కేటీఆర్ ఆఫీస్ దగ్గర హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఫైట్
ఎమ్మెల్యే ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.;
సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంపు ఆఫీసు దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఆయన ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కాగా వారిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య పరిస్థితులు హీటెక్కాయి. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు తీవ్ర నినాదాలు చేశారు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. వెంటనే స్పందించిన పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేశారు. అనంతరం ఇరు వర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. క్యాంపు కార్యాలయం దగ్గర నిమిషాల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. అసలు ఏం జరుగుతుంది అనుకునేలోపే వివాదం కాస్తా ఘర్షణగా మారిపోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తవాతావరణ నెలకొంది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత కూడా పోలీసులు అక్కడ హైలెర్ట్‌గా ఉన్నారు.
అయితే ఏడాదిగా పట్టించుకోని కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు మాత్రం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం ఫొటో ఉండాలని డిమాండ్ చేయడం, సీఎం ఫొటో పెట్టడానికి ప్రయత్నించడం చర్చలకు దారితీస్తోంది. అయితే ఇటీవల బీఆర్ఎస్ వాళ్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఫొటో ఉండటం లేదని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటో ఉండాలి కదా అని కాంగ్రెస్ శ్రేణులు ఈ పనికి పూనుకున్నాయని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో కేటీఆర్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ మోహరించారు.