హైదరాబాద్ లో పడిపోయిన బంగారం ధర
ఒక్క రోజులో ఆరువేలు తగ్గింది
హైదరాబాద్ లో ఒక్కసారిగా బంగారం ధరలు బుధవారం అమాంతం పడిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల నాణ్యమైన బంగారం ధర రూ 1, 28, 150కి చేరుకుంది. పదిగ్రాముల 22 క్యారెట్ల నాణ్యమైన బంగారం ధర రూ 1, 17, 500కు చేరుకుంది. మంగళవారంతో పోలిస్తే బంగారం ధర పదిగ్రాములకు 24 క్యారెట్లు ఆరు వేలు తగ్గింది.
ధన్ తెరాస్ ఉందని ఎగబడి బంగారం కొనుగోలు చేసినవారికి ఆ తర్వాత ఒక్కసారిగా ఆరువేలు తగ్గడం తీవ్ర నిరాశపరిచింది.
దీపావళి సందర్బంగా బంగారం ధరలు రాకెట్ లా పైకి ఎగిసినప్పటికీ పేలిన రాకెట్ మాదిరిగా ఒక్కసారిగా క్రిందకు పడిపోయాయి. బంగారం ధర పడిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2023 తర్వాత బంగారం ధర ఒక్కరోజులో ఆరువేలు పడిపోవడం ఇదే ప్రథమమని వాళ్లు చెప్పారు.
2025లో మునుపెన్నడూ లేని విధంగా అనూహ్యంగా పెరిగాయి. ఒక్కసారిగా 60 శాతానికి బంగారం ధరలు పెరిగాయి. దీపావళి తర్వాత అదే ఊపులో మార్కెట్ ఉంటుందని అందరూ ఊహించారు. 2026 నాటికి ఇది కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ లలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడుదారులు ముందుకొస్తున్నారు. బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకొచ్చారు. డాలర్ విలువ తగ్గడంతో బంగారం రేట్లు పెరగడానికి ఆజ్యం పోశాయి.
ఇటీవలికాలంలో బంగారం ధరలు రికార్డుస్థాయికి పెరగడంతో కొనుగోలు దారులు ఆందోళన చెందారు. ఐదారు రోజులుగా తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోలు దారులకు శుభవార్త అని చెప్పవచ్చు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్స్ కు దిగిన క్రమంలో ధరలు పడిపోతున్నాయి. ఆ ప్రభావం హైదరాబాద్ లో కనిపిస్తోంది.