కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేసేది అక్కడి నుంచేనా?

తెలంగాణలో ఆ లోక్ సభ సీటు... బీఆర్‌ఎస్‌లో హాట్‌ ఫేవరెట్. అందరి చూపూ అటే.. ఆ సీటు నుంచి పోటీ చేస్తే గెలవడం ఖాయమనే ధీమాలో ఉన్నారు గులాబీ నేతలు.

Update: 2024-01-15 06:50 GMT
KCR

తెలంగాణలో ఆ లోక్ సభ సీటు... బీఆర్‌ఎస్‌లో హాట్‌ ఫేవరెట్. అందరి చూపూ అటే.. ఆ సీటు నుంచి పోటీ చేస్తే గెలవడం ఖాయమనే ధీమాలో ఉన్నారు గులాబీ నేతలు.

రాష్ట్రంలో ఏ పార్లమెంట్‌ సీటుకూ లేని పోటీ ఈ నియోజకవర్గానికి ఏర్పడింది. ఈ సీటుకు అభ్యర్థిగా ఎవరిని గులాబీ బాస్‌ ఖరారు చేస్తారో అన్నది ఉత్కంఠగా మారింది.

స్వయంగా ఈ సీటు నుంచే కేసీఆరే పోటీ చేయొవచ్చనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇంతకూ ఆ సీటు ఏంటో తెలుసా? నిజానికి ఆ సీటుకు బోలెడంత చరిత్ర కూడా ఉంది. ఈ దేశానికి ఓ ప్రధానమంత్రి అక్కడి నుంచే గెలిచారు. ఓ ముఖ్యమంత్రి అక్కడి నుంచే వచ్చారు. ఇలా బోలెడన్ని విశిష్టతలు ఉన్న నియోజకవర్గమే హైదరాబాద్ కు పక్కనున్న మెదక్. ఇప్పుడీ సీటు బీఆర్ఎస్ చాలమందికి హాట్ ఫేవరెట్. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్‌కు ఈ నియోజకవర్గం నుంచి ఎవర్ని పోటీకి దింపాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. అభ్యర్థి ఎంపిక ఓ సవాల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఆ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నేతలు పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనా మెదక్ లోక్ సభ సీటుకు పోటీ పడే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు.

ఇందిరా గాంధీ పోటీ చేసిన సీటిదే...

గతంలో మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇందిరా గాంధీ పోటీ చేసి ఘన విజయం సాధించి భారత ప్రధానమంత్రిగా పని చేశారు. తెలంగాణ సాధనకు నడుంకట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం. 2014 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా విజయం సాధించి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆ ఉపఎన్నికతో పాటు 2018 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆస్థానంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అవకాశం కల్పిస్తామని పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ నియోజక వర్గంపై కీలక నేతలు దృష్టి పెట్టడం హాట్‌ టాపిక్‌గా మారింది.

మదన్ రెడ్డి సహా ఎందరో...

ఇటీవలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అధికారం దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డికి మెదక్‌ ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చనే టాక్‌ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. దీంతో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గానికి ఇంచార్జిగా వ్యవహరిస్తున్న వంటేరు ప్రతాపరెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న ఎమ్మెల్సీ వెంకట్‌ రామిరెడ్డి కూడా ఈ సీట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేస్తానని పార్టీ పెద్దల ముందు ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

న్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన గాలి అనిల్ కుమార్ కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి చాగళ్ళ నరేంద్రనాథ్ ఈ స్థానంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే మాత్రం కేసీఆర్‌ స్వయంగా ఈ స్థానం నుంచి రంగంలోకి దిగే అవకాశముంది. మరోవైపు ఈ స్థానం నుంచి ఇతర పార్టీల జాతీయ నేతలు కూడా పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతుండటంతో బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించుతుందో అనేది ఆసక్తి రేపుతోంది.

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ అధినేత సొంత పార్లమెంట్‌ నియోజకవర్గం కావడం, మొత్తం 7 సీట్లలో ఆరు అసెంబ్లీలు బీఆర్ఎస్ ఖాతాలో ఉండటంతో తమ పార్టీ విజయం నల్లేరు మీద నడకేనని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌లో ఎంతోమంది నేతలు ఆశలు పెంచుకుంటున్నారు.

Tags:    

Similar News