ఓల్డ్ సిటి గుల్జార్ హౌస్ అంటే ఏమిటి?

చిన్న స్ధలాల్లోనే కమర్షియల్ కాంప్లెక్సులు కట్టేయటంతో ఏదన్నా ప్రమాదాలు జరిగితే లోపలున్న వారు తప్పించుకుని బయటకువచ్చే అవకాశాలు కూడా ఉండవు.;

Update: 2025-05-18 08:59 GMT
Gulzar House Area near Charminar

ఆదివారం తెల్లవారుజామున ఓల్డ్ సిటీలో జరిగిన అగ్నిప్రమాదంలో నిద్రలోనే 17 మంది చనిపోయిన విషయం సంచలనంగా మారింది. ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్(Gulzar Houz Fire accident) ఏరియాలోని ఒకభవనంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి, రెండో అంతస్తుల్లో 30మంది నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ అవటంవల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జరిగిన ప్రమాదంలో చిన్నా, పెద్దా, ఆడ, మగ 17 మంది చనిపోయారు. ప్రమాదస్ధలంలోనే కొందరు చనిపోగా ఆసుపత్రిలో మరికొందరు చనిపోయారు. ఇంతమంది చనిపోవటానికి కారణమైన గుల్జార్ హౌస్ ఓల్డ్ సిటీ(Old City)లో చాలా అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. వ్యాపారరీత్యా అత్యంత రద్దీగా ఉండే ఛార్మినా(Charminar)ర్ కు దగ్గరలోనే గుల్జార్ హౌస్ ఏరియా కూడా ఉంది. గుల్జార్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని స్ధానికులు గుల్జార్ హౌస్ ఏరియా అనే అంటారు.

గుల్జార్ హౌస్ అంటే ఏమిటి?

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గుల్జార్ హౌస్ ఏరియాకు చారిత్రకంగా ఎంతో ఘనమైన ప్రాముఖ్యత ఉంది. ఛార్మినార్ అంటే నాలుగు మినార్లతో(స్ధూపాలు) నిర్మించారని అందరికీ తెలిసిందే. చార్ మినార్లకు అనుగుణంగానే నిర్మించిన మరో చార్ కమాన్లను పాలకులు సుమారు 400 ఏళ్ళక్రితం చాలా విశాలంగానే నిర్మించారు. ఎంతో చరిత్ర కలిగిన గుల్జార్ హౌస్ ఏరియాలోని వీధి మధ్యలో పెద్ద ఫౌంటెన్ ను ఏర్పాటుచేశారు. చార్మినార్-మదీనా మస్జీద్ మధ్యలో ఈ ఫౌంటెన్ నిర్మితమైంది. ఫౌంటెన్ కు నాలుగు వైపులా విశాలంగా నిర్మించిన రోడ్లను జీలూ ఖానా లేక గార్డ్స్ స్క్వేర్ అనంటారు. నాలుగు రోడ్లను కలిపే మధ్యలో ఫౌంటెన్ ఉన్న ప్రాంతాన్ని చార్-సు-ఖా-హౌజ్ అని పిలిచేవారు. ఇదే కాలక్రమంలో సుఖ-హౌజ్ గాను తర్వాత గుల్జార్ హౌజ్ అని పాపులరైంది. 


 మహహ్మద్ ఖులీ కుతుషా (Mohammad Quli Qutb Shah) పాలనలో మొదట ప్రధానమంత్రిగా పనిచేసి మీర్ మోమిన్ అస్తారాబాది (Mir Momin Astarabadi) ఈ ఫౌంటెయిన్ ను నిర్మించాడు.


మొదట్లో ఇవి నిర్మించినపుడు నాలుగువైపులా సుమారు 350 అడుగుల వెడల్పుతోనే నిర్మించారు అప్పటి పాలకులు. అయితే కాలక్రమంలో ఈ ప్రాంతానికి విపరీతమైన గిరాకి ఏర్పడటంతో వ్యాపారస్తులకు ఈప్రాంతం చాలా కీలకమైపోయింది. అందుకని తక్కువస్ధలంలో ఎక్కువమంది వ్యాపారాలు చేసుకోవాలన్న ఆలోచనతో ఎవరికి వారుగా విశాలమైన రోడ్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పోటీపడి ఆక్రమించుకోవటం మొదలుపెట్టారు. వ్యాపారాలకు తోడు అప్పటికే నివాసముంటున్న స్ధానికుల కారణంగా ఏరియా మొత్తం జనాభాతో క్రిక్కిరిసిపోయింది. ఈ ఫౌంటెన్ను మొదట్లో నిజాం సైనికుల దాహార్తిని తీర్చటం కోసం నాలుగు వందల ఏళ్ళ కిందట నిర్మించారని చెబుతారు. అయితే నిజాంప్రభువులు పోయి ప్రజాపాలన రావటంతో సైనికులు పోయి పోలీసులు వచ్చారు. దాంతో పాలకులు ఫౌంటెన్ను పట్టించుకోవటం మానేశారు.

ఎప్పుడైతే పాలన మారిందో అప్పటినుండే గుల్జార్ హౌజ్ ఏరియాకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి కబ్జాలు మొదలైపోయాయి. ఇపుడు మనం చెప్పుకుంటున్న గుల్జార్ హౌజ్ ఎలాగ తయారైందంటే ఇసుకేస్తే రాలనంత జనాలతో నిండిపోయింది. అందుకనే ఇక్కడ వ్యాపార సముదాయాలు, షాపులు, ఇళ్ళతో రోడ్లన్నీ చాలా ఇరుకు ఇరుకుగా ఉంటాయి. చిన్న స్ధలాల్లోనే కమర్షియల్ కాంప్లెక్సులు కట్టేయటంతో ఏదన్నా ప్రమాదాలు జరిగితే లోపలున్న వారు తప్పించుకుని బయటకువచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఇపుడు అగ్నిప్రమాదం జరిగిన మూడంస్తుల భవనం కూడా అలా నిర్మించిందే. గ్రౌండ్ ఫ్లోర్లో ముత్యాలమ్మే షాపులుంటే మిగిలిన రెండుస్తుల్లో నివాసముంటున్నారు. షాపులను ఈమధ్యనే చెక్కతో ఇంటీరియర్ డిజైన్లు చేయించినట్లు ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ వై. నాగిరెడ్డి చెప్పారు. ఏసీ కంప్రెసర్ పేలుడువల్ల ప్రమాదం జరిగిందనే ప్రచారంపై నాగిరెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. కింద రెండుషాపుల్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం మొదలై చెక్క ఇంటీరియర్స్ అంటుకుని మంటలు లేచాయని , తర్వాత ఈ మంటలు  పెద్దవైపోయి పై రెండు అంతస్తులకు వ్యాపించినట్లు చెప్పారు.


"చాలా ఇరుకు స్ధలంలోనే జీ+2 అంతస్తులు ఉండటంతో ప్రమాదం జరిగితే బయటపడే అవకాశాలు లేవు.  గ్రౌండ్ ఫ్లోర్ పైన ఉన్న రెండు అంతస్తులకు చేరుకునే మెట్లు కేవలం మూడడుగుల వెడల్పు మాత్రమే ఉంది.  ఫైర్ సేఫ్టీ చర్యలు లేకపోవటంతో ప్రమాదాలు సంభవించినపుడు సురక్షితంగా బయటపడే రెండో మార్గం లేదు," అని నాగిరెడ్డి చెప్పారు. ఇలాంటి ఇరుకు భవనాలు ఈ ఏరియాలో ఇంకా చాలా ఉన్నట్లు కూడా ఆయన చోప్పారు.  మరి ఈ తాజా ప్రమాదంతో ఏరియా విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.

Tags:    

Similar News