BRS Cornered|అసెంబ్లీలో బీఆర్ఎస్ కార్నర్ అయ్యిందా ?
అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షం సీ(CPI)పీఐ, ప్రతిపక్షాలు బీజేపీ(BJP), ఏఐఎంఐఎం(AIMIM) కూడా బీఆర్ఎస్ ను ఒక ఆటాడుకున్నాయి.;
తెలంగాణా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఒక విచిత్రంగా జరిగింది. అదేమిటంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను మిగిలిన అన్నీ పార్టీలు కలిపి కార్నర్ చేసేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి బీఆర్ఎస్ కు మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. విషయం ఏదైనా కానీండి రెండు పార్టీల్లో ఒకటి అవును అంటే రెండోపార్టీ కచ్చితంగా కాదనే అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాలనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao) మొత్తం తప్పులు, అప్పులమయమే అని పదేపదే ఆరోపణలు, విమర్శల దాడులతో అసెంబ్లీని హోరెత్తించేస్తున్నారు. దీన్ని రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య అసెంబ్లీలో పెద్ద గొడవలైపోతున్నాయి.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వారంరోజులుగా జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ ఒంటరిపార్టీ అయిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షం సీ(CPI)పీఐ, ప్రతిపక్షాలు బీజేపీ(BJP), ఏఐఎంఐఎం(AIMIM) కూడా బీఆర్ఎస్ ను ఒక ఆటాడుకున్నాయి. ఫార్ములా కార్ రేసు(Formula Car Race) కుంభకోణంలో కేటీఆర్ మీద ఏసీబీ కేసు(ACB Case on KTR) నమోదుచేయటాన్ని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు తట్టుకోలేకపోయారు. కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదుచేసిందని తెలియగానే సభలోని కారుపార్టీ ఎంఎల్ఏలు ఒక్కసారిగా గోలమొదలుపెట్టారు. ఆ సమయంలో సభలో ‘భూభారతి’ (Bhu Bharathi)మీద చర్చ మొదలవబోతోంది. భూములకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలోని ధరణి(Dharani) వ్యవస్ధను రద్దుచేసిన రేవంత్ ప్రభుత్వం కొత్తగా భూభారతి వ్యవస్ధను తీసుకొచ్చింది. ఈ వ్యవస్ధ అమల్లోకి రావాలంటే అసెంబ్లీలో చర్చ జరిగి బిల్లు ఆమోదంపొంది, గవర్నర్ సంతకం అయితే చట్టరూపం దాల్చుతుంది.
భూభారతి వ్యవస్ధను రేవంత్ ప్రభుత్వం చాలా ప్రిస్టేజిగా తీసుకున్నది. అందుకనే ఈ బిల్లుకు ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇంతటి కీలకమైన భూభారతి మీద చర్చకు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడ్డారు. ఫార్ములా కార్ రేసులో కేటీఆర్ మీద కేసు నమోదుపైన అసెంబ్లీలో చర్చజరగాల్సిందే అని హరీష్ నాయకత్వంలోని ఎంఎల్ఏలు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ అంగీకరించకపోవటంతో సభనిర్వహణకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలే పదేపదే అడ్డుపడ్డారు. దాంతో రేవంత్ రెడ్డి సహజంగానే తీవ్రఅభ్యంతరాలు వ్యక్తంచేయటమే కాకుండా బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని తప్పుపట్టారు. తర్వాత మాట్లాడిన మంత్రులు కూడా రేవంత్ పద్దతిలోనే కారుపార్టీ ఎంఎల్ఏల వైఖరిని తప్పుపట్టారు.
తర్వాత సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా బీఆర్ఎస్ ను తప్పుపడుతునే మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు, ప్రజలందరికీ ఎంతో ముఖ్యమైన భూముల వ్యవహారంపై చర్చించాలని ప్రభుత్వం అనుకుంటే ఒక వ్యక్తికి సంబంధించిన(కేటీఆర్) ఫార్ములా కార్ రేసు వ్యవహారంపై చర్చించాలని పట్టుబట్టడం మంచిదికాదన్నారు. బీఆర్ఎస్ సభ్యులు తమ పద్దతిని మార్చుకోవాలని, సభా వ్యవహారాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతు బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన లక్షల కోట్ల రూపాయల అప్పులపై సభలో చర్చజరగాల్సిందే అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మౌళిక సదుపాయాలు మెరుగుకాక, ప్రాజెక్టులు పూర్తికాక చేసిన లక్షల కోట్ల రూపాయలు ఎటుపోయాయో తేలాలని డిమాండ్ చేశారు. పనిలోపనిగా కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు పెద్దగా తేడా ఏమీలేదని మండిపడ్డారు. చివరగా ఫార్ములా కార్ రేసు కేసు కేటీఆర్ కు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాబట్టి ప్రత్యేకించి అసెంబ్లీలో చర్చ అవసరంలేదన్నారు.
ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతు బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తను తీవ్రంగా ఆక్షేపించారు. సభలో కారుపార్టీ ఎంఎల్ఏలు అరాచకంగా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు. పదేళ్ళు కచరా ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ అసెంబ్లీలో ఎంఎల్ఏలను ఇలానే వ్యవహరించమని నేర్పించారా ? అని నిలదీశారు. రాష్ట్రంలోని లక్షలాదిమందికి ఎంతో అవసరమైన భూముల వ్యవహారంపై చర్చ జరుగుతుంటే పదేపదే అడ్డుపడటం బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు తగదని హితవు పలికారు. ఫార్ములా కార్ రేసు కుంభకోణం కేటీఆర్ వ్యక్తిగతానికి సంబంధించిన విషయంకాబట్టి అసెంబ్లీలో ప్రత్యేకించి చర్చజరగాల్సిన అవసరంలేదని అక్బర్ తేల్చిచెప్పేశారు. అంతేకాకుండా సభావ్యవహారాలను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ ఎంఎల్ఏలను సస్పెండ్ చేయాల్సిందే అని సూచించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఇదే ఎంఐఎం పార్టీ కేసీఆర్ కు ఎంతో సన్నిహితంగా ఉన్న విషయం అందరుచూసిందే. అలాంటి పార్టీ శాసనసభాపక్ష నేత అక్బర్ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇపుడు కచరా ప్రభుత్వం అనటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తంమీద అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను కాంగ్రెస్ తో అన్నీ పార్టీలు కలిసి కార్నర్ చేసినట్లు అర్ధమైపోతోంది.