‘సదర్’ కు ముస్తాబైన హైదరాబాద్

కనులవిందు చేయనున్న దున్నపోతుల విన్యాసాలు

Update: 2025-10-22 09:55 GMT

హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన సదర్ ఉత్సవం కనులపండువగా జరుగనుంది. దీపావళి రెండో రోజు(బుధవారం) సదర్ ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దున్నపోతులు దాదాపు 200 వరకు హైదరాబాద్ చేరుకున్నాయి.

గోలు- 2,రోలెక్స్, భజరంగి, బాద్ షా, కోహినూర్ ,కాళీ అనే పేర్లతో పిలిచే దున్నపోతులు హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో విన్యాసానికి సిద్దమయ్యాయి. హర్యానా రాష్ట్రం నుంచి వచ్చిన గోలు-2, రోలెక్స్, భజరంగి కోహినూర్ దున్నపోతులు ముషీర్ బాద్ లో నిర్వహించే సదర్ ఉత్సవాల్లో పాల్గొంటున్నాయని నిర్వాహకులు ఎడ్ల హరిబాబు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతులు హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి దున్నపోతులు హైదరాబాద్ కు వచ్చినట్లు ఎడ్ల హరిబాబు చెప్పారు.

సదర్ అనేది ఉర్దూపదం. నిజాం రాజుల కాలంలో హైదరాబాద్ సంస్థానంలో సదర్ పేరుతో ఉత్సవాలు జరిగేవి. ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది. సదర్ అంటే ప్రధాన ఉత్సవం అని అర్థం.

‘కాళీ’ దున్నపోతు విలువ 25 కోట్లు

కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన ‘కాళీ’ అనే దున్నపోతు అత్యంత విలువైన దున్నపోతుగా రికార్డులకెక్కింది. దీనివిలువ 25 కోట్లు ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీని బరువు 2, 100 కిలోలు.



ఫుల్ బాటిల్ తాగేస్తుంది

21 ఇయర్స్ ఓల్డ్ రాయల్ సెల్యూట్ బాటిల్ ను ఆపకుండా గటగటా తాగేస్తుంది. దీని విలువ 31 వేల రూపాయలు ఉంటుంది. వారానికి ఒకసారి ఫుల్ బాటిల్ తాగేస్తుంది. ప్రతి రోజు 20 లీటర్ల పాలు, పదికిలోల యాపిల్స్, పదిడజన్ల అరటిపండ్లు, రెండు కిలోల డ్రై ఫ్రూట్స్, 10 కిలోల గోధుమపొట్టును దున్నపోతుకు యజమానులు ఆహారగా అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ చేరుకున్న దున్నపోతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన కాళీహైదరాబాద్ లో నిర్వహించే సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోజుకు ఐదు నుంచి పదివేల రూపాయల వరకు దున్నపోతులకు యజమానులు ఖర్చు చేస్తున్నారు. వారానికి ఒక రోజు ఆముదం నూనెతో మసాజ్ చేయడం కంపల్సరీ. ఆరు అడుగుల ఎత్తు, 12 అడుగుల పొడవుతో ఉండే ఈ దున్నపోతులను చూడటానికి వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే హైదరాబాద్ కు తరలివచ్చారు. రెండు వేల కిలో మీటర్ల దూరం నుంచి ప్రత్యేక కంటైనర్లలో వచ్చిన ఒక్కో దున్నపోతుకు ఒక కేర్ టేకర్, ఐదుగురు సంరక్షకులు పని చేస్తున్నారు. ముస్తాబైన దున్నపోతులు రంగురంగుల విద్యుత్ కాంతులు,డప్పుచప్పుళ్లు, తీన్ మార్ నృత్యాలతో కనువిందు చేయనున్నాయి. నారాయణ గూడ కేంద్రంగా జరిగే సదర్ ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లించారు.యాదవకులస్తులకు అతి ప్రధాన ఉత్సవం కావడంతో సదర్ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి.సదర్ ఉత్సవాల్లో మిగతాకులాలకు చెందిన యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

Tags:    

Similar News