రహస్యభేటీని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుందా ?
తెలంగాణకాంగ్రెస్ లో ఏమి జరుగుతోందని అధిష్టానంకూడా ఆరాలుమొదలుపెట్టింది.;
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నాలుగురోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోని ఎనిమిదిమంది ఎంఎల్ఏలు ఒక హోటల్లో డిన్నర్ మీటింగ్ పేరుతో రహస్య సమావేశం జరిపిన విషయం తెలిసిందే. మీటింగ్ జరిగిన మరుసటి రోజు ఎంఎల్ఏల రహస్యభేటీ విషయం బయటపడింది. దాంతో పార్టీమొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రేవంత్ రెడ్డి(Revanth) మీద వ్యతిరేకతతోనే ఎంఎల్ఏలు రహస్యంగా భేటీ అయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) ట్విట్టర్లో పెట్టిన పోస్టు(Twitter post) వైరల్ గా మారింది. దాంతో వెంటనే రహస్యభేటీపై రేవంత్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh), మంత్రులు ఆరాలు తీశారు. భేటీ విషయమై రేవంత్ అందుబాటులోని మంత్రులతో చర్చించారు. పార్టీలో మొదలైన సంచలనం చివరకు ఢిల్లీలోని అధిష్టానం(AICC) దృష్టికి చేరింది. దాంతో తెలంగాణకాంగ్రెస్ లో ఏమి జరుగుతోందని అధిష్టానంకూడా ఆరాలుమొదలుపెట్టింది. రహస్యభేటీని అధిష్టానం సీరియస్ గా తీసుకొవటం వల్లే సీఎల్పీ మీటింగ్ డిసైడ్ అయ్యింది.
అసలు ఎంఎల్ఏల రహస్యభేటీ(MLAs dinner meet) పార్టీలో ఎందుకింత సంచలనంగా మారింది ? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎంఎల్ఏల నియోజకవర్గాలు కొన్నింటిలో బాగా గొడవలవుతున్నాయి. ఫిరాయింపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పదినియోజకవర్గాల్లోని సీనియర్ నేతలు రేవంత్ మీద బాగా మంటగాఉన్నారు. ఫిరాయింపుల్లోని కొన్నినియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల మద్దతుదారులు, కాంగ్రెస్ ఒరిజినల్ నేతల మద్దతుదారులు ఒకళ్ళపై మరొకళ్ళు దాడులు కూడా చేసుకుంటున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎంఎల్సీ జీవన్ రెడ్డి మద్దతుదారుడిపై ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ మద్దదుదారుడు దాడిచేసి హత్యచేసిన విషయం పార్టీలో సంచలనమైంది. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా హత్యలు కాదుకాని రెండువైపుల మద్దతుదారుల మధ్య గొడవలైతే అవుతున్నాయి.
ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లోని గొడవలనే రేవంత్ సర్దుబాటుచేయలేకపోతున్నాడు. దీనికి అదనంగా మరికొందరు పార్టీ ఎంఎల్ఏలు రహస్యంగా భేటీ అయ్యారనే వార్త పార్టీ నాయకత్వంపై పిడుగులాగ పడింది. స్ధానికసంస్ధల ఎన్నికలకు ముందు పార్టీలో జరుగుతున్న పరిణామాలతో రేవంత్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అర్ధమవుతోంది. ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లోని గొడవల సర్దుబాట్లు, పార్టీ ఎంఎల్ఏల్లోని అసంతృప్తులను సర్దుబాటు చేసే ఉద్దేశ్యంతోనే రేవంత్ అర్జంటుగా జిల్లాల వారీగా ఎంఎల్ఏలతో మీటింగ్ పెట్టుకున్నారు. అయితే అందుకు అధిష్టానం అంగీకరించలేదు. జిల్లాలవారీగా ఎంఎల్ఏల మీటింగుకు బదులుగా అందరు ఎంఎల్ఏలతో ఒకేసారి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ)మీటింగ్(CLP Meeting) పెట్టుకోవాలని అధిష్టానం రేవంత్ ను ఆదేశించింది. దాంతో వేరేదారిలేక రేవంత్ సీఎల్పీ మీటింగ్ పెట్టారు. అధిష్టానం ఆదేశాల కారణంగానే సీఎల్పీ మీటింగ్ జరుగుతున్న విషయం అర్ధమవుతోంది.
సీఎల్పీ మీటింగ్ అయిపోగానే రేవంత్ హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళుతున్నాడు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్ధితిపై వివరణ ఇవ్వబోతున్నారని పార్టీవర్గాల సమాచారం. పనిలోపనిగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ఫిరాయింపుల వ్యవహారం, పార్టీలో అసంతృప్తులు, పార్టీలోని నేతల మధ్య విభేదాలు, కులగణనసర్వే వివరాలు అన్నింటిపైనా చర్చించబోతున్నారని తెలిసింది. సీఎల్పీ సమావేశంలో ఏ అంశాలపై చర్చలు జరుగుతాయి, ఎంఎల్ఏలు ఏమి మాట్లాడుతారు, రేవంత్ ఏ విధంగా సర్దుబాట్లు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.