Harish BRS|హరీష్ చేతికి పగ్గాలు ?
పరిస్ధితులు కాస్త అనుకూలిస్తే బీఆర్ఎస్ పగ్గాలు సీనియర్ నేత, మాజీమంత్రి, సిద్ధిపేట ఎంఎల్ఏ హరీష్ రావు(Harish Rao) చేతికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదేఅనుమానం పెరిగిపోతున్నది. పరిస్ధితులు కాస్త అనుకూలిస్తే బీఆర్ఎస్ పగ్గాలు సీనియర్ నేత, మాజీమంత్రి, సిద్ధిపేట ఎంఎల్ఏ హరీష్ రావు(Harish Rao) చేతికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీ చీఫ్ గా కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్(KTR), ఎంఎల్సీగా కూతురు కల్వకుంట్ల కవిత(Kavitha) ఉన్నపుడు పార్టీపగ్గాలు హరీష్ కు ఎలా వస్తాయని అనుమానాలు రావచ్చు. అయితే హరీష్ కు తప్ప పైన చెప్పుకున్న ప్రతి ఒక్కరికీ మైనస్ పాయింట్లున్నాయి. అందుకనే కాలం కాస్త అనుకూలిస్తే అన్నది. కాలంకూడా హరీష్ కు అనుకూలించేట్లుగానే కనబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race) నిర్వహణలో రు. 55 కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అందుకనే కేటీఆర్ మీద కేసునమోదు చేసి విచారించాలని డిసైడ్ చేసింది. ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ మీద ఏసీబీ ఉన్నతాధికారులు కేసునమోదుచేసి విచారణజరిపే అవకాశాలు కనబడుతున్నాయి.
కేటీఆర్ మీద కేసు, విచారణ అంటే అరెస్టు కూడా తప్పదనే సంకేతాలు ప్రభుత్వం నుండి బలంగా కనబడుతున్నాయి. కేటీఆర్ అరెస్టయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కొద్దిరోజులు జైలులో(KTR Jail) ఉండాల్సుంటుంది. కేటీఆర్ ను జైలులో పెడితే పార్టీ తప్పనిసరిగా కోర్టులో పిటీషన్ వేయటం ఖాయం. కేటీఆర్ ఎన్నిరోజులు జైలులో ఉండాలన్న విషయాన్ని కోర్టుతేల్చాలి. ఇక కవిత విషయం తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో పీకల్లోతు ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆరుమాసాలు ఢిల్లీలోని తీహార్ జైలు(Tihar Jail)లో ఉన్న కవిత పెద్ద పోరాటంచేస్తే కాని బెయిల్ దొరకలేదు. బెయిల్ ఎప్పుడు రద్దయితే అప్పుడు కవిత మళ్ళీ తీహార్ జైలుకు వెళ్ళక తప్పదు. పైగా పార్టీ నేతలు, క్యాడర్ నుండి కవితకు ఎంతవరకు మద్దతు దొరుకుతుందో తెలీదు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుదేలైపోయారు. నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవకపోవటంతో పార్టీ నేతలు నీరుగారిపోయారు.
పార్లమెంటుఎన్నికల్లో ఘోరపరాజయందెబ్బకు కేసీఆర్ జనాల్లోకి రావటమే మానేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు జనాలు ఎంతగా ఇబ్బందులు పడినా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుండి బయటకురాలేదు. జనాల్లోకి కాదు కదా చివరకు అసెంబ్లీ సమవేశాల్లో కూడా పాల్గొనటంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన రెండు రోజులకే కిందపడినపుడు తుంటిఎముక విరిగింది. దాంతో ఇపుడు ఫ్రీగా నడవలేకపోతున్నారు. తర్వాత కూతురు అరెస్టు కేసీఆర్ ను బాగా కుంగదీసినట్లుంది. అందుకనే ఎప్పుడైనా నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకోవటం మినహా తాను బయటకు రావటంలేదు. కాబట్టి కేటీఆర్ అరెస్టయినా కేసీఆర్ యాక్టివ్ అయిపోయి రాష్ట్రమంతా తిరిగేస్తారనే భ్రమలు ఎవరిలోను లేవు. కొడుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ జైలుకెళ్ళితే, కూతురు బెయిల్ మీదున్న కారణంగా, తన అనారోగ్యం వల్ల పార్టీని నడిపించాలంటే పగ్గాలు ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. కేటీఆర్ అరెస్టు అయితే పార్టీ పగ్గాలు ఎవరికి అనే చర్చ ఇప్పటికే పార్టీ నేతల మధ్య జరుగుతున్నట్లు సమాచారం.
హరీష్ ప్లస్ పాయింట్లు ఏమిటి ?
పై ముగ్గురికి మైనస్ పాయింట్లను గమనించిన తర్వాత హరీష్ రావుకు ప్లస్ పాయింట్లు బాగానే కనబడుతున్నాయి. మొదటిది ఏమిటంటే అనర్గళమైన వాగ్థాటి ఉండటం. రెండో పాయింట్ జనాల్లో చొచ్చుకునిపోయే మనస్తత్వం. పార్టీ మొత్తంమీద ఆమోదయోగ్యమైన నేత ఎవరన్నా ఉన్నారంటే అది హరీష్ మాత్రమే. నాలుగో పాయింట్ ఏమిటంటే హరీష్ మీద పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోవటం. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) విచారణ కూడా కేసీఆర్ కేంద్రంగానే జరుగుతోంది. అవినీతి ఆరోపణలు ఎక్కువగా కేసీఆర్ మీదే కేంద్రకృతమైంది. ఇక ఐదో పాయింట్ ఏమిటంటే సబ్జెక్టు నాలెడ్జీ ఉండటం. ఏ అంశం మీదయినా అనర్గళంగా మాట్లాడటం పెద్ద ప్లస్ పాయింట్. ఆరో పాయింట్ ఏమిటంటే సమస్యల మీద స్పీడుగా స్పందించే గుణం ఉండటం. ఇదేసమయంలో మైనస్ పాయింట్లు పెద్దగా కనబడకపోవటం కూడా ప్లస్ అనేచెప్పాలి.
అదృష్టం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లుగా పై ముగ్గురికి ఉన్న మైనస్ పాయింట్లే హరీష్ కు ప్లస్ పాయింట్లు అవుతాయనటంలో సందేహంలేదు. హరీష్ బీజేపీ(BJP)లో చేరుతారని, కాదు కాదు కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా వినబడుతున్నది. హరీష్ గనుక రెడీ అంటే వెంటనే చేర్చుకుని సముచితస్ధానం ఇవ్వటానికి పార్టీలు సిద్ధంగా ఉంటాయనటంలో సందేహంలేదు. పార్టీలో క్రేజ్, ఆమోదయోగ్యం ఉన్న నేత హరీష్ మాత్రమే. కాబట్టి జరగరాని ఘటనలు జరిగితే తొందరలోనే పార్టీపగ్గాలు హరీష్ చేతిలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.