మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూల్చివేత.. మండిపడుతున్న స్థానికులు..
కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కాకముందే ఎలా ఈ బ్రిడ్జ్ కూల్చేస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రజలు.
మూసారాంబాగ్ ప్రాంతంలో ఉన్న పాత బ్రిడ్జ్‌ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడానికి చర్యలు చేపట్టారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకుండా పాత బ్రిడ్జ్‌ని ఎలా కూల్చివేస్తారని, ఆ మాత్రం ఆలోచించరా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమకు తక్షణమే తాత్కాలిక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఈ బ్రిడ్జ్ భారీ వరదలను ఎదుర్కొంది. కాగా ఇప్పుడు వాహనాల రాకపోకలకు ఈ బ్రిడ్జ్ సురక్షితం కాదని భావించే కూల్చివేత చర్యలు చేపట్టినట్లు ఇంజినీరింగ్ విభాగం తెలుపుతోంది. కాగా స్థానికులకు ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
అంబర్ పేట నుంచి దిల్‌సుఖ్ నగర్ వరకు ప్రత్యామ్నాయ మార్గంగా గోల్నాక బ్రిడ్జ్ మాత్రమే ఉందని, పాత బ్రిడ్జ్ కూల్చివేత వల్ల 300 మీటర్ల మార్గాన్ని 5 కిలోమీటర్లుగా నడవాల్సి వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత పాత్ర బ్రిడ్జ్‌ను కూల్చాలని, అదే విధంగా పనులు చేపట్టిన సమయంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసి ఉండాల్సిందని స్థానికులు అంటున్నారు. అధికారుల చర్యల వల్ల తమకు తలెత్తున్న సమస్యలకు పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.