ

బీజేపీ తన ఆపరేషన్ లోటస్‌ను తెలంగాణలో కూడా ప్రారంభించేసిందని హరీశ్‌ రావు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం కోసం తమ దగ్గర బలమైన నేతలు లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా బీజేపీ గాలం వేస్తోందని, అందులో భాగంగానే డబ్బు ఆశ చూపుతూ బీఆర్ఎస్ నేతలను లాక్కుంటోందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు బీజేపీ పలువురు బీఆర్ఎస్ నేతలతో చర్చలు చేసిందని, మరికొందరితో టచ్‌లో ఉందని అన్నారు.

రేవంత్.. కాంగ్రెస్‌ను మోసం చేశారు

సీఎం పదవి ఎక్కిన తర్వాత మోసాలు చేయడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కేవలం ప్రజలనే కాకుండా అతనికి సీఎం పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్‌కు కూడా వెన్నుపోటు పొడిచారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ నిలుస్తారన్నట్లు మాట్లాడి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని రేవంత్ చెప్పకనే చెప్పారని దుయ్యబట్టారు. వందరోజుల తమ పాలనను చూసి లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని రేవంత్ ప్రజలను కోరుతున్నారని, అసలు ఇన్ని రోజుల కాంగ్రెస్ పాలనలో ఏముంది చూడటానికి, అంతా తుస్సే కదా అని చురకలంటించారు.

బోనస్ ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతారు?

ప్రజలతో పాటు రైతులను కూడా రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశారని హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రైతులకు నీళ్లలో చందమామ లెక్క అమలు చేయలేని సంక్షేమ పథకాలను చూపి రేవంత్ సీఎం సీటు అందుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చాక రైతున్నలను మరిచి పోయారని ఆగ్రహించారు. ‘‘ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన 4 హామీల విషయంలో రేవంత్ మాట తప్పారు. వాటిని ఎప్పుడు నెరవేరుస్తారు. అసలు నెరవేరుస్తారా లేదా? వరికి బోనస్ ఇవ్వకుండా ఇప్పుడు మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?’’అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రేవంత్, కాంగ్రెస్ ఎన్నికల్లో వచ్చే అధికారం కోసం కాకుండా ప్రజలు, రైతుల సమస్యలపై పోరాడాలని, తమ కోసం పోరాడే నాయకులను ప్రజలు ఎప్పుడూ వదులుకోరని హితవు పలికారు. దీనిని సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించి ప్రజలు నిరూపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News