వచ్చేనెలకు ‘ఫిరాయింపు’ల విచారణ వాయిదా
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హత విచారణను సుప్రింకోర్టు ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది;
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హత విచారణను సుప్రింకోర్టు ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ దాఖలుచేసిన అనర్హత పిటీషన్లను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ విచారణ చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRs Defections) తరపున గెలిచిన పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. తమపార్టీ తరపున గెలిచిన పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించటాన్ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(KCR) తట్టుకోలేకపోయారు. కాంగ్రెస్(Congress), టీడీపీ(TDP) నుండి తానుమాత్రం ఎంఎల్ఏలను లాగేసుకోవచ్చు కాని తమపార్టీ నుండి మాత్రం ఒక్క ఎంఎల్ఏ కూడా ఇతరపార్టీల్లోకి ఫిరాయించకూడదన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది.
మొదట ఫిరాయింపులపై కేసులను బీఆర్ఎస్ హైకోర్టులోనే దాఖలుచేసింది. అయితే స్పీకర్ అధికారాల్లోకి హైకోర్టు జోక్యం చేసుకోవటానికి ఇష్టపడలేదు. అందుకనే బీఆర్ఎస్ దాఖలుచేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పుతో షాక్ తిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వెంటనే సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. ఆ కేసునే ఇపుడు సుప్రింకోర్టు విచారిస్తోంది. బీఆర్ఎస్ తరపున లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తు అనర్హత పిటీషన్లపై స్పీకర్ ఫిరాయింపు ఎంఎల్ఏలకు నోటీసులు జారీచేసి విచారణ కూడా మొదలుపెట్టలేదని ఆరోపించారు. కావాలనే స్పీకర్ విచారణలో జాప్యంచేస్తున్నట్లు వాదించారు. సుప్రింకోర్టు జోక్యంచేసుకుని ఫిరాయింపుల అనర్హతపై స్పీకర్ వెంటనే విచారణ చేసేట్లుగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సుందరం వాదనలకు అసెంబ్లీ కార్యదర్శి లాయర్ కూడా ధీటుగానే వాదనలు వినిపించారు. ఫిరాయింపు ఎంఎల్ఏలపై విచారణ, అనర్హత వేటువేసే విషయంలో స్పీకర్ కు నిర్దిష్ట గడవు ఏమీలేదన్నారు. అసెంబ్లీ స్పీకర్ అధికారాల్లో న్యాయస్ధానాలు జోక్యంచేసుకునేందుకు లేదన్నారు. అయితే ఈ వాదనతో జడ్జీలు ఏకీభవించలేదు. మొత్తానికి రెండువైపులా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా స్పీకర్ తరపు లాయర్ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లే ఒకపుడు కాంగ్రెస్, టీడీపీ ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలను కేసీఆర్ ప్రలోభాలకు గురిచేసి లాక్కున్నారు. అప్పట్లో తాను ప్రోత్సహించిన ఫిరాయింపులు తప్పని కేసీఆర్ కు అనిపించలేదు. అలాగే కేటీఆర్ కూడా ఫిరాయింపులు వద్దని కేసీఆర్ కు చెప్పినట్లుగా వినలేదు. కేసీఆర్ ప్రోత్సహించిన ఫిరాయింపుల దెబ్బకు టీడీపీ, కాంగ్రెస్ విలవిల్లాడుతున్నపుడు ఇదే కేటీఆర్ అండ్ కో సంతోషించారు. బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని పై రెండుపార్టీల నేతలు స్పీకర్ కు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. కోర్టుల్లో కేసులు వేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. అప్పట్లో తాముపాల్పడిన ఫిరాయింపులు ఇపుడు తమకే ఎదురుతిరగటాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఎలాగైనాసరే ఫిరాయింపులపై అనర్హత వేటువేయించి తమపంతాన్ని నెగ్గించుకోవాలని పట్టుబడుతున్నారు.