‘మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదు’
జూబ్లీ ఎన్నికలో సంచలనంగా మారుతున్న తారక్ ప్రద్యుమ్న లేఖ.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈఎన్నికలో ప్రధాని పోటీదారుగా ఉన్న మాగంటి సునీత విషయంలో ఈ పరిణామం జరిగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆమె నామినేషన్ వేశారు. దానిని ఎన్నికల అధికారులు కూడా ఆమోదించారు. ఇంతలో ఓ లేఖ.. ఉపఎన్నిక ప్రక్రియలో సంచలనంగా మారుతోంది. మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదని, తమ అమ్మ మాలినీ అంటూ తారక్ ప్రద్యుమ్న అనే వ్యక్తి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అసలేం జరుగుతంది? అని ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. గోపీనాథ్ వారసుడిని తానేనని తారక్ తన లేఖలో పేర్కొన్నారు.
సునీతది తప్పుడు ప్రచారం..!
‘‘మా అమ్మ మాలినీ దేవిని హిందూ వివాహ చట్ట ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సునీత అఫిడవిట్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలి’’ అని ప్రద్యుమ్న కోరారు. కాగా, ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్‌కు ఈసీ ఆమోదం తెలిపింది. మరోవైపు షేక్‌పేట్ ఆర్వో కార్యాలయానికి మాగంటి సునీత వచ్చారు. నామినేషన్‌లో తాను పేర్కొన్న అంశాలన్నీ సరైనవేనంటూ ఎన్నికల అధికారులకు డిక్లరేషన్ ఫారమ్ అందజేశారు.