అజారుద్దీన్ పేరు తొలగించొద్దు: హైకోర్టు

నార్త్ స్టాండ్‌కి ఉన్న పేరును మార్చొద్దని, అజారుద్దీన్ స్టాండ్‌గానే కొనసాగించాలని ఆదేశించింది న్యాయస్థానం.;

Update: 2025-04-30 07:19 GMT

అజారుద్దీన్‌కు హైకోరటులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో తన పేరిట ఉన్న స్టాండ్‌ పేరు మార్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కి ఉన్న పేరును మార్చొద్దని, అజారుద్దీన్ స్టాండ్‌గానే కొనసాగించాలని ఆదేశించింది న్యాయస్థానం. ఈ విషయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. దీంతో నార్త్ స్టాండ్ పేరు మార్చాలన్న హెచ్‌సీఏ ఆలోచనకు బ్రేకులు పడ్డాయి.

ఉప్పల్ స్టేడియంలో మహ్మద్ అజారుద్దీన్ పేరుతో ఉన్న నార్త్‌స్టాండ్‌ పేరు మార్చాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. దానిపై అజారుద్దీన్ స్పందించిన తీరు వివాదానికి తెరలేపింది. ఈ ఆదేశాలపై స్పందించిన ఆయన.. దీనిని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ‘‘ఇందులో ఎలాంటి కుట్రకోణం, స్వప్రయోజనాలు లేవు. దీనిపై నేను ఎలాంటి కామెంట్‌ చేయదల్చుకోలేదు. ఆ స్థాయికి దిగజారాలని అనుకోవడం లేదు. ఈ అసోసియేషన్‌ను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుతోంది. 17 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌.. దాదాపు పదేళ్లపాటు భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నా. సారథిగా డిస్టింక్షన్‌లో పాసైన వ్యక్తిని. హైదరాబాద్‌లో క్రికెటర్లను ఇలాగేనా గౌరవించేది. ఇది చాలా బాధాకరం. తప్పకుండా కోర్టుకు వెళ్తాం. వందశాతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని అజారుద్దీన్‌ స్పష్టం చేశాడు. ఈమేరకు ఆయన హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం.. హెచ్‌సీఏ ఆలోచనలకు తాత్కాళిక బ్రేకులు వేసింది.

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అజారుద్దీన్‌ తన పేరును స్టాండ్‌కు పెట్టించడం సరైన నిర్ణయం కాదని, ఇందులో విరుద్ధ ప్రయోజనాలున్నాయని అంబుడ్స్‌మన్‌ పేర్కొన్నారు. వెంటనే స్టాండ్‌కు అజహర్‌ పేరును తొలగించడంతో పాటు క్రికెట్‌ మ్యాచ్‌ల టికెట్లపైనా ఆ ప్రస్తావన లేకుండా చూడాలని హెచ్‌సీఏను ఆయన ఆదేశించారు. 2019లో ఆ స్టాండ్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు ఉండేది. దానిని అజారుద్దీన్‌ స్టాండ్‌గా మార్చారు.

Tags:    

Similar News