రక్తం నీరు కల్సి ప్రవహించలేనప్పుడు పాక్ తో మ్యాచ్ ఎలా?

భారత్ పాక్ పై మ్యాచ్ పై స్పందించిన మజ్లిస్ అధినేత ఓవైసీ;

Update: 2025-09-14 12:59 GMT

భారత్ పాక్ మ్యాచ్ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.పహల్గామ్ దాడి తర్వాత రక్తం నీరు కల్సి ప్రవహించలేవని ప్రకటించిన ప్రధాని మోడీ మ్యాచ్ పై ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ పై స్పందించారు.మతాన్ని అడిగి పహల్గామ్ లో 26 మందిని పొట్టన బెట్టుకున్నారని, పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి అనుమతులు ఎలా ఇచ్చారని ఓవైసీ ప్రశ్నించారు. పాకిస్థాన్ తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పుడు, నీటి ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పుడు మ్యాచ్ ఎలా ఆడతారని ఓవైసీ బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చనిపోయిన దేశ బిడ్డలకంటే డబ్బే ప్రధానమా అని ఓవైసీ ప్రశ్నించారు.

పహల్గామ్ దాడి తర్వాత రెండు దేశాల మధ్య గ్యాప్ పెరిగినప్పటికీ ఇరు దేశాలు క్రికెట్ మ్యాచ్ విషయంలో ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. క్రికెట్ జట్లు మాత్రం ఆడటానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ‘‘అంతర్జాతీయ టోర్నమెంట్ లో మ్యాచ్ లు తప్పనిసరి ఆడాలి. లేని పక్షంలో మొత్తం సిరీస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది’’ అని క్రికెటర్లు అంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం భారత్ పాక్ మ్యాచ్ విషయంలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు #boycottpakistan match హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది. యువత సోషల్ మీడియాలో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది.

Tags:    

Similar News