బీజేపీలో ‘కులసమరం’ బయటపడిందా ?
పేర్లు ప్రస్తావించుకోకుండానే ఒకరిని మరొకరు తిట్టుకుంటు, వార్నింగులు ఇచ్చుకోవటం పార్టీలో కలకలం రేపుతోంది;
తెలంగాణ భారతీయ జనతాపార్టీలో ఇంతకాలం నివురుగప్పిన నిప్పులాగున్న కులసమరం ఇపుడు ఒక్కసారిగా బయటపడింది. అదికూడా పార్టీలో ఇద్దరు కీలకనేతలు, ఎంపీల రూపంలో బయటపడటంతో పార్టీలో సంచలనం మొదలైంది. ఇపుడు బయటపడిన కులసమరం చివరకు ఎక్కడకు దారితీస్తుందో తెలీక సీనియర్ నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వివాదానికి కేంద్రబిందువుగా నిలిచిన ఎంపీలిద్దరు బీసీ సామాజికవర్గానికి చెందిన వారే కావటం. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay), మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. పేర్లు ప్రస్తావించుకోకుండానే ఒకరిని మరొకరు తిట్టుకుంటు, వార్నింగులు ఇచ్చుకోవటం పార్టీలో కలకలం రేపుతోంది. బండి సంజయ్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత కాగా ఈటల రాజేందర్ మున్నూరుకాపు సామాజికవర్గం నేత.
తెలంగాణలో బీసీ సామాజికవర్గానిదే జనాభారీత్యా పైచేయి. బీసీలంటే సుమారు 140 ఉపకులాలున్నాయి. వీటిల్లో ముదిరాజ్, మున్నూరుకాపు, పద్మశాలీ, గౌడ్, యాదవ్ ఉపకులాలదే ఆధిపత్యం. ముదిరాజ్ జనాభా సుమారు 26.36 లక్షలుండగా, మున్నూరుకాపుల జనాభా సుమారు 13.71 లక్షలున్నారు. ఈజనాభా లెక్కల ప్రకారం చూస్తే పై రెండు కులాలు రాజకీయంగా ఎంతటి కీలకపాత్ర పోషిస్తున్నాయో అర్ధమవుతోంది. ఇపుడు విషయం ఏమిటంటే కేంద్రమంత్రిగా ఉన్నారుకాబట్టి బీజేపీలో ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రతినిధిగాబండి సంజయ్ వ్యవహరిస్తున్నారు. ఇదేసమయంలో ఎంపీగా ఉన్నారు కాబట్టి మున్నూరుకాపులో ఈటల(Eatala Rajendar) పార్టీపరంగా గట్టిపట్టు సాధించారు. ఇంతటి కీలకమైన సామాజికవర్గాలకు చెందిన ఇద్దరు నేతలమధ్య ఎంతోకాలంగా ఉన్నవిభేదాలు ఒక్కసారిగా బద్దలై బయటపడింది.
దీనికి నేపధ్యం ఏమిటంటే ఒకపుడు ఈటల హుజూరాబాద్ అసెంబ్లీ నుండి ప్రాతినిధ్యం వహించేవారు. అలాంటిది 2023 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే 2024 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్ గిరి(Malkajgiri) నుండి పోటీచేసి గెలిచారు. అలాగే కరీంనగర్(Karimnagar) ఎంపీగా రెండోసారి గెలిచిన బండి కేంద్రంలో హోంశాఖకు సహాయమంత్రయ్యారు. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ నాయకత్వం ఎన్ రామచంద్రరావును ఎంపిక చేసిన విషయం అందరికీ తెలిసిందే. అధ్యక్షపదవికి ఈటల గట్టిగా ప్రయత్నంచేసుకున్నారు. అయితే ఈటలకు అధ్యక్షపదవి రాకుండా బండి అడ్డుపడ్డారనే ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇద్దరు నేతలు బీసీలు, ఇద్దరు ఎంపీలే కావటంతో పార్టీలో ఇద్దరి మధ్య సహజంగానే ఆధిపత్య పోరాటం ఉండేది. దానికి ఈటలకు అధ్యక్షపదవి రాకుండా బండి అడ్డుకున్నారనే ప్రచారం పెరిగిపోయి అగ్నికి ఆజ్యంపోసినట్లయ్యింది.
పైకి తమిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరు చెప్పుకున్నా ఇద్దరూ మొహాలు చూసుకోవటానికి కూడా ఇష్టపడటంలేదన్న ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. ఈనేపధ్యంలోనే బండి నాలుగురోజుల క్రితం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఆసందర్భంగా ఒకసమావేశంలో మాట్లాడుతు 2024 పార్లమెంటు ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. తనఓటమికి ప్రయత్నించిన వారికి రాబోయే స్ధానికఎన్నికలు, పార్టీ సంస్ధాగత ఎన్నికల్లో అవకాశాలు తాను ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. ఇక్కడే పెద్ద సమస్య ఎదురైంది. అదేమిటంటే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పార్టీ పరంగా చూసుకుంటే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జి కూడా బండే. కాబట్టి రాబోయే ఎన్నికల్లో బండి మద్దతుదారులకు, అనుచరులకు మాత్రమే పెద్దపీట వేస్తారనటంలో సందేహంలేదు. ఇదేసమయంలో మల్కాజ్ గిరి ఎంపీగా ఈటల తన అసెంబ్లీ నియోజకవర్గం హుజూరాబాద్ తో సంబంధం తెంపేసుకున్నట్లయ్యింది.
హుజూరాబాద్ నియోజకవర్గం అయితే బండి పరిధిలోకి వస్తుందికాని ఇక్కడ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నది ఈటల. కాబట్టి ఈటల బీజేపీలో చేరినపుడు బీఆర్ఎస్ లోని తన మద్దతుదారులు కూడా బీజేపీలో చేరారు. హుజూరాబాద్ లో బీజేపీకి ఉన్న నేతలు, క్యాడర్లో అత్యధికులు ఈటల మద్దతుదారులే. బండి ఆరోపణలు, విమర్శలను మద్దతుదారులు ఈటలతో చెప్పుకున్నారు. దాంతో బండిపర్యటన అయిపోయిన వెంటనే ఈటల హుజూరాబాద్ లో పర్యటించారు. తనపర్యటనలో బండిపేరు ప్రస్తావించకుండానే ‘‘కొడకా’’ అంటు నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేయటంతో పాటు తనతో పెట్టుకోవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. రెండువైపులా ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవటం పెద్ద వివాదంగా మారింది. ఈవివాదం బీజేపీ అంతర్గత వివాదంగా కాకుండా రెండు కులాల మధ్య వివాదంగా ముదురుతోంది. బీసీల్లోని ఐదు పవర్ ఫుల్ సామాజికవర్గాల్లో ఇద్దరు ఎంపీలు చెరో సామాజికవర్గం ముదిరాజ్, మున్నూరుకాపుకు చెందటంతో ఇపుడు గొడవ పై రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారే సూచనలు కనబడుతున్నాయి.
ఎందుకంటే ఇద్దరి అనుచరులు తమనియోజకవర్గాల్లో కులాల పేర్లతో గొడవలు పడుతున్నారని పార్టీలో టాక్ పెరిగిపోతోంది. కులసమరం గనుక ఇక్కడితో కంట్రోల్ కాకపోతే ఎన్నికలనాటికి పెరిగి బాగా పెద్దదిగా మారిపోవటం ఖాయమనే ఆందోళన ఇతర సీనియర్లలో పెరిగిపోతోంది. అందుకనే ఇద్దరి వివాదంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ నాయకత్వానికి రిపోర్టు పంపినట్లు సమాచారం. మరి జాతీయ నాయకత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.